ఏడో తరగతి రాము ఏడుస్తున్నాడు.

వాడు అడిగింది ఒక పెన్ను కావాలని. అంతేగా? దానికి అమ్మ ఎంతలేసి మాటలు అన్నది?! 'డబ్బులు లేవురా, కూలి డబ్బులు వొచ్చాక, వచ్చే వారం చూద్దాం' అనిన్నా అని ఉంటే తను ఏడవక పోవును - సూరిగాడి దగ్గర అప్పుగా తీసుకొని పని నడిపించుకొనేవాడు!

కానీ ఏమన్నదో చూడు-”ఇట్లా డబ్బులు తగలేస్తావుంటే యలా? మొన్ననే పది కావాలంటే ఇస్తి. పరీచ్చకి ఎంది కావాలంటే ఇస్తి. బెండకప్ప పండక్కి చొక్కాయి కొనుక్కుందికి నాలుగొందలైపాయె. 'ఇంకా డబ్బులు తే, డబ్బులు తే' అంటే నేనేమైనా రూపాయిలు అచ్చేత్తన్నానా? ఇగో చెప్తన్నా! పైసా ఇచ్చేది లేదు! చదివితే చదువు- లేకపోతే మానెయ్, అంతే!” అనింది.

తనేమైనా డబ్బులు తగలేస్తున్నాడా, సూరిగాడి మాదిరి? వాడు బడికి రోజూ డబ్బులు తెచ్చుకుంటాడు. ఇంటర్వెల్లో పోయి ఏవేవో కొనుక్కొని తింటాడు. దగ్గరున్న వాళ్లకూ పెడతాడనుకో; అయినా ఆ డబ్బులు ఊరికే రాలేదు కద, వాళ్లమ్మ వాళ్లు కష్టపడితేనేగా, అవి వొచ్చింది?

వాళ్ల బడిలో సరస్వతీ దేవి విగ్రహం ఒకటుంది. రాము దాని ఎదుట నిలబడి, ఇదంతా గుర్తు చేసుకొని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అంతలో ఉరుము ఉరిమినట్లైంది. "ఊరికే ఏడవకు! నీకేమైందో చెప్పు- అంతే. ఏడపు ఏడందాలా నష్టం!” అని వినిపించింది సరస్వతి విగ్రహంలోంచి.

రాము బిత్తరపోయి చూసాడు: సరస్వతీ దేవి మాట్లాడింది- సూరిగాడి గొంతులో!

'ఇగో సూరీ, నీ పన్జెప్తా. మర్యాదగా బయటికొస్తావా, లేదా?” అని ఆవేశంగా వెనక్కి, ముందుకీ తిరిగి చూసాడు రాము. అక్కడెవ్వరూ లేరు!!

సూరిగాడి గొంతు నవ్వింది. “కాదులే, నీకు నమ్మకం లేదు. ఇంతకీ ఎందుకేడుస్తున్నావ్?” అంది.

“నీ గొంతు సూరిగాడి గొంతులాగా ఎందుకుంది?” అన్నాడు రాము, అనుమానంగా.

“ప్రశ్నకి జవాబు ప్రశ్నకాదు!” అరిచింది గొంతు. ఈసారి అది లక్ష్మయ్య సారు గొంతులాగా అనిపించింది.

“మీర్..మీరే గద సార్, పెన్ను తెచ్చుకొమ్మన్నది?! మా అమ్మని డబ్బులడిగితే,.. లేవని, తిట్టింది!" చెప్పేశాడు, మర్యాదగా చేతులు కట్టుకొని.

“సూరిగాడిని అడుగు… లేకపోతే ఓ పని చెయ్.. ఇంటర్వెల్ తర్వాత వొచ్చి చూడు- నా కుంకుమ గిన్నెలో ఐదు రూపాయలుంటై. తీసుకెళ్లు!" అంది లక్ష్మయ్య సార్ గొంతు. 'థాంక్యు- థాంక్యు సర్!' అన్నాడు రాము, గడబిడ పడిపోతూ.

'సరస్వతీ దేవిని సర్ అనేవాడిని నిన్నొక్కడినే చూసాను.” నవ్వింది సూరిగాడి గొంతు. “అయినా గుర్తుంచుకో, ఇది నేను నీకిస్తున్న అప్పు! కష్టాల్లో ఉన్నవాళ్లని ఎవరినైనా నువ్వు నీ సొంత ఐదు ఇచ్చి ఆదుకోవాలి, పెద్దయ్యేలోపు!” అన్నది.

ఇంటర్వెల్ తర్వాత చూస్తే కుంకుమ బరిణ క్రింద ఐదు రూపాయలు పెట్టి ఉన్నై! రాముకి ప్రాణం లేచి వచ్చినట్లైంది. సరస్వతికి దణ్ణం పెట్టుకొని, ఆ డబ్బులు తీసుకెళ్లి పెన్ను కొనుక్కున్నాడు.

ఆ రోజు సాయంత్రం రాము వాళ్లమ్మ వాడిని పిలిచి చేతిలో ఐదు రూపాయలు పెట్టింది. “ఇగో, నిన్న అడిగావ్‌గా!! పెన్ను కోసం!” అంది.

'అవసరం లేదులే, నిన్న ఎవరో అప్పిచ్చారు!" అన్నాడు రాము.

అమ్మ అనుమానంగా చూసింది-”ఎవురిచ్చారు? అయినా ఎవురినో నువ్వెందుకు అడిగావు?!” అంది.

“సరస్వతీ దేవి- కాదు- సూరిగాడు- కాదు- నేను ఏడుస్తుంటే చూళ్లేక- ”వాక్యం పూర్తి చెయ్యలేదు రాము.

"ఇవి తీసుకెళ్లి, ఇచ్చెయ్- ఎవరి దగ్గర తీస్కున్నావో వాళ్లకి!" అంది అమ్మ. “ఇంతకీ సరస్వతీ దేవి ఎవరు?” అంది, కొంచెం ఆగి.

మరుసటి రోజున ఇంటర్వెల్లో సరస్వతీ దేవికి మొక్కుకొని, ఐదు రాపాయల్ని కుంకుమ బరిణె కింద పెట్టబోయాడు రాము.

“సూరిగాడికిచ్చెయ్. ఇవి 'నావే'!” అంది సరస్వతీ దేవి- సూరిగాడి గొంతు పెట్టుకొని.

“ఇదేదో తేడాగా ఉందే!” అని మళ్లీ ఓసారి విగ్రహం చూట్టూ తిరిగి చూసాడు రాము. ఎవ్వరూ లేరు-”నీకు ఏదీ కనిపించదు. ఎప్పుడూ క్రింది చూపే ఉంటే ఎలా? పై చూపు కూడా కావాలి!” అన్నది సూరిగాడి గొంతు. రాము చటుక్కున పైకి చూసాడు.

సరస్వతీ దేవి మంటపం వెనక ఓ వేప చెట్టుంది. దాని కొమ్మల్లో కూర్చొని, కాళ్లూపుతూ ఇకిలిస్తూ “థాంక్యూ. థాంక్యూ సర్" అని లక్ష్మయ్యసార్ గొంతుతో పలుకుతున్నాడు- సూరి!

రాము సూరిగాడిని కొట్టేందుకు పోతే, వాడు అందకుండా క్రిందికి దూకి తరగతిలోకి పరుగుపెట్టాడు!

మంచి అమ్మలు, చక్కని స్నేహితులు- నిజంగా గొప్పవాళ్ళు! కదూ?! మంచి అమ్మలకు, మంచి స్నేహితులకు అభినందనలతో, కొత్తపల్లి బృందం.