రోహన్, ప్రీతి అన్నా చెల్లెళ్లు. వాళ్ల నాన్న పేరు ప్రకాశ్. ఒకరోజున వాళ్లు పుస్తకాలు కొనుక్కోవడానికి వెళ్తుంటే, దారిలో కొంత మంది మంచి నీళ్లలో చెత్త వేస్తూ కనిపించారు. మంచి నీళ్ళలోకి రాళ్ళు, మట్టి వేస్తూ కేరింతలు కొడుతున్నారు వాళ్ళు.

అప్పుడు రోహన్ అడిగాడు- "నాన్నా! ఎందుకు నాన్నా, వీళ్ళు అట్లా చేస్తున్నారు?” అని.

“ఆడుకుంటున్నారు బాబూ!” చెప్పాడు నాన్న.

“కానీ‌ నువ్వు నన్ను నీళ్ళు పాడు చెయ్యద్దంటావు కదా, మరి వీళ్లు ఎందుకు పాడు చేస్తున్నారు? ఇట్లా చెత్త వేస్తే నీళ్ళు పాడైపోతాయి కదా?” అన్నాడు రోహన్.

"వీళ్లకి మంచి నీళ్ల విలువ తెలియదు బాబూ!" అన్నాడు నాన్న.

"మరైతే మనం వాళ్ళకి తెలిసేట్లు చెయ్యాలి కదా?” అన్నది ప్రీతి.

"సరే- చెప్పి చూద్దాం" అని నాన్న ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి- “ఏయ్!‌ పిల్లలూ, మీరు ఎన్నో క్లాసురా?!” అన్నాడు గట్టి గొంతుతో.

వాళ్ళు ఇటుకేసి చూసి చటుక్కున చేతులు కట్టుకొని ” ఎందో తరగతి సార్" అన్నారు.

“ఎనిమిదో తరగతికి వచ్చారు- ఇట్లానారా, ఉండేది?!” అన్నాడు నాన్న.

వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు.

"ఇదిగో, చూడండిరా! మంచి నీళ్లు కిందకి ఎలా వస్తాయి? వర్షం ద్వారానే కదా? కానీ ఇప్పుడు చూడండి, మూడేళ్లుగా సరైన వర్షాలు పడక, చెరువులన్నీ ఎండిపోయాయి; బోర్లలో నీళ్ళు లేకుండా అవుతున్నాయి. నేలలోనూ నీళ్లు లేక; వర్షాలూ లేకపోతే ఇక పంటలు ఎట్లా పండుతాయిరా? మనం అందరం ఎట్లా బ్రతుకుతాం? ఉన్న కాసిని నీళ్లనీ‌ పొదుపుగా వాడుకోవాలిగానీ, ఇట్లా వృధా చేసుకుంటే ఎలాగ?” అన్నాడు నాన్న.

“తప్పయింది సార్! ఇంకెప్పుడూ ఇలా చేయం” అన్నారు పిల్లలు.