బతుకమ్మ పండుగ ఈ నెల ముఫ్ఫైన మొదలవుతున్నది. తెలంగాణలో ఊరూరా పిల్లలు, పెద్దలు పూలతో బతుకమ్మల్ని పేర్చి సంబరాలు జరుపుకుంటారు; బతుకు తల్లిని కొలుస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ ద్వారా మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండాలో తెలుసుకుందాం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

ప్రాచీన తెలుగు కవుల్ని సంస్కృతభాష ప్రభావితం చేసినంతగా మరే భాషా ప్రభావితం చెయ్యలేదు. మన గ్రంథాల్ని తప్పుల్లేకుండా అర్థం చేసుకోవాలంటే కొద్దో-గొప్పో సంస్కృతం వస్తేనే మంచిది. మరి ఆ సంస్కృతాన్ని కూడా కథలతో పరిచయం చేస్తే ఎంత బాగుంటుంది! చమత్కార శ్లోకాల్ని, వాటి వెనక కథల్ని ఒకటొకటిగా ఈ మాసం నుండి మనకు తెలియజేసేందుకు అంగీకరించారు, ఇయన్వీ రవిగారు. వారికి ధన్యవాదాలు.

'ఏదో ఒక పని- చేస్తూ పోతే- ఏదో ఒకటి అవుతుంది' అని నవ్వు నవ్వుగా చెప్పే మూడంచెల ధారావాహిక- 'నేతగాడు-డ్రాగన్' మొదటి అంచెను ఈ సంచికలో చదవండి; మరి ఏదో ఒక మంచి పనిని ధైర్యంగా చేస్తూ పోండి! ముందైతే ఈ కొత్తపల్లినంతా చదివెయ్యండి!!