యువరాణి ఏరియల్‌కి ఈ మధ్యనే పెళ్లైయింది. ఫిలిప్ యువరాజు అందగాడు, వీరుడునూ. వాళ్లిద్దరూ ఒకరికొకరు తగిన జంట. రాజావారు వాళ్లకి రాజ్యాన్నప్పగించి విశ్రాంతి తీసుకుందామనుకున్నారు.
అంతలోనే అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. విహారానికని ఒంటరిగా వెళ్లిన యువరాణి ఏరియల్ తిరిగిరాలేదు.
రాజ్యమంతటా వెతుకులాట మొదలైంది. ఎక్కడా ఏరియల్ జాడలేదు. ఆమె జాడను కనుగొన్నవారికి కోటి రూపాయలు బహుమతి ప్రకటించారు రాజుగారు. అయినా ఏరియల్ జాడ తెలియరాలేదు. రాజావారు రాణివారు మనోవ్యాధితో కృంగిపోసాగారు. అల్లుడు ఫిలిప్ మనిషి మనిషిగా లేడు.
కొద్దిరోజులు ఇలా గడిచాక "మామయ్యా! ఇకలాభం లేదు. నేనే స్వయంగా వెళ్తాను. ఏడు ఖండాల్లో ఏరియల్ ఎక్కడున్నా వెదకి తెస్తాను." అని గుర్రం ఎక్కి బయల్దేరాడు.
ముందుగా వాళ్ల రాజ్యపు అడవిలో కొద్దిరోజులు గడిపి, అంగుళం అంగుళం పరిశోధించాడు రాజకుమారుడు. ఎక్కడా అతనికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.
అంతలోనే అతని కళ్ల ఎదురుగా ఓ పాము- మెల్లగా చెట్టు మీదికి ఎగ బ్రాకింది. చెట్టు మీద ఉన్న గూట్లో పక్షి పిల్లలు ప్రాణ భయంతో అరవసాగాయి. యువరాజు ఫిలిప్ చేతిలోని చురకత్తి తటాలున పైకి లేచింది. ఆ పామును రెండు ముక్కలు చేసేసింది.
సరిగా అదే సమయానికి తిరిగి వచ్చిన తల్లి పక్షి, తండ్రి పక్షి భద్రంగా ఉన్న పిల్లల్ని చూసుకొని మురిసిపోయాయి. చెట్టు క్రింద నిలబడి వాటి రాకను గమనించిన యువరాజు చిరునవ్వుతో ముందుకు కదిలాడు. అంతలోనే ధగధగ లాడుతున్న కిరీటం ఒకటి అతని ముందుకు వచ్చి పడింది.
ఫిలిప్ ఆ కిరీటాన్ని పట్టుకొని 'అది ఎట్లా వచ్చి పడిందా' అని పైకి చూశాడు. చెట్టు మీది పక్షుల జంట అతని వైపుకే చూస్తూ వింత గొంతులతో అరవసాగాయి.
"మీరు నాకేం చెబుతున్నారో అర్థం కావట్లేదు" అన్నాడు యువరాజు వాటితో.
పక్షులు ఇంకా గట్టిగా అరిచాయి. అంతలోనే వాటిలో ఒకటి తటాలున ఎగిరి వచ్చింది. నేరుగా యువరాజు చేతిలోని కిరీటాన్ని ఎగరేసుకుపోయింది!
యువరాజు గుర్రమెక్కి ఆ పక్షిని అనుసరించాడు. పక్షి చాలా దూరం ఎగురుతూ పోయింది. అడవి ఇంకా ఇంకా దట్టంగా మారింది. ఇప్పుడు యువరాజు ఉన్న ప్రాంతం అంతగా నర సంచారం లేనిది. విరిగిపడిన కట్టెలు, పుల్లలు ఎక్కడి వక్కడే మట్టిలో కలిసిపోతున్నాయి. పక్షుల కిలకిలలు, ఏటి గలగలలు తప్ప ఎక్కడా ఇంక వేరే ఏ శబ్దాలూ వినబడటం లేదు. నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఆ నేలలో ఎవరివో కాలిగుర్తులు...!
పక్షిని, పాదముద్రల్ని గమనిస్తూ ముందుకు సాగాడు యువరాజు ఫిలిప్. రాను రాను చెట్లు మరింత దట్టంగా మారాయి. చీకటి పడసాగింది. యువరాజు ఆ రాత్రికి అక్కడే చెట్ల మీద పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ఉదయాన్నే లేచి చూస్తే- క్రింద కట్టేసిన గుర్రం మాయం!
చేసేదేమున్నది?! యువరాజుకి మెల్లగా చెట్టు దిగి, కాలినడకనే ముందుకు సాగాడు. కొద్ది దూరం పోయే సరికి, కొండ గాలి జాడన, అతనికి గుర్రపు సకిలింత ఒకటి వినిపించింది.
అటుగా పరుగుపెట్టాయి, అతను కాళ్లు. కొద్ది సేపటికి ఫిలిప్ ఒక విశాలమైన గడ్డి మైదానాన్ని చేరుకున్నాడు. నేల మీదంతా ఒత్తుగా గడ్డి పరచుకొని ఉన్నది. ఎదురుగా ఓ జలపాతం.. సన్నగా శబ్దం చేస్తోంది. గుర్రం జాడలేదు.
యువరాజు చకచకా జలపాతాన్ని సమీపించాడు. చల్లని ఆ నేలలో ముఖం కడుక్కొని సేదతీరాడు. చల్లటి ఆ నీళ్లు అతనికి ఒక కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చాయి. అంతలోనే మళ్లీ ఒకసారి గుర్రపు సకిలింత!! సందేహంలేదు- అది తన గుర్రమే!
యువరాజు ఆ ప్రదేశం అంతటా గాలించాడు. జలపాతం, కొండ గడ్డి తప్ప మరేమీ లేనిది ఈ ప్రదేశం. మరి తన గుర్రం ఎక్కడుండి ఉంటుంది?
అన్ని వైపులా కలియ జూసాడు ఫిలిప్. ఎక్కడా గుర్రం జాడ లేదు. అయితే దప్పిక గొన్న యువరాజును జలపాతం ఆకర్షించింది. మెల్లగా అతని దాని వైపుకు నడిచాడు.. జలపాతానికి వెనకవైపున చీకట్లో దాక్కొని ఉన్నది ఒక గుహ! యువరాజు కత్తిని చేతబూని ధైర్యంగా గుహలోకి ప్రవేశించాడు. అదేమీ చిన్న గుహ కాదు- చాలా దూరమే సాగింది, సొరంగం లాగా. ఫిలిప్ యువరాజు ధైర్యంగా ఆ సొరంగంలో నడక సాగించాడు.
సొరంగం అంతా చీకటి నిండి ఉన్నది. అయితే అక్కడక్కడా కొండ బండల మధ్యలో ఉన్న సందుల గుండా బయటి కాంతి లోనికి వస్తున్నది. గుహ చివరికల్లా చేరుకున్న యువరాజుకు ఆశ్చర్యమైంది. గుహ ఇప్పుడు విశాలమైన ఒక పెద్ద ప్రాంగణంలోకి తెరుచుకున్నది. అందులో ఒక మూలన తన గుర్రం!
యువరాజు ఫిలిప్ గబగబా అటువైపు అడుగులు వేశాడు. గుర్రం అతన్ని చూసి సంతోషపడింది. కన్నీరు కార్చింది. అతను కూడా గుర్రాన్ని నిమిరాడు. దానికి ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారణ చేసుకున్నాడు. అయితే దాని కళ్లాన్ని పట్టుకొని ఎంత లాగినా అది మాత్రం కదల్లేదు!
అంతలో అక్కడ గోడకున్న చిన్న తలుపొకటి అతని దృష్టిని ఆకర్షించింది. తలుపు తట్టిన యువరాజు ఎలాంటి జవాబు రాలేదు. అయితే తలుపు మాత్రం మెల్లగా తెరుచుకున్నది.
లోపల గదులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఒక మూలంగా కిరీటం ఒకటి పడి కనిపించింది! యువరాజు సంతోషంగా వెళ్లి ఆ కిరీటాన్ని పరిశీలించాడు. అంతకు ముందు తనకు అడవిలో దొరికిన కిరీటం లాంటిదే ఇది! అయితే దానిని పక్షి ఎత్తుకెళ్లింది కదా, ఇది మరొకటేమో.
యువరాజు ఆ కిరీటాన్ని తీసుకొని పరిశీలించాడు. దాన్ని తన తలమీద పెట్టుకొని, వెనక్కి తిరిగి వచ్చి, అన్ని వైపులా చూశాడు. 'ఎవరైనా ఉన్నారేమో' అని అరిచాడు. జవాబు లేని నిశ్శబ్దం...! యువరాజు నిట్టూరిస్తూ తిరిగి గుర్రం ఎక్కబోయాడు- అంతలో అతని తలపైన ఉన్న కిరీటం కాస్తా జారి, గుర్రం మీద పడింది. చిత్రం! మరుక్షణం గుర్రం యువరాణిగా మారిపోయింది!
"కానీ యువరాణి ఇంత పెద్దగా ఉందేంటి?" అని ఆశ్చర్యపోయాడు ఫిలిప్. ఎందుకంటే ఇప్పుడు అతను యువరాణి మోకాళ్ల ఎత్తుకు కూడా రాలేదు!
"ఏంటిది, యువరాణి ఏరియల్?!" అని అరవబోయాడు అతను. అయితే అతని గొంతు ఇదివరకులా రానే లేదు..!
కేవలం "మ్యావ్ మ్యావ్" అని శబ్దం మాత్రం వెలువడింది!!
యువరాజు ఫిలిప్ ఇప్పుడొక పిల్లిగా మారిపోయాడు!!
అతను గట్టిగా అరుస్తూ ఏదేదో చెప్పాలని యువరాణి కాళ్లను రాసుకుంటూ తిరిగాడు.
అయితే యువరాణి తను ఎవరో గుర్తు పట్టనే లేదు. పిల్లిని ముద్దు చేస్తూ" ఏంటి పిల్లీ! ఏంటి పిల్లీ!" అని మాత్రం అంటున్నది! యువరాజు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. "ఏం జరుగుతున్నది, ఎందుకిలాగ? తనకి పిల్లి రూపం ఎందుకొచ్చింది? యువరాణి గుర్రం ఎలా అయింది?!" అంతులేనన్ని ప్రశ్నలు అతని చిట్టి పిల్లి మెదడును తొలిచేశాయి.
ఇంతలో పిట్ట ఒకటి వింతగా అరుచుకుంటూ అక్కడికి వచ్చింది. తన కాళ్లతో పట్టుకొని ఉన్న మరో కిరీటాన్ని తటాలున పిల్లి మీదికి జారవిడిచింది.
మరుక్షణం యువరాజుకి అసలు రూపం ప్రాప్తించింది! యువరాణి ముఖం విప్పారింది.
సంతోషంతో వాళ్లిద్దరూ కొద్దిసేపు ఈ లోకాన్ని మర్చిపోయారు. ఆ తరువాత ఇద్దరూ గుహలో నుంచి వచ్చిన దారినే బయటపడి నడకసాగించారు. రాజ్యాన్ని చేరుకున్నారు.
అసలు యువరాణి గుర్రం ఎందుకైందీ, యువరాజు పిల్లిగా ఎందుకు మారిందీ, తిరిగి వాళ్ల ఇద్దరికి యధారూపాలు ఎందుకొచ్చిందీ అర్థమైందా? యువరాణిని ఓ మంత్రగత్తె ఎత్తుకెళ్ళిందట! ఆమెని గుర్రంగా మార్చేసిందట! ఆమెని కాపాడాలంటే ఓ కిరీటం కావాలి. దాన్ని ఉపయోగించినవాడు పిల్లి ఐపోతాడు. మళ్ళీ వాడు మనిషి అవ్వాలంటే ఇప్పుడు రెండో కిరీటం కావాలి. పక్షుల పుణ్యమా అని ఆ రెండు కిరీటాలూ వీళ్లకు దొరికాయన్నమాట! అదీ కథ!!