పాకాలలో రామ్మూర్తి, వనజ అనే దంపతులుండేవాళ్ళు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు లత. 'ఆడింది ఆట- పాడింది పాట' అన్నట్లు పెరిగింది ఆ పాప. కోరిన కోరికల్లా తీరడంతో బలే పెంకెగా తయారైంది. లతంటే చాలామంది పిల్లలు భయపడేవాళ్ళు. అయితే కొందరు తెలివైన పిల్లలు మటుకు ఆ పాపను పొగిడేవాళ్ళు; అట్లా ఆమె తెచ్చి పెట్టే చాక్లెట్లు, స్వీట్లు తినగల్గేవాళ్ళు. తనను పొగిడే వాళ్లకు ఏదంటే అది తెచ్చిపెట్టే లత, మిగతా పిల్లలందర్నీ చిన్నచూపు చూసి ఎగతాళి చేస్తుండేది. ఇంట్లో కూడా ఆ పాప ప్రతి దానికీ పేచీలు పెట్టేది. "అబ్బ!ఈ పాపని ఇలాగే కొనసాగిస్తే పెంకె ఘటం ఐపోతుంది; పెద్దయిన తర్వాత జీవితంలో చాలా బాధలు పడుతుంది. ఎట్లాగైనా ఈ పాపని ఓ మంచి దారికి తేవాలి!" అనుకునేది బామ్మ.
ఒకరోజు స్కూల్ నుంచీ వస్తూనే పుస్తకాల సంచీ విసిరికొట్టి, "రేపు శనివారం! నాకు కొత్త ఫ్రాక్ కొంటావాలేదా?" అంటూ పేచీ మొదలెట్టింది లత.
"ముందు ఏమైనా కొంచెం తిని,పాలు త్రాగమ్మా! తర్వాత మాట్లాడదాం" అన్నది వనజ.
"నాకు ఇప్పుడే మంచి ఫ్రాక్ కావాలి! కొంటానంటేనే నేను తింటాను!" నేలమీద కాళ్ళు దబ దబా కొడుతూ గొడవ మొదలెట్టింది లత.
భాగవతం చదువుకుంటున్న బామ్మ తన దగ్గరకి వచ్చి "లతా! నీ బీరువా నిండా బట్టలున్నాయి. తలుపు తీయగానే అన్నీ కుప్పలు కుప్పలుగా క్రింద పడి పోతున్నాయి. నీ బీరువా చాలక, మీ అమ్మ బీరువాలో కూడా బట్టలు పెట్టుకుంటున్నావు కదా?! ఇంకా కొత్త బట్టలెందుకు?" అంది.
"నీకు తెలీదులే బామ్మా, నువ్వు ఊరుకో! అమ్మకొంటుందిలే; ప్రతి శనివారంనాడూ బడికి కొత్త బట్టలేసుకెళ్తేనే కద, నాకు గౌరవం?!" అంది లత, గొంతు తగ్గించి.
"సరే. ఈసారికి నీ బట్టలు నేను కొనిస్తాలే; నా పెన్షన్ డబ్బు ఈరోజే వచ్చింది. త్వరగా ఏదైనా తినేసి, పాలు త్రాగిరా!" అంటూ ముఖం కడుక్కునేందుకు లేచింది బామ్మ. బామ్మ తయారయ్యేసరికి లతకూడా కొంచెం ఉప్మా తిని, పాలు త్రాగి వచ్చింది.
ఇద్దరూ లిఫ్టు దిగి గేటు దగ్గరికి వచ్చారు. అక్కడ గేటు ప్రక్కగా వాచ్‌మ్యాన్ భార్య వెంకమ్మ కూర్చొని ఏదో కుడుతున్నది. ప్రక్కనే ఆమె కూతురు కుమారి- శ్రధ్ధగా ఏదో చదువు కుంటున్నది. కుమారి మంచి పిల్ల- లత ఈడుదే.
"ఏం చదువుతున్నావ్, కుమారీ?!" అడిగింది బామ్మ.
తలెత్తి చూసిన కుమారి నవ్వి, "ఇవాళ్ళ బడిలో చెప్పిన పాఠాలు చదువుకుంటున్నానండీ బామ్మగారూ! పరీక్షలు వస్తున్నాయి కదా!" అన్నది.
"ఏదో కుడుతున్నట్లున్నావ్ వెంకమ్మా?!" అంది బామ్మ వెంకమ్మతో.
"దీనికి రేపటికి బళ్ళోకి ఏసుకెళ్ళను గౌను, పెద్దమ్మ గారూ! కొద్దిగా చిరిగిపోతే కుడతన్నా! ఇది లతమ్మ గారిదే, మీరు గతేడాది ఇచ్చారు!" అంది వెంకమ్మ.
"చినిగి పోతే కొత్తది కొనుక్కోక, కుట్టుకుంటారేంటీ!!" అంది లత.
"మీకేంటమ్మా, లతమ్మా! మీ నాన్నగారు పెద్ద ఉజ్జోగి; ఆ అయ్య సంపాదిత్తా ఉంటే ఎన్నైనాకొంటారు. మాకు డబ్బులేవీ, కొనను? మీలాంటోల్లిచ్చిన పాత బట్టలే వాడుకుంటాం" అంది వెంకమ్మ. లత మాట తీరు ఆమెకి కూడా తెలుసు.
"సరే గానీ కుమారీ! నీకు మొన్న జరిగిన సమ్మరీ అసెస్మెంటు- లెక్కల్లో ఎన్ని మార్కులొచ్చాయి?" అడిగింది బామ్మ.
కుమారి ముఖం చిన్నబోయింది. "93% వచ్చాయి బామ్మగారూ. 'లెక్కల్లో వందకు వందా వేస్తారు కదా, ఏడు మార్కులు ఎందుకు పోయాయి?' అని అడిగారు మా సారు" చెప్పింది.
"అవును, నిజమే కుమారీ! ఈసారి లెక్కల్లో వందకి వంద తెచ్చుకో. నా వైపునుండి నీకూ ఓకొత్త గౌను కొనిపెడతాను- సరేనా?!" అంటూ లత వైపుకు తిరిగింది బామ్మ- "పద లతా, వెళ్దాం; కొత్త గౌను కొనుక్కునేందుకు" అంది.
పది అడుగులు వేసారో లేదో, చిన్న టైలర్ షాపు వద్ద లత వాళ్ళింట్లో పనిచేసే పద్మ కనిపించింది.
"ఏంటి పద్మా, ఇక్కడున్నావ్?!" అంది బామ్మ.
"పెద్దమ్మగారాండీ! మా పిల్లదాని పరికెణా సిరిగిపోతే కుట్టిస్తన్నానండీ, రేపేసుకెళ్ళాలనీ" అంది పద్మ.
"ఓహో!" అని తలూపింది బామ్మ. "మరి మీ పిల్ల చదివేది కూడా ఏడో క్లాసే కదా, మా లతలాగా?! మొన్న పరీక్షల్లో దానికి ఇంగ్లీషులో ఎన్ని మార్కులొచ్చాయేం?!" అడిగింది.
"ఎన్నో యాడివండీ?! తొంబై ఐదొచ్చాయంటండీ, ఐదు తగ్గాయని ఒకటే గోలండీ! ఇంటికాడ కూకుని చదవతన్నాదండీ! మీరేడ్కండీ, ఎల్తండరూ?!" అంది పద్మ.
"ఏం లేదులే!మా లతమ్మకు కొత్త ఫ్రాక్ కావాలంటే కొందామనీ.." చెప్పింది బామ్మ.
"ఈ పరికెణా కూడా మీ లతమ్మ గారిదేనండీ! రెండేల్ల కితం ఇచ్చినారండీ! భలే గట్టిదండీ! నిన్ననే- ఉతికి ఆరేత్తాంటే, ముల్లుదిగి సిరిగిందండి! పోయి రండమ్మొగోరూ, పొద్దుగూకుతన్నాది!" అన్నది పద్మ.
రోడ్డు మలుపు దగ్గర వద్ద రోజూ కూరలు గంపలో తెచ్చి అమ్మే పోలమ్మకూడా ఏదో కుడుతూనే ఉంది సూదితో. దారం తెగడంతో మనవరాల్ని పిలిచి, సూదికి దారం ఎక్కించమని అడుగుతోంది. వాళ్లని దాటుకొని ముందుకు పోతున్న బామ్మ కావాలని అక్కడ ఆగింది."ఏంది పోలమ్మా! చీకటి పడుతుంటే కుడుతున్నావ్?" అని అడుగుతూ.
"పెద్దమ్మగోరండీ! మా పిల్దాని గౌను సిరిగిందంటండీ! రేపు ఇస్కూల్‌కేసుకెల్లాలంటమ్మగోరూ, దీంతల్లి ఇంకా పని కాడ్నుంచీ రాలేదండీ, అందుకని కుట్టిస్తన్నానండీ. ఎన్ని దినాల్నుంచో 'కుట్టుకోడం నేర్చవే' అంటే రాదు. ఎప్పుడు సూసినా ఆ పుస్తకాలు ముందేసుకుని చదువుతా కూకుంటాదండీ. నాకా, కల్లు కాన్రావు"అంది.
"ఏం నళినీ!, సోషల్లో ఎన్ని మార్కులు వచ్చాయి?" అంది బామ్మ, పోలమ్మ మనవరాలిని చూస్తూ.
"అమ్మగారూ అన్నిట్లో 95 పైనేనండీ! ఈ సంవత్సరం సెవెంత్ కదండీ ! జిల్లా ఫస్ట్ రావాలని మా టీచరమ్మ కోప్పడుతుంటే చదువుకుంటున్నానండీ! నేనూ-కుమారీ ఇద్దరం ఒకే మున్సిపల్ స్కూల్, మా ఇద్దరికీ గట్టి పోటీ నండి" చెప్పింది ఆ పాప.
"సరే గానీ నీ గౌన్ చిరిగిపోయిందిటగా, మరి కొత్తది కొనిపించుకోలేక పోయావూ?!" అంది బామ్మ.
"కాస్త చిరిగితే కొత్తదెందుకండీ?! అయినా ఇది లతమ్మ గారిదేనండి- మీరే గత వేసవికాలంలో ఇచ్చారు. మొన్న ఓసారి నోట్ బుక్సూ, పెన్నూ కొనుక్కోవాలంటేనే డబ్బులు లేవంది అమ్మ!"చెప్పింది ఆ పాప.
"సరే, బాగా చదువుకో మరి! నీకు ఫస్ట్ ర్యాంకు వస్తే నేవొచ్చి నీకు కొత్త గౌను కొనిస్తాలే!" అంది బామ్మ.
"ఈసారి నాకు గౌను వద్దమ్మా- వీలైతే ఒక ఇంగ్లీషు డిక్ష్నరీ కొనివ్వండి!" అంది నళిని.
"అలాగే తల్లీ! బాగా చదువు మరి!" అంటూ బయల్దేరిన బామ్మ, కొద్ది దూరం వెళ్ళాక లతని అడిగింది: "లతా! నీకు ఎన్ని మార్కులు వచ్చాయి?" అని.
లత సిగ్గు పడుతూ చెప్పింది: "అన్నిట్లోనూ 50%కంటే తక్కువే వచ్చాయి"అని.
"మరి మీ అమ్మా-నాన్నా ఇద్దరూ నువ్వు కోరినవన్నీ కొనిస్తున్నారు కదా తల్లీ! ఎందుకు, చదవట్లేదు? ఊరికే 'అవీ-ఇవీ కావాలి' అని గొడవ చేస్తున్నావ్, ఎందుకూ?! రెండు గౌన్లతో ఆ పిల్లలతా వందకి 90 తెచ్చుకుంటుంటే, బీరువా నిండా ఉండే బట్టలతో నీకేమో మరి వందకు 50 దాటలేదు. అసలు నువ్వు చెప్పు: మనుషులకు బట్టలు ఎందుకు? మన జీవితం సాఫీగా కొనసాగేందుకు కదా; శరీరాన్ని దాచుకునేందుకు, చలి-ఎండల నుండి శరీరాన్ని కాపాడుకునేందుకు గదా, బట్టలు వేసుకునేది?! మరి- నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుంటావో చూసుకో! వాటితో నీ శరీరానికి ఏం రక్షణ లభిస్తున్నది? అవి ఎంత పల్చగా ఉన్నాయో చూసావా?! ముతకగా ఉన్నాయనీ, మందంగా ఉన్నాయనీ వంక పెట్టి నువ్వు వాళ్లకి ఇచ్చేసిన గౌన్లనే ఆ పిల్లలు సంవత్సరమంతా వాడుకుం-టున్నారు; అయినా 90 శాతం మార్కులు తెచ్చుకుంటున్నారు! మన బట్టల ఖరీదుకీ, మనకుండే తెలివి తేటలకీ ఏమీ సంబంధం ఉండదు కదా తల్లీ, అసలు!" అనేసింది బామ్మ ధైర్యంగా.
లత బామ్మను కౌగిలించుకొని కళ్ళ నీళ్ళు తిరగ్గా "తప్పైపోయింది బామ్మా! ఖరీదైన బట్టలేసుకుని మా తరగతి పిల్లలందరికంటే దర్జాగా ఉండాలనుకున్నానే తప్ప, చదువు గురించి ఏనాడూ ఆలోచించలేదు బామ్మా! అమ్మా-నాన్న కూడా చదువు గురించి అసలు ఎప్పుడూ ఆడగనే అడగరు. 'వాళ్లు ఎట్లాగూ అడగరులే' అని నేను ఈ పిచ్చిలో పడ్డాను.
ఈ పిల్లల్ని చూసాక నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఇంక ఎంత బాగా చదువుకుంటానో నువ్వే చూద్దువు! ఈ సారికి నన్ను క్షమించు" అంది.
"పిచ్చిపిల్లా! గౌరవమూ, దర్జా మన నడవడిని బట్టి వస్తాయి కానీ, మనం వేసుకునే బట్టలను బట్టి కాదమ్మా! ఎక్కడికి వెళ్ళేప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి దుస్తులు ధరించాలి. మనలో మనకు ఎక్కువ-తక్కువ భావనలు లేకుండా కలిసి మెలసి జీవించాలనేగా, స్కూళ్ళలో 'యూనిఫాం' పెట్టేది?
సరేలే, దానికేం గానీ, వెళ్దాం పద. బట్టల దుకాణం మూసేస్తే మళ్ళీ అదొక సమస్య!"అంది బామ్మ.
"బీరువాలో అన్నన్ని గౌన్లున్నాయి: ఇప్పుడింక నాకు ఏ గౌన్లూ వద్దు బామ్మా! ఇంటి కెళదాంపద. ఇప్పుడింక చదువు మొదలెట్టాలి" అంటూ బామ్మని వెనక్కి తిప్పింది లత.