అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పిచ్చుక, చిలుక నివసించేవి.

అవన్నీ వేటికి అవి 'తామే‌ గొప్ప' అనుకునేవి. ఆ విషయం మీద పిచ్చుక, చిలుక నిత్యం పోట్లాడుకునేవి. కాకి మటుకు ఎప్పుడైనా ఓసారి చిలుక మాట వినేది గానీ, పిచ్చుక మాటల్ని మాత్రం అసలు పట్టించుకునేది కాదు.

"అడవిలో అల్లంత దూరంగా ఉన్న ఆ కొండను ఎవరు తొందరగా దాటేస్తారో వాళ్లే గొప్ప" అంది చిలుక ఓసారి.

"దానిదేముంది, నీకంటే ముందు నేను దాటగలను" అంది పిచ్చుక.

"మరైతే పందెం!" అనుకున్నాయి రెండూ.

ఆశ్చర్యకరంగా, ఆ పందెంలో చివరికి పిచ్చుకే గెల్చింది.

ఓడిపోయిన చిలుక అవమానంతో రగిలిపోయింది. "ఇంత చిన్న ఈ పిచ్చుక, నన్ను ఓడిస్తుందా? దీన్ని ఏమైనా చేయాలి. చంపేయాల్సిందే" అనుకున్నది.

"కానీ ఎలాగ? పిచ్చుక చాలా చురుకుగా ఉంటుంది. నాకు దొరకనే దొరకదు" అని ఆలోచించి, అది కాకి దగ్గరకు వెళ్ళింది.

"పిచ్చుక చూసావా, మన గురించి ఏమని ప్రచారం చేస్తున్నదో? మనం ఒట్టి మోసగాళ్లమట! మనకంటే తనే బలవంతురాలట!" చెప్పింది.

"నాకూ అదంటే అస్సలు ఇష్టం అవ్వట్లేదు. ఏం చెయ్యాలో తెలీక ఊరుకుంటున్నాను" అన్నది కాకి.

"నాకైతే దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది. నీ సాయం ఉంటే ఈ పాటికే దాన్ని ఏమైనా చేద్దును" కాకితో అన్నది చిలుక. "కొండ మీద పెద్ద ముళ్ళ చెట్టు ఉంది చూసావా? నువ్వు, నేను ముందుగా ఆ చెట్టు కొమ్మను తుదకంటా నరికి, అయినా అట్లా పైపైన ఊరికే అతికించి ఉన్నదన్నట్లు పెడదాం. నేనేమో పిచ్చుకని అక్కడికి తీసుకొచ్చి మాటల్లో‌ పెడతాను. నువ్వు పోయి కొమ్మమీద వాలు. కదిలేసరికి ఆ కొమ్మ నేరుగా వచ్చి పిచ్చుక మీద పడుతుంది; నేను ప్రక్కకు తప్పుకుంటాను- ఎలా ఉంది, పథకం?!" అన్నది కాకి.

ఆ తర్వాత పిచ్చుకను దాని మీద పడ్డ కొమ్మతో సహా తీసుకువెళ్లి, కుడివైపున ఉన్న ముళ్ల పొదల్లోకి తోసేద్దాం" నవ్వింది.
అయితే వాటికి తెలీదు: వాటి మాటలను పిచ్చుక వింటున్నదని.

"ఇక్కడ నాకు నిజమైన మిత్రులెవ్వరూ లేరు. ఇలాగ, మిత్రులెవ్వరూ లేకుండా- ఈ అడవిలో ఉండవలసిన అవసరం ఏమున్నది? ఇట్లా ఉండేకంటే మనుషులుండే ప్రాంతాలకు వలస పోతే నయం!" అనుకున్నది పిచ్చుక, బాధతో.

అయితే ఈ సంగతి తెలీని కాకి, చిలుక చెట్టుమీది కొమ్మని నరికి, అక్కడే ఓ చిన్న రెమ్మని ఊతంగా పైపైన నిల్చేట్లు పెట్టి ఉంచాయి. చిలుక ఆ ప్రాంతంలోనే వేచి ఉండగా, కాకి వెళ్ళి పిచ్చుకను ఆ మాటా-ఈ మాటా చెబుతూ అక్కడికి పిల్చుకొచ్చింది.

అంతలోనే పైనున్న చిలుక గట్టిగా అరిచి, కొమ్మను క్రిందికి తోసేసింది. సిద్ధంగా ఉన్న పిచ్చుక కాకిని ఒక ప్రక్కకు నెట్టి, తాను ఆకాసానికి ఎగసింది.

పిచ్చుక ఎగరటం చూసిన చిలుక తానూ ఎగరబోయింది కానీ, దాని రెక్కలు ముళ్ళ కొమ్మలో చిక్కుకొని, అది కూడా సూటిగా నేలరాలింది. క్రింద పడ్డ కొమ్మ కాకి-చిలుకలతో సహా కొండమీది నుండి క్రిందికి దొర్లుకుంటూ‌ పోయింది!

చిలుకకు, కాకికి బాగా గాయాలు తగిలాయి. వాటిని చూసి జాలిపడిన పిచ్చుక, వెనక్కి తిరిగి వచ్చి, వాటిని లేవనెత్తింది. ప్రథమ చికిత్స చేసింది.

అవి రెండూ తమ తప్పును ఒప్పుకొని పిచ్చుకను క్షమాపణ కోరాయి. 'ఇంకెప్పుడు అలా చేయం' అని పశ్చాత్తాప పడ్డాయి. "లేదులెండి- నేను ఇకమీద మనుష్యులు ఉండే ఊళ్ళలో ఉండాలనుకున్నాను. వెళ్తాను. మీరిక్కడే హాయిగా ఉండొచ్చు" అని పిచ్చుక ఒక్కతే ఎగిరిపోయింది.

కాకి, చిలుకలు దాని మంచి తనాన్ని తల్చుకుంటూ అక్కడే ఉండిపోయాయి.