దట్టమైన ఓ అడవి అంచున, శ్రీపురం అనే ఊరొకటి ఉండేది.

అడవి మధ్యలో పెద్ద రావిచెట్టు ఒకటి ఉండేది. దాని క్రింద హరితానందుడనే సాధువు ఒకాయన ఉండేవాడు. ఊళ్లో ఏ సమస్య వచ్చినా జనాలు ఆయన్ని సలహా అడిగేవాళ్ళు. ఆయన కూడా బాగా ఆలోచించి, వివేకంతో‌ కూడిన సలహాలు ఇస్తుండేవాడు.

శ్రీపురంలో రవి, రాజు అనే ఇద్దరు అల్లరి పిల్లలు ఉండేవారు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఎవ్వరికీ తెలియకుండా అడవిలోకి బయలుదేరారు. అక్కడ ధ్యానంలో ఉన్న హరితానందను చూసి, ఆయనను అనుకరిస్తూ, ఎగతాళి చేయటం ప్రారంభించారు.

హరితానంద ధ్యానం ఆపి, వాళ్లకేసి చూసి నవ్వుతూ “ఏంటి, మీరిద్దరే వచ్చారా, అడవిలోకి?! అడవి క్రూర మృగాలకీ, విష కీటకాలకీ నిలయం కదా; ప్రకృతితో మమేకం చెందగల గిరిజనులు మాత్రమే అడవిలో తిరుగాడగలరు. అడవిలో ఎన్నో ఆపదలుంటాయి. ఇక్కడికి రాకూడదమ్మా పిల్లలు! వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోండి, వెంటనే!" అని హెచ్చరించాడు.

ఆయన మాటలు లెక్క చేయలేదు పిల్లలిద్దరూ. "మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీకేమీ కాలేదు కదా, మాకూ ఏం కాదు- మాకు కూడా ప్రకృతి అంటే ఏంటో తెలుసు!" మొండిగా అంటూ వాళ్ళిద్దరూ సైకిళ్లెక్కి, ఇంకా అడవి లోలోపలికే దారి తీసుకుంటూ పోయారు.

క్రమంగా సూర్యుడు అస్తమించసాగాడు. రవి, రాజులు వెనక్కి తిరుగుదామనుకునే సరికే చీకట్లు క్రమ్ముకున్నాయి. వచ్చిన దారి తప్పారు ఇద్దరూ. అడవి బయటికి వస్తున్నామనుకుంటూనే మరింత లోపలికి వెళ్ళారు. ఇప్పుడిక వారికి భయం వేయటం మొదలు పెట్టింది.

చీకట్లు ముదిరినై. అంతలో పురాతనమైన గుడి ఒకటి, నల్లగా కనబడింది వాళ్లముందు. “ఇక్కడ ఎవ్వరూ ఉండరు! మనం చిక్కుపడిపోయాం, చీకట్లో!” అని ఏడుపొచ్చింది వాళ్లకి.

అంతలోనే గుడి లోపలినుండి సన్నగా దీపపు కాంతి కానవచ్చింది. “వావ్! ఇక్కడ ఎవరో ఉన్నారు! మనం ఈ రాత్రికి ఇక్కడ ఆగచ్చు!” అన్నాడు రవి ఆశగా. మెల్లగా ఇద్దరూ గుడి దగ్గరికి వెళ్ళి, తలుపును మెల్లగా నెట్టారు.

ఐతే ఆ గుడికి అసలు మామూలు మనుషులు ఎవ్వరూ రారు! నలుగురు అడవి దొంగలకు అది స్థావరం! తలుపులు తెరుచుకోగానే దొంగలు అటు తిరిగి చూసి, తటాలున లేచి వాళ్ల వెంట పడ్డారు.

పిల్లలు పిక్కల సత్తువ కొద్దీ పరుగు అందుకున్నారు. అంతలోనే వాళ్ల దారికి ఓ పెద్ద కొండ చిలువ అడ్డొచ్చింది! ఇద్దరూ కెవ్వున కేక పెట్టి, శిలా విగ్రహాల లాగా నిలబడిపోయారు- గట్టిగా కళ్లు మూసుకొని. అంతలో‌ ఎవరో వాళ్ళిద్దరి చేతులూ పట్టుకొని పక్కకి లాగినట్టనిపించింది. కళ్లు తెరచి చూస్తే అక్కడ హరితానందుడు!

'పో! వీళ్ళు నీ ఆహారం‌ కారు!' అన్నాడు సాధువు, కొండచిలువతో. దానికేం అర్థమైందో మరి, అది నెమ్మదిగా వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. అంతలోనే అటుగా వచ్చిన దొంగలు కూడా ఆయనకు నమస్కరించి, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు.

రవి, రాజు ఆశ్చర్య చకితులయ్యారు- “స్వామీ! కొండ చిలువలు, దొంగలు మీ మాటనెలా విన్నారు?!" అని అడిగారు. హరితానందుడు చిన్నగా నవ్వాడు. “ ఏం లేదు బాబులూ! పాము నా మాట వినాలనుకున్నది; విన్నది. దొంగలూ అంతే- నా మాట వినాలనుకున్నారు, విన్నారు. కానీ‌ మీరు వాళ్లకంటే ఎక్కువ తెలివిగలవాళ్ళు- నా మాట వినదల్చుకోలేదు; వినలేదు; ఆపదలో పడ్డారు. ఒక్కోసారి ఇతరుల మాటను మన్నించటం మేలు చేస్తుంది" అన్నాడు ప్రశాంతంగా.

రవి రాజు సిగ్గుతో తల దించుకున్నారు.

అటు తర్వాత వాళ్ళు పెద్దల మాటల్లో ఏమాత్రం మంచి విషయాలున్నా వాటిని గ్రహించి ఆచరించటం అలవాటు చేసుకున్నారు.