అనగనగా ఒక అడవిలో జింక, కుందేలు, కాకి, తాబేలు, ఆవు, ఏనుగు, ఎలుగుబంటి, ఇలా చాలా జంతువులు నివసించేవి. ఇలా ఎన్నో జంతువులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఏ బాధ లేకుండా ఉండేవి.
ఆ అడవిలో మరో మూలన ఒక సింహం ఉండేది. దాని పేరు సింగ్ మహరాజ్. ఓసారి అది మిగిలిన జంతువుల దగ్గరికి వచ్చింది. "నేను కూడా మీతో స్నేహం చేస్తాను" అన్నది.
"మీరంతా ఏమంటారు?” అందరినీ అడిగింది ఏనుగు. "నువ్వు మమ్మల్ని చంపేయవు కదా, మాతో మంచిగా స్నేహం చేస్తావు కదా?” అని సింహాన్ని అడిగాయి మిగిలిన జంతువులు.
"అయ్యో! నేను మీ స్నేహం కోసమే వచ్చాను. మిమ్మల్నెందుకు చంపుతాను?" అన్నది సింహం.
"అట్లా అయితే సరే" అని అందరూ ఒప్పుకున్నారు.
కానీ సింగ్ మహరాజ్ చాలా మోసపుది. అది అడవిలోనే ఒక పాడుబడ్డ ఇల్లును వెతుక్కున్నది. రోజుకు ఒక జంతువును రహస్యంగా మాయమాటలు చెప్పి అందులోకి తీసుకుపోయి, తినేయటం మొదలు పెట్టింది.
దాంతో త్వరలోనే జంతువులన్నీ తగ్గిపోసాగాయి. జంతువులన్నీ ఒక రోజున మర్రి చెట్టు క్రింద సమావేశం పెట్టుకున్నాయి: “మన అడవిలోకి వేటగాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదే?! మరి రోజురోజుకూ జంతువులు ఎలా తగ్గిపోతున్నాయి? ఎలుగుబంటి కూడా కనిపించట్లేదెందుకు?” అని అన్నీ బాధ పడ్డాయి. సింహం కూడా వాటితోబాటు కూర్చొని అంతా విన్నది, కానీ ఏమీ అనలేదు. కానీ కుందేలుకు మటుకు సింహం మీద అనుమానం వచ్చింది.
"దీన్ని కొంచెం గమనించు" అని అది కోతికి చెప్పింది. కోతి చెట్టుమీద కూర్చొని సింహాన్ని గమనించటం మొదలు పెట్టింది. సింహం ఆరోజున ఒక జింకను తీసుకొని పాడుబడిన ఇంట్లోకి వెళ్ళగానే కోతి అక్కడే నిలబడి గంతులు వేసింది; కిచ, కిచ మని ఒర్రింది. దగ్గర్లోనే ఉన్న కుందేలు కిటికీలోంచి లోనికి చూసి జరుగుతున్న మోసాన్ని కనుక్కున్నది. వెంటనే అవి రెండూ మిగిలిన జంతువులకు విషయం తెలియజేసాయి.
ఆరోజు సాయంత్రం పదిమందీ ఉండగా కుందేలు పరుగు పరుగున సింహం దగ్గరికి వెళ్ళింది. "సింగ్ మహరాజ్! మనల్ని ఎవరు చంపుతున్నారో కనుక్కున్నాను. మనల్ని మీరే కాపాడాలి! రండి! ఇక్కడో దొంగ సింహం ఉంది-
అది రోజూ మనవాళ్ళని చంపి తింటున్నది! మీరు దాన్ని క్షణంలో చంపెయ్యండి!” అని సింహాన్ని, మిగిలిన జంతువుల్ని కూడా ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది.
బావి లోకి చూసిన సింహానికి తన ప్రతిబింబమే కనిపించింది. "ఆగు! ఇప్పుడు నిన్ను చంపేస్తాను!” అని అది ఆవేశంతో బావిలోకి దూకింది. వెంటనే జంతువులన్నీ పైనుండి రాళ్ళు రప్పలూ విసిరి బావిలోనే దాన్ని తుదముట్టించాయి. జంతువులకు మోసకారి పీడ వదిలిపోయింది.