అనగనగా ఒక అడవిలో ఒక పాము ఉండేది. దానికి పళ్ళు ఒకటే ఉలఉల అనేవి. కనిపించిన జంతువునల్లా ఊరికే కొరుకుతుండేది. సింహరాజుకి ఈ సంగతి తెల్సి- 'ఇదిగో- నీకు ఇది చివరి అవకాశం. మర్యాదగా నీ అలవాటు మానుకో. లేకపోతే అంతే' అనేసింది.

పాము చిన్న ముఖం పెట్టుకొని ఏడుస్తూ‌ పోతుంటే చెట్టు మీద ఉండే కోతి ఒకదానికి జాలి వేసింది. “ఎందుకు, ఏడుస్తున్నావ్ పామూ?” అని అడిగింది.


“సింహం నన్ను బెదిరిస్తోంది. 'చెప్పినమాట వినకపోతే అంతే' అంటోంది!” ఫిర్యాదు చేసింది పాము. కోతికి కోపం వచ్చింది. "అట్లా ఎట్లా అంటుంది? వీల్లేదు. నువ్వు నా చెట్టు క్రింద ఉండు. నీకేమీ కాకుండా నేను చూస్తాను" అన్నది.

మరుసటి రోజు ఉదయాన్న కోతి ఆహారం కోసమని అడవిలోకి వెళ్ళగానే పాము పళ్ళు మళ్ళీ ఉలఉల మన్నాయి. దేన్ని కొరకాలా, అని చూస్తే దానికి మూడు కోతి పిల్లలు కనిపించాయి. వెంటనే అది చెట్టెక్కి కోతిపిల్లల్ని తనివితీరా కరిచి, ఏమీ ఎరుగని దానికి మల్లే చుట్ట చుట్టుకొని పడుకున్నది.

సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన కోతికి నురగలు క్రక్కి చనిపోయిన పిల్లలు కనిపించేసరికి విపరీతమైన ఆవేశం వచ్చింది. " 'పాముకు పాలు పోయటం' అంటే ఇదే. దారినపోయే పామును ఊరికే నెత్తికెక్కించుకున్నాను" అని ఎంతో బాధ పడిన కోతి, బండరాయిని ఒకదాన్ని తెచ్చి పాము మీద పడేసింది. అయినా కోపం ఆపుకోలేక దాన్ని తగలబెట్టేసింది!