కోలాచలం అనే ఊళ్ళో మల్లినాథుడు అనే యువకుడు ఒకడు ఉండేవాడు. వాడు వట్టి పోకిరి; చదువు సంధ్యలు లేవు. ఊరికే బలాదూరుగా తిరుగుతుండేవాడు. అలాగే బాల్యం అంతా గడిపేశాడు. యువకుడయ్యాడు.
పెళ్ళైతే బాగుపడతాడేమోనని అతడికి పెళ్ళి చేశారు ఇంటి వాళ్ళు. భార్య పాపం, చక్కగా చదువుకుంది. భర్త మూర్ఖత్వాన్ని చూసి ఆమె కుమిలిపోతుండేది. ఎలాగైనా అతనికి బుద్ధి గరపాలని అనుకునేది. ఆ సందర్భమూ రానే వచ్చింది.
ఓ మారు ఇంట్లో ఏదో పండుగ వచ్చింది. ఇంటినిండా చుట్టాలు వచ్చి ఉన్నారు. అందరూ ఏవోవో పనుల్లో ఉన్నారు. "వెళ్ళి పూజకు కాసిన్ని పూలు తీసుకురారా, మల్లినాథా" అన్నారు.
మల్లినాథుడు అటూ ఇటూ చూసాడు. ఇంటికి ఎదురుగా ఉన్న ఓ పెద్ద మోదుగ చెట్టు కనిపించింది. నేరుగా వెళ్ళి, చెట్టెక్కి, బుట్టనిండా మోదుగపూలు కోసుకొచ్చాడు.
మోదుగపూలేమో మరి పూజకు పనికి రావాయె! అతనికి పని అప్పజెప్పిన పెద్దవాళ్ళు నెత్తికొట్టుకున్నారు- “పోరా! పోయి ఎక్కడైనా ఓ మూలన కూర్చో! పనేమీ చెయ్యకు! అనవసరంగా ఇంకోళ్ళకి కష్టం!” అంటూ అతనిని అక్కడ నుంచి తరిమేసారు.
ఇంటికి వచ్చిన బంధువులు కూడా అతన్ని చూసి నవ్వారు. అయినా మన మల్లినాథుడికి మాత్రం వాళ్ళెందుకు నవ్వారో అర్థం కాలేదు.
కాసేపటికి, పూజలవీ అయిన తర్వాత, అందరూ భోజనాలు చేస్తున్నారు. భార్య అతనికి చారు వడ్డించింది. కానీ ఆ చారులో ఉప్పు వెయ్యలేదు !
’ఉప్పు లేదేంటి?’ అన్నాడు మల్లినాథుడు. అందుకు భార్య ఇలా చెప్పింది.
చారు చారు సమాభాతం
హింగు జీర సమ్మిశ్రితమ్ |
లవణ హీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా॥
"బాగా చిక్కటి రంగుతో, ఇంగువ, జీలకర్ర వంటి దినుసులతో చేసినా సరే, తగినంత ఉప్పు లేని చారు - ’మోదుగపువ్వు పూజకు ఎలా పనికిరాదో అలా’- అస్సలు బావుండదు"
అది విని భోజనాలకు కూర్చున్న బంధువులందరూ పెద్దపెట్టున నవ్వారు. మల్లినాథునికి అవమానమయ్యింది. తింటూ తింటూ మధ్యలోనే చేతులు కడుక్కుని లేచిపొయ్యాడు!
అలా పోయిన వాడు, నేరుగా కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ పండితులను ఆశ్రయించి అన్ని శాస్త్రాలూ నేర్చుకుని మహా పండితుడు అయ్యాడు. మల్లినాథ ’సూరి’ అనిపించుకున్నాడు. 'సూరి' అంటే 'పండితుడు' అని అర్థం.
మల్లినాథ సూరి ఇంటికి తిరిగి వచ్చాడు. సంస్కృతంలో కాళిదాసు, భారవి వంటి ప్రముఖుల కావ్యాలకు వ్యాఖ్యానాన్ని రచించి ఎనలేని పేరు ప్రతిష్టలు సంపాదించాడు.
ఇప్పుడు అతన్ని చూసి భార్య మెచ్చుకున్నది. బంధువులు ఆనందించారు. అట్లాంటి ఆ మల్లినాథసూరి తెలుగు వాడవటం మనకు గర్వకారణం.