వేటగాడి ఉపాయం
“ఇదుగో పాపలూ! కొత్త కొత్త వస్తువుల్నిగానీ, మనుషుల్ని గానీ నమ్మి దగ్గరికి పోకండి!” అని పిల్లలందరికీ చాలాసార్లే చెబుతుండేది తల్లి ఉడత. ఉడత పిల్లలన్నీ‌ చక్కగా తలలూపేవి. అయితే వాటిలో‌ చిన్న పిల్లకు మటుకు అమ్మ మాటలు నచ్చలేదు. “ఎందుకట?! ఊరికే భయపడేది ఎందుకు?! నేను కొత్త వస్తువుల్ని ఎంచక్కా ముట్టుకుంటాను. నాకేమీ‌ కాదు" అనుకునేది.

ఆ ప్రాంతంలోనే ఓ వేటగాడు ఉండేవాడు. అతనికి ఉడతల్ని పట్టుకోవటం అంటే చాలా ఇష్టం.. అతను వాటిని తినేవాడు; లేకపోతే అమ్ముకునేవాడు.

అయితే ఓసారి చలి కాలంలో బాగా మంచు పడింది. ఉడతలు అస్సలు బయటికి రాలేదు. వేటగాడికి చాలా కష్టమైంది. వాటిని బయటికి రప్పించటంకోసం వాడు ఒక ఉపాయం ఆలోచించాడు. మంచుతో చక్కని బొమ్మలాగా చేసాడు. ఆ బొమ్మకి ఒక క్యారెట్ ముక్క పెట్టాడు. తను ఆ ప్రక్కనే ఓ చెట్టు మాటున నక్కాడు.

కొద్దిసేపటికి క్యారట్ వాసన తగిలి చిన్న ఉడత బయటికి వచ్చింది. అక్కడ దానికి ఓ చక్కని మంచుమనిషి కనిపించాడు! దాన్ని చూడగానే ఉడతకు చాలా సంతోషం వేసింది. "అబ్బ!ఏమిటబ్బా ఇది, బలే ఉంది! అని, మంచు మనిషి దగ్గరకు వెళ్లి, దాని ముక్కుకున్న క్యారెట్టును పట్టుకొని తినబోయింది.

సరిగ్గా అదే సమయంలో వేటగాడు వల విసిరి పట్టుకున్నాడు దాన్ని, “దొరికావు! ఇప్పుడు నిన్ను ఎట్లా తింటానో చూద్దువు!” అని వాడు దాన్ని ఒంటి చేత్తో గట్టిగా పట్టుకొని, వలనుండి తప్పించాడు. అంతలో వాడి సెల్‌ఫోను గణగణా మ్రోగటం, వాడు ఉడతమీద పట్టును సడలించి సెల్‌ఫోను తియ్యటం; ఉడత వాడి వేలును గట్టిగా కొరికి క్రిందికి జారి పరుగెత్తటం- అన్నీ కనురెప్ప పాటులో జరిగిపోయాయి!

అయితే ఈ దెబ్బతో ఉడత పిల్లకు జ్ఞానోదయం అయింది. కొత్తగా, వింతగా ఉన్న వస్తువుల జోలికి వెళ్లకూడదని దానికి అర్థమైంది! -కె.సాత్విక

ఉడతకు సాయం చేసిన మంచు బొమ్మ

అనగనగా ఒక ఊళ్లో ఒక ఉడత ఉండేది. ఆకలి వేసినప్పుడు తినేందుకని అది దాని ఇంటిలో ఎక్కడో కొంత ఆహారాన్ని భద్రంగా నిలవ ఉంచుకున్నది.

ఒకరోజు నిద్ర నుంచి లేవగానే పాపం దానికి బాగా ఆకలి వేసింది. కానీ తను ఆ ఆహారాన్ని ఎక్కడ దాచిపెట్టిందో మరచిపోయిందది! ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తు రాలేదు! బాగా వెతికి-వెతికి- గంటలతరబడి వెతికాక, దానికి తను ఆహారం దాచిన చోటు దొరికింది- కానీ తీరా అది కూర్చొని ఆహారం చేత పట్టుకునే సరికి ఎలుక ఒకటి వచ్చిపడింది. ఉడత ముందున్న ఆహారాన్ని మొత్తం చటుక్కున ఎత్తుకొని పారిపోయింది!

ఉడత ఎలుకను వెంబడిస్తూ ఇంటి బయటికి వచ్చి, అటు-ఇటు చూసింది: ఎక్కడా ఎవ్వరూ లేరు! ఎలుక జాడ లేనే లేదు! 'ఇలా కుదరదు' అని అది ఎలుకని వెతుక్కుంటూ పోయింది. అంతలో దానికి ఒక స్నోమాన్ కనబడింది. "ఏంటిది అబ్బా?” అని చూసింది; కానీ ఆకలిని తట్టుకోలేకపోయింది పాపం. చివరికి అది స్మోమాన్ కళ్ల వైపు చూసి, "నన్ను క్షమించు స్నోమాన్, నేను ఆకలికి తట్టుకోలేక పోతున్నాను. నీ క్యారట్ తింటున్నాను. నన్ను క్షమించు" అంటూ స్నోమాన్ ముక్కుకు పెట్టిన క్యారెట్‌ని తినేసింది.

అట్లా తన ఆకలి తీరాక, అది స్నోమాన్‌కేసి చూసి "ధన్యవాదాలు స్నోమాన్! నీకు ఎప్పుడైనా ఆకలి వేస్తే నేను నీ ఆకలిని తీర్చుతాను- సరేనా?” అని మాట ఇచ్చి మరీ దాన్ని బుజ్జగించి పోయింది. -పి.మందిర

ఉడత కథ

అది ఒక వర్షం కురుస్తున్న రాత్రి. యజమాని ఒకడు ఓ ఉడతల గుంపుని బోనులో పట్టుకొని, తను ఓ గొడుగు వేసుకొని, వర్షంలో చక చక పరిగెత్తాడు. ఆ సమయంలో బోనులో నుంచి ఓ ఉడత జారి క్రింద పడింది. యజమాని ఆ సంగతి గమనించలేదు- వెళ్లిపోయాడు.

కొద్ది సేపటికి తేరుకున్న ఉడత అటు-ఇటు చూసి గట్టిగా అరిచింది. ఎవ్వరూ బదులివ్వలేదు. దానికి బాగా చలి వేసింది. ఎందుకంటే అది గొప్ప మంచు ప్రదేశం కూడా. ఉడత మెల్లగా పాక్కుంటూ దగ్గర్లో కనిపించిన ఓ చెట్టు ఎక్కి, ముడుచుకొని పడుకున్నది.

తెల్లవారి నిద్ర లేచేసరికి దానికి చాలా బాధ వేసింది. మిత్రులు తనని వదిలేసారని బాగా ఏడ్చింది, తర్వాత ఇంకా కొంతసేపు ఏడ్చింది. అటుపైన ఆహారం వెతుక్కుంటూ ప్రయాణం సాగించింది. దొరికిన ఆహారం ఏదో తిన్నాక, ఇక అది జరిగిన దాన్నంతా మరచి, ఆ మంచులో ఆడటం మొదలుపెట్టింది.

దాని ఆట కారణంగా మంచు దొర్లింది. దొర్లిన మంచు గుండ్రంగా, ఓ పెద్ద బంతిలా అయ్యింది. ఉడతకు అది చాలా నచ్చింది. దాన్ని అటూ-ఇటూ దొర్లించింది. దొర్లించిన కొద్దీ అది మరింత పెద్దదైంది. చూసి చూసి ఉడత ఒక్కసారిగా చటుక్కున ఎగిరి దాని మీద కూర్చుంది. రాజుగారిలాగా ఎత్తులో కూర్చోవాలనిపించింది దానికి. ఇంతకు ముందులాగే మరో ఉండను చేసింది. ఎత్తేందుకు వీలుగా దీన్ని కొంచెం‌ చిన్నగా చేసి, అట్లా ఉండగానే దాన్ని ఎత్తి పెద్ద ఉండ మీద పెట్టింది. ఇంకా ఎత్తు చాలలేదు. మరో ఉండని దాని మీదికి ఎక్కించింది. ఇప్పుడు రాజాలాగా మూడు ఉండల మీదికెక్కి కూర్చుంది.

అంతలో ఓ కాకి- క్యారట్లు తీసుకెళ్తూ ఒక క్యారట్టును జారవిడిచింది. ఆ క్యారెట్‌ని అందుకునేందుకు ఉడత గభాలున దూకింది. గంతులేస్తూ దాన్ని అందుకున్నది. ఆ కంగారుతో మళ్ళీ పైకి ఎక్కుతూ జర్రున జారింది. అది పట్టుకున్న క్యారెట్ మంచు బంతికి గుచ్చుకున్నది.

ఉడత కిందకి దిగి దాన్ని తీసుకోబోయింది- అయితే క్యారట్టుతో కూడిన ఆ మంచు బంతులు ఇప్పుడు ఓ మంచు మనిషి లాగా కనిపించాయి దానికి! 'బలే ఉంది!' అని క్యారట్ క్రింద పడకుండా మరింత లోపలికి తోసి సరి చేసిందది. చలికాలం అంతా ఇక ఆ మంచుమనిషితో ఆటలే, దానికి! -కె.గోపి కేశవ్

ఉడత ఊహ

అనగనగా ఒక ఉడత, తన తల్లి ఉండేవారు. వాళ్ల తండ్రి, మిగతా కుటుంబ సభ్యులందరూ ఏనుగుల సమూహం కింద పడి చనిపోయారు.

ఒకసారి అది తన తల్లి తన కోసం ఏదైనా తీసుకురావడానికి వెళ్లింది. కానీ దారి తప్పి పోయింది. ఇంటికి తిరిగి రాలేక పోయింది! అయినా అది వాళ్ల అమ్మ కోసం ఎక్కడపడితే అక్కడ వెతుకుతూ పోయింది. అట్లా చివరికి అది ఓ చల్లని ప్రదేశానికి చేరింది. అకస్మాత్తుగా దానికి అక్కడ ఒక మంచు మనిషి కనిపించింది. "మంచు మనిషికి ముక్కే లేదు పాపం" అని అది ఓ క్యారట్ తెచ్చి, దాన్ని కొరికి కొరికి ముక్కులాగా తయారు చేసింది.

ముక్కు పెట్టాక చూస్తే మంచు మనిషి చాలా ముద్దుగా అనిపించాడు. అది తన కష్టాల్ని మరచిపోయి ఆ దగ్గర్లోనే ఉన్న చెట్టు ఒకదాని మీద పడుకున్నది. మళ్ళీ కళ్ళు తెరిచి చూసే సరికి ఆశ్చర్యం! వాళ్ల అమ్మ దాని ఎదురుగా నిల్చొని ఉన్నది! ఇంతకీ దానికి వచ్చింది కలేనంటారా? -జి.యామిని.

స్వచ్ఛమైన స్నేహం

అనగనగా కుందేలు ఒకటి తనకు ఇష్టమైన క్యారెట్ నముల్తూ, నముల్తూ స్నేహితుల ఇంటికి బయలుదేరింది. అయితే సరిగ్గా అది బయలు దేరే సమయానికే దట్టంగా మంచు పడటం మొదలయింది. మంచులో‌ దారి కనిపించక, కుందేలు ఒకవైపు పోవాల్సినది మరొక వైపుకు పోతూ పూర్తిగా దారి తప్పింది!

అట్లా‌ పోయి పోయి, చివరికి ఆ కుందేలు ఒక పర్వతపు అంచుకు చేరుకున్నది. అక్కడినుండి అన్నిదిక్కులకూ కలయ జూచింది- కానీ ఎటు వెళ్ళాలో తెలీలేదు దానికి. 'ఛ' అనుకొని కుందేలు నిరాశతో క్రుంగి పోయింది. అక్కడే నేలమీద పడి స్పృహ తప్పింది!

కొద్ది సేపటికి కళ్ళు తెరిచి చూస్తే అది ఒక కొలను ప్రక్కన పడి ఉన్నది! దానికి చాలా దాహం కూడా వేయసాగింది! 'పక్కనే ఇంత చక్కని కొలను నిండా నీళ్ళుంటే, నేను ఎందుకు త్రాగట్లేదు?' అని అది కొలనులోకి దిగి గబగబా గ్రుక్కెడు నీళ్లు తాగింది.

మరుక్షణం అక్కడ ఒక మాంత్రికుడు ప్రత్యక్ష్యమయ్యాడు- వాడు కుందేలు కేసి కోపంగా చూసి "ఇదిగో! నేను మంత్రించిన ఈ నీళ్ళను నువ్వు అనుమతి లేకుండా తాగావెందుకు? నిన్ను శపిస్తున్నాను. నువ్వు తక్షణం ఈ పర్వతం మీద మంచుబొమ్మవై పో!" అన్నాడు. కుందేలు వలవల ఏడుస్తూ "నన్ను క్షమించండి, చూసుకోలేదు!" అన్నది.

“ఉహుఁ.. నేను నిన్ను క్షమించలేను- కానీ దీనికి విముక్తి మాత్రం చెప్పగలను. నువ్వు తాగిన ఈ మంత్రజలపు మహిమవల్ల, నీ కోసం‌ మనస్ఫూర్తిగా వెతికేవాళ్ళకు ఎవ్వరికైనా నువ్వెవరో తెలిసి పోతుంది! ఆ స్నేహితుడి స్పర్శవల్ల నీకు మళ్ళీ యథారూపం వచ్చేస్తుంది” అని చెప్పిమాంత్రికుడు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. తక్షణం ఆ ప్రదేశమంతా మంచు ప్రదేశమైపోయింది! అయితే కుందేలుకు ఒక స్నేహితుడుండేది. అది ఒక ఉడత. రెండు రోజుల క్రితం పోయిన స్నేహితుడు ఇంకా ఇంటికి రాలేదేమి?” అని అది కుందేలును వెతుక్కుంటూ‌ బయలు దేరింది. పోగా పోగా దానికి మంచుకొండ ఎదురైంది. "ఇదేదో వింతగా ఉందే, మన దగ్గర మంచు కొండ ఏంటి?” అని అది ఇంకా ముందుకు పోయింది. అక్కడ మంచుబొమ్మ రూపంలో ఉన్నప్పటికీ కుందేలును గుర్తించగలిగిందది.

"ఏంటిది? ఇట్లా ఎందుకైనావు?" అని అడిగితే కుందేలు ఉలుకు-పలుకు లేదు. ఉడుత మంచుని అంతా తొలగించి, దాని ముఖాన్ని స్పృశించిందో లేదో, కుందేలుకు మళ్ళీ ప్రాణం వచ్చింది. “ఇంకెన్నడూ నావి కాని వస్తువుల్ని ముట్టుకోను!” అంటూ అది ఉడత చెయ్యి పట్టుకొని ఇంటివైపుకు పరుగు తీసింది! -వి.దుర్గ

ఉడత కుటుంబం

ఒక ఊళ్లో ఉడత కుటుంబం ఒకటి ఉండేది. అది ఉమ్మడి కుటుంబం. ఒకరోజున పెద్ద వరదలు వచ్చాయి. ఉడత పిల్ల తన కుటుంబం నుండి విడివడి, వరద నీళ్లలో కొట్టుకుపోయింది. అది లేచి చూసేసరికి దిక్కులు తెలీలేదు. దానికి చాలా భయం వేసి, బిగ్గరగా ఏడ్చింది. అయినా అక్కడ ఎవరైనా ఉంటే గద, దాన్ని చూసేందుకు?

అట్లా కొంచెం సేపు ఏడ్చాక, అది లేచి మెల్లగా అడుగులో‌అడుగులు వేసుకుంటూ ఓ చల్లటి కొండ ప్రదేశం చేరుకున్నది. అక్కడ అంతా హడావిడిగా, గందరగోళంగా ఉన్నది. ఉడత పిల్ల ఓ చెట్టు మీదికి ఎక్కి చూస్తూ కూర్చున్నది. పిల్లలు కొందరు ఓ మంచు మనిషిని చేసారు. దానికి ఓ క్యారెట్‌ను ముక్కుగాను, ఆవాలను కళ్లులాగాను పెట్టారు. అట్లా కాసేపు ఆడుకున్నాక, ఏదో గంట కొట్టినట్లు శబ్దమైంది. వెంటనే పిల్లలంతా బిలబిలా అక్కడినుండి వెళ్లిపోయారు! పైనుండి వాళ్ల కేరింతల్ని చూస్తూన్న ఉడతకు తన కుటుంబం గుర్తుకు వచ్చి చాలా ఏడుపొచ్చింది.

వాళ్లంతా వెళ్ళాక, మెల్లగా అది మంచుమనిషిని చేరుకొని, దానికి పెట్టిన క్యారట్.ముక్కును తిన్నది. అంతలోనే దానికి ఒక ఐడియా వచ్చింది- నీళ్ళు ఎప్పుడూ‌ క్రిందికే గద, పారేది? ఇప్పుడు తను కొట్టుకొచ్చిన వరద నీళ్ళు ఇంకా పైనుండి ఎక్కడినుండో వచ్చి ఉండాలి. తను ఇప్పుడు ఆ వరద జాడని పట్టుకొని పైకి పోతే?!

వెంటనే అది మంచుమనిషిని ముద్దు పెట్టుకొని, నీళ్ళు ఏ దిశనుండి వచ్చాయో అటు వైపుగా ప్రయాణం మొదలు పెట్టింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయాణం కొనసాగిస్తూనే పోయింది. చివరికి, మూడు నాలుగు రోజులు రాత్రనక, పగలనక ప్రయాణించిన తర్వాత దానికి పరిచయం ఉన్న ప్రాంతం వచ్చింది. ఇంకేమున్నది, గబగబా ఇంట్లోకి దూరింది.
పోయిందనుకున్న బిడ్డ తిరిగి వచ్చినందుకు ఉడత కుటుంబం మొత్తం సంతోషంగా నాట్యం చేసింది! -ఎ.అభినయ

ఉడతల ప్రయాణం

మంచుతో కూడిన ఓ ప్రదేశంలో ఒక ఉడత ఉండేది. దానికి ఐదుగురు స్నేహితులు ఉన్నారు. అంత మంచులో కూడా అక్కడక్కడా చెట్లు ఉండేవి; దాంతో ఆ ఉడతలకు ఆహారం దొరికేది. అయితే చెట్లను మనుషులు కొట్టివేస్తూ ఉండేవారు. దాంతో రాను రాను ఉడతలకు ఆహారం దొరకటం కష్టమైంది. చివరికి ఒకరోజున అవి ఎంత వెతికినా వాటికి ఎలాంటి ఆహారమూ దొరకలేదు! అన్నీ‌ పస్తులుండాల్సి వచ్చింది.

అట్లా కొద్ది రోజులు గడిచే సరికి ఆకలికి తట్టుకోలేక నాలుగు ఉడతలు ఒక్కసారిగా చనిపోయాయి. మిగిలిన రెండింటికీ చాలా కష్టం తోచింది. “ఇక ఇక్కడ ఉండకూడదు. ఆహారం కోసం వెతుక్కుంటూ‌ పోదాం. మనిద్దరికీ సరిపడేంత ఆహారం వేరే ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది” అని అవి రెండూ తాము పుట్టిన ఊరిని వదిలి ప్రయాణం మొదలు పెట్టాయి.

అట్లా అవి మూడు రోజుల పాటు నడుస్తూ పోయాయి. రెండూ బాగా నీరసించి పోయాయి. వాటిలో ఒకటి ఇక నడవలేని స్థితికి చేరుకున్నది. “నువ్వు ఇక్కడే కూర్చో. నేను ఈ పరిసరాల్లో తినేందుకు ఏ కొంచెమైనా దొరుకుతుందేమో‌ చూసి వస్తాను" అని దాన్ని ఒకచోట కూర్చోబెట్టి, వెతికేందుకు పోయింది చివరి ఉడత.

సెలవలను సంతోషంగా గడిపేందుకు అక్కడికి కొందరు పిల్లలు వచ్చి ఉన్నారు. అక్కడి మంచుతో వాళ్లు బొమ్మలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళు తిన్న చోట రకరకాల ఆహారపు ముక్కలు పడి ఉన్నాయి! ఉడతలు రెండింటికీ అవి చాలానే రోజులపాటు సరిపోతాయి!

ఉడతకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. గబగబా తను తీసుకెళ్ళగలిగినన్ని ముక్కల్ని తీసుకెళ్ళింది. తను తింటూ తోటి ఉడతకు పెట్టింది. మరుసటి రోజు తెల్లవారే సరికి రెండింటికీ శక్తి వచ్చింది. రెండూ మళ్ళీ అదే స్థలానికి బయలుదేరి పోయాయి. ఇప్పుడక్కడ పిల్లలు లేరు. వాళ్లు మంచుతో చేసిన మంచుమనిషులు నిలబడి ఉన్నారు. వాటికి క్యారెట్ల ముక్కులు ఉన్నై! ఉడతలు తినేందుకు ఇప్పుడు క్యారెట్లు కూడా దొరికాయి. ఉడతలు ఆ క్యారట్లనీ, పిల్లలు వదిలేసిన తిండి ప్రార్థాలనీ అన్నిటినీ తీసుకొని, మళ్ళీ తమ ప్రయాణాన్ని మొదలు పెట్టాయి. -జి.పూజిత

భూకంపం?!

అనగనగా ఒక ఉడత కుటుంబం ఉండేది. అప్పుడే కొత్తగా ఆ కుటుంబంలో ఒక ఉడత పిల్ల జన్మించింది. అంతలోనే అకస్మాత్తుగా వచ్చిన భూకంపంలో ఆ చిట్టి పిల్ల తప్ప కుటుంబం అంతా పోయింది. తోటి జంతువుల సహాయం వల్ల ఉడత పిల్ల మటుకు బ్రతికి, తన జీవితాన్ని కొనసాగించింది.

అది తోటి జంతువులు అన్నిటికీ సాయం చేస్తూ ఉండేది. కానీ దానికంటూ ఎవరూ స్నేహితులు ఉండేవాళ్ళు కారు. తనవాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే బాగుండునని అది చాలా అనుకునేది. ఆ ఉద్దేశంతోటే ఒకసారి అది అక్కడ ఒకమంచు మనిషిని తయారుచేసింది. దాంతో చాలా గాఢంగా స్నేహం చేసింది; తన గురించీ, తన కుటుంబం గురించీ, తను చూసిన సంతతుల గురించీ, తన ఆలోచనల గురించీ చెప్పింది. కానీ అది బొమ్మ కదా, మాట్లాడేది కాదు. ఉడతకు బదులిచ్చేది కాదు.

అట్లా చాలా రోజులు గడిచాక దానికి మరొక ఉడత కనిపించింది! ప్రాణం లేచి వచ్చినట్లయింది దానికి. దానితో స్నేహం చేసింది. దాని కుటుంబాన్ని తన కుటుంబంగా చేసుకున్నది. ఆ కుటుంబం మొత్తానికి సరిపడా ఆహారం సేకరించేది. క్రమంగా కుటుంబపు బాగోగులే కాక, తాము ఉండే ప్రదేశపు బాగోగులన్నీ చూసుకోసాగింది. దానికి బద్ధకం అంటే ఏమాత్రం ఇష్టముండేదికాదు. అందువల్ల త్వరలోనే జంతువులన్నీ కలిసి దాన్ని రాజును చేసాయి! -కె.హర్షిత.