అనగనగా డులీక్‌లో ఒక నేతగాడు ఉండేవాడు. ఒకరోజు ప్రొద్దున అతను మగ్గం ముందు కూర్చొని ఉండగా, "అయ్యా బువ్వ తినిపోదురా" అని ఇంటామె పిలిచింది.

"ఇదిగో నావెంట పడకు! క్రొత్త డిజైన్ మొదలుపెట్టాను; అది బాగా వచ్చేంతవరకు నేను ఇక్కడ నుండి కదిలేది లేదు" అరిచాడు నేతగాడు.

"నీకోసం దోసెలు పోశానయ్యా! చల్లారి పోతే బాగుండవు" అన్నది ఇంటామె. నేతగాడికి కోపం వచ్చింది. తిట్లు లంకించుకున్నాడు. "నీ దోసెలు కూల- నాతో మాట్లాడకు! నీకేం కావాలో అది చేసుకో!” అనేసాడు.

"ఇంత మంచి దోసెల్ని తిట్టినందుకు దేవుడు నిన్ను ఏమీ చేయకపోతే అదొక్కటే చాలు!” అని గొణిగింది భార్య.

ఆ తర్వాత రెండు గంటలకు నేతగాడు పని పక్కన పెట్టి, లేచి వెళ్లే సరికి దోసెలు చట్ట చల్లారి పోవటమే కాదు; ఒక్క మిల్లీ మీటరు ఖాళీ కూడా లేకుండా అవి నల్లగా- మాడిపోయినట్లు- కనబడ్డాయి!

"ఇదేంటి, దోసెలు ఏమిటి, నల్లగా ఉన్నాయి?” అని అతను దగ్గరగా వంగి చూసేసరికి తెలిసింది: నల్లగా ఉన్నవి దోసెలు కావు వాటి మీద మూగిన ఈగలు! వానాకాలం కదా, ఊళ్లో ఉన్న ఈగలన్నీ వచ్చి తేరగా పెట్టిన దోసెల మీద వాలాయి!

నేతగాడు ఈగల్ని కసితీరా తిట్టి "దయ్యాల్లారా! ఇంత మంచి మంచి దోసెల్ని పాడు చేయడానికి మీకెన్ని గుండెలు?” అని అరిచాడు. అయితే ఆ అరుపుతో వాడి కోపమేమీ తగ్గలేదు; ఈగలు కూడా ఎగిరిపోలేదు. దానితో వాడు ఇక ఆగలేక పోయాడు: అరచేయి చాచి, దోశల్ని ఒక్క చరుపు చరిచాడు. కొన్ని ఈగలు ఎగిరి పో- గలిగాయి. కాని చాలా ఈగలు చచ్చిపోయాయి కూడా.

చచ్చిపోయిన ఈగలన్నిటినీ దోసెలనుండి వేరుచేసి క్రిందపడేస్తూ లెక్కపెట్టాడు నేతగాడు. మొత్తం డెబ్భై ఈగలు లెక్కతేలాయి.

"ఒక్క దెబ్బకు డెబ్భై దయ్యాలు!" అని వాడికి చాలా సంతోషమైపోయింది. చచ్చిపోయిన ఈగల్ని మళ్లీ మళ్లీ లెక్కపెట్టిన కొద్దీ వాడి సంతోషం రెట్టింపైంది. తన లోపల మహాత్తరమైన శక్తి ఏదో ఉదయించినట్టు, తన గొప్ప వీరయోధుడు అయిపోయినట్లు వాడికి అనిపించసాగింది. ఒకే దెబ్బకు డెబ్భై డెబ్భై ప్రాణాలు తీసినందుకు వాడు గర్వంతోటీ, అతిశయంతోటీ ఉబ్బి-పోయాడు.

ఇక ఆ రోజంతా వాడు ఒక సెంటీ మీటరు బట్ట కూడా నేయలేదు. ఊరంతా కలియ తిరిగి, కనిపించిన వాడికల్లా "ఇదిగో ఈ చేత్తోటే!! ఒక్క చరుపుతో డెబ్భై ప్రాణాలు తీశా! ఊరికేనా?!” అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు.

"చూడండి! ఇన్నేళ్లుగా నేను నేత పనిలో మునిగి, నా‌శక్తుల్ని గుర్తించక, జీవితాన్ని వృధా చేసుకున్నాను. నిజంగా నేను ఎవరు అయ్యి ఉండాలో చెప్పమంటారా? అసలు నేను ఆ చక్రవర్తినే అయి ఉండచ్చు; లేదా‌ ఆయన్నే భయపెట్టే డ్రాగన్ అవతారాన్ని కూడా అయి ఉండచ్చు- లేదా వాళ్లిద్దర్లో ఎవరో ఒకర్ని అయ్యి ఉండచ్చు! అర్థమైందా, ఇవాల్టి నుండి నేను మామూలు నేతగాడిని కాదు. 'సంచరించే వీరయోధుడిని' నేను. ఆ సంగతి మీరు గుర్తించండి- సంచారంలో ఉన్న వీర యోధుడ్ని నేను!" అని గట్టిగా అందరికీ చెప్పుకుంటూ‌ తిరిగాడు.

దానికి తగినట్టుగా మరుసటి రోజు తెల్లవారగానే ఇరుగు పొరుగు ఇళ్లకంటా వెళ్లి, తనకు కనబడ్డ పాత పుల్లల్ని, టీ కాచే గిన్నెల్ని కొట్టుకొచ్చాడు. వాటన్నిటినీ తన దగ్గరున్న ఓ మొద్దు చర్మపు ముక్కతో కలియగుట్టి, కవచంలాంటి దాన్ని ఒకదాన్ని తయారు చేశాడు.

ఆ తర్వాత తను సంపాదించిన ఓ పాత బాణలిని తన మిత్రుడైన ఓ పెయింటర్ దగ్గరకు తీసుకెళ్ళి, అతనిచేత దానిమీద పెద్ద అక్షరాలలో రాయించాడు: "ఒక దెబ్బకు ‌70 ప్రాణాలు తీసిన వీరయోధుడు ఇతడే!" అని!

"నా డాలు మీద అట్లా రాసి ఉన్న దాన్ని చదివి, ప్రజలందరూ కొంచెం కొంచెంగా కంపించిపోతారు” అన్నాడతను.

ఇవన్నీ‌ చేసిన తర్వాత అతను ఇంటికి వెళ్ళి ఇల్లాలిని ఆజ్ఞాపించాడు- "ఇదిగో! పాత కుండను ఒకదాన్ని బాగా రుద్ది, నల్లగా మెరిపించి ఇవ్వు!” అని. "నిజంగా మెరిసిపోవాలది! చూసినవాళ్ళ కళ్ళు మిరమిట్లు గొలవాలి!" అన్నాడు.

"దానితో ఏం చేస్తావు? నెత్తిమీద పెట్టుకుంటావా?” అన్నది భార్య, ఒకింత అనుమానంగా.

"అవును. సరిగ్గా కనుక్కున్నావు!” అన్నాడు నేతగాడు. "వీరయోధుని తల మీద ఆ మాత్రం బరువు ఉండాలి"

"కానీ దానికి రంధ్రాలు ఉన్నాయి కదా, వాన కురిస్తే నీళ్ళు కారతాయి కదా?” అన్నది భార్య, ఎలాగైనా అతనిచేత ఈ పనిని ఆపించాలని.

"మరీ మంచిది. అప్పుడు తలంతా చల్లగా, హాయిగా ఉంటుంది! అట్లాగే ఉండనియ్యి చిల్లుల్ని!” ఆనతిచ్చాడు వీరుడు. "కానీ దీనికున్న హ్యాండిల్ వికారంగా ఉంది- ఈ హ్యాండిల్ ఒక్కటీ లేకపోతే ఇది నిజంగానే శిరస్త్రాణంగా పనికొచ్చును! " అన్నది భార్య.

"పిచ్చిదానా, నీకేం తెలుసు?! ప్రతి శిరస్త్రాణంలో నుండి కనీసం కొన్ని కొమ్ములైనా బయటికొచ్చి ఉండాలి. అదే అసలు రహస్యం" అన్నాడు నేతగాడు గర్వంగా.

చివరికి "నీయిష్టం" అనేసింది భార్య, కుండను మరింత గట్టిగా రుద్దుతూ. " నీ గొర్రె తలకి ఇంతకంటే గొప్ప కిరీటం సరిపోదులే" అంటూ.

"బాగు బాగు! కనీసం ఇప్పటికైనా నా గొప్పతనాన్ని గుర్తించావు. అది చాలు!" అని నేతగాడు తను కుట్టిన కవచాన్ని ధరించి, తను తయారు చేసుకున్న కిరీటం పెట్టుకొని కాలి నడకనే బయలుదేరి పోయాడు.

అట్లా ఊరు దాటేసరికి వాడికి ఓ ప్రక్కన గడ్డి మేస్తున్న గుర్రం ఒకటి కనిపించింది. గుర్రపు యజమాని మిల్లర్ కొద్ది దూరంలో చెట్టుకు ఆనుకొని కునుకుతున్నాడు.

"ఇదిగో- ఇదే, నా యుద్ధాశ్వము!” అన్నాడు యోధుడు గట్టిగా- "ఇంతకాలమూ ఇది ఈ మిల్లర్ మూటలు మోస్తూ బతికింది. ఇప్పుడు ఇక ఇది నా శౌర్య ప్రతాప సుమాలను మోసుకెళ్తుంది!” అని వాడు గబ గబా గుర్రం మీదికి ఎక్కి తోలబోయాడు దాన్ని. కానీ అంతగా అలవాటు లేని ఆ గుర్రం ఓమారు గట్టిగా సకిలించి, ముందు కాళ్లు రెండూ ఒకేసారి పైకెత్తింది! దాని కాళ్లక్రింద పడకుండా ఉండేందుకు జీనును, కళ్ళాన్ని పట్టుకొని వ్రేలాడసాగాడు వీరయోధుడు.

గుర్రపు సకిలింత విని కళ్ళు తెరిచి చూసిన మిల్లర్ ఒక్క క్షణం బిత్తరపోయి, తేరుకొని బిగ్గరగా నవ్వుతూ "నా మహత్తర పంచకల్యాణి గుర్రాన్ని నా అనుమతి లేకుండా దొంగిలిస్తున్నది నువ్వేనా, ఓ నా నిజమైన వీరయోధుడా?!” అని అరిచాడు వెటకారంగా.

"లేదు లేదు! చల్లని సాయంత్రం వేళ అశ్వాన్ని ఇలా వ్యాయామం చేయించేందుకు తీసుకెళ్తున్నా. యుద్ధాశ్వాలకు వ్యాయామం ఎంత అవసరమో నీకు తెలీని సంగతి కాదు" అన్నాడు నేతగాడు, సమయస్ఫూర్తితో.

"థాంక్యూ! కానీ నా గుర్రాన్ని ఉన్న చోటే వదిలి పారిపో, మర్యాదగా!” పళ్లు నూరాడు గుర్రపు యజమాని మిల్లర్.

"క్షమించు మిత్రమా! యుద్ధరంగం పిలిస్తోంది. కాలక్షయం కూడదు. వీరులంతా నా కోసమే చూస్తున్నారు! దేశ హితం కోసం నువ్వీ పంచకల్యాణి గుర్రాన్ని త్యాగం చేయక తప్పదు!” అని అరిచి, అరచేత్తో గుర్రాన్ని చెళ్ళున చరిచి ముందుకు దూకించి, క్షణంలో కనుమరుగయ్యాడు నేతగాడు.

(మూడు భాగాల ధారా వాహికలో‌ ఇది మొదటి భాగం. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూద్దురు! అంత వరకూ టెన్షన్..టెన్షన్!