రంగాపురంలో నివసించే రామయ్య చిన్న ప్రభుత్వ ఉద్యోగి. తల్లి లేని బిడ్డ పద్మను అల్లారుముద్దుగా పెంచాడు. అయితే పద్మ చదువు అంతంత మాత్రమే. మూడు ప్రయత్నాల తర్వాత పదోతరగతి పాసైంది. మరో నాలుగు ప్రయత్నాల తర్వాత ఇంటర్ ముగిసింది. ఇంక ఆమె బరువు దించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి, గబగబా పది సంబంధాలు చూసి, పదకొండో సంబంధాన్ని నిశ్చయం చేసేసాడు రామయ్య.

"ఎందుకురా, అంత తొందర పడతావు? ఇంకొంచెం చదవనివ్వచ్చుగా?" అన్నాడు మిత్రుడు జగ్గయ్య.

"ఈ చదువులు ఏమీ ప్రయోజనం లేదు" తేల్చేసాడు రామయ్య.

"కానీ అంతంత కట్నం డబ్బులు ఎక్కడినుండి తెస్తావు? కట్నం లేని సంబంధాలు చూడు"

"దొరకట్లేదురా! కట్నం ఇవ్వాల్సిందే. రోజులు ఇంకా అట్లానే ఉన్నై. ప్రసాద్ మంచోడే దొరికాడు. గవర్నమెంటు ఉద్యోగం. ఇప్పుడు అడ్వాన్సుగా సగం కట్నం ఇచ్చేసాను. మిగతాది పెళ్ళికి ముందు ఇస్తానని చెప్పాను. ఒప్పుకున్నాడు. ఇంకేమి, పద్మ సుఖపడుతుంది" అన్నాడు రామయ్య.

"పద్మ సుఖపడటం సంగతి అటుంచు. నువ్వు లంచాలు తీసుకునే రకం మనిషివి కాదు. అన్నన్ని డబ్బులు ఇవ్వలేక తంటాలు పడతావేమోనని నా బాధ" అన్నాడు జగ్గయ్య.

"ఏదో, పద్మకోసం- ఈ మాత్రం కష్టం పర్లేదు" అని ముగించాడు రామయ్య.

అయితే అనుకున్నంతా జరిగింది. ఎంత ప్రయత్నించినా పెళ్లి నాటికి మిగిలిన కట్నం డబ్బులు మొత్తం ఇవ్వలేకపోయాడు. "చూడు ప్రసాదూ, నేనెటు పోతాను, నువ్వెటు పోతావు? బాంధవ్యం కుదిరాక సర్దుకుపోక తప్పదు. ఇప్పటికి ఈ మొత్తం‌ ఉంచు. ఒక రెండు మూడు నెలల్లో నా తల తాకట్టు పెట్టయినా సరే, మిగిలిన రెండు లక్షలూ ఇచ్చేస్తాను" బ్రతిమిలాడాడు అల్లుడిని.

అంతమంచి ప్రసాదు కూడా అతి కష్టం మీదనే అందుకు ఒప్పుకున్నాడు.

"నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్ళి చేయమన్నారు" అని ఊపిరి పీల్చుకున్న రామయ్య కూతురిని సంతోషంగా కాపురానికి పంపాడు.

రెండు నెలలు కాదు- ఆరు నెలలు గడిచాయి. కూతురు నుండి సమాచారం లేదు. అల్లుడి నుండి కబురు లేదు. తనకా, డబ్బులు సమకూరలేదు. చివరికి రామయ్యకు భయం వేసింది- "ఏమైనా ఐతే?" అని.

ఆ భయంతో 'కూతురు ఎలా ఉందో చూసి వద్దాం- డబ్బులు ఇచ్చేందుకు మరింత సమయం అడుగుదాం' అని అల్లుడి ఇంటికి వెళ్లాడు. అయితే మంచి సంబంధపు-టల్లుడు ప్రసాదు 'డబ్బుల మూట తెచ్చారా, లేదా' అని చూసాడు. 'తేలేద'ని తెలిసాక, కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు. పద్మ కూడా నోరెత్తి ఏ మాటా మాట్లాడలేదు. చేసేది లేక రామయ్య వెనుదిరిగాడు.

సమస్య జటిలం అనిపించింది రామయ్యకు. ఆలోచించిన కొద్దీ గుండె దగ్గర నొప్పిగా కూడా ఉంది. ఏం చెయ్యాలి? డబ్బులా, తన దగ్గర లేవు..." చివరికి అతనికి జగ్గయ్య గుర్తుకొచ్చాడు.

ఎటువంటి సమస్యనైనా పరిష్కరించటంలో మిత్రుడు జగ్గయ్యకు కొట్టిన పిండి. అందుకే, సాయం కోసం అతని దగ్గరికి వెళ్లక తప్పలేదు. రామయ్యను చూడగానే లోపలికి ఆహ్వానించాడు జగ్గయ్య. జరిగిన విషయం తెలుసుకున్నాడు.

"చూడు రామయ్యా! కట్నం ఇవ్వటం, తీసుకోవటం రెండూ చట్ట విరుద్ధమే. నేను ముద్దుగా ఎంత చెప్పినా వినలేదు నువ్వు. ఇప్పుడు ఎవరం ఏం చేయగల్గుతాం?" అన్నాడు అతను అంతా విని, పెదవి విరుస్తూ.

"అట్లా అనకు! ఏదో‌ ఒక ఉపాయం చెప్పు. ఈ‌ వేదనను నేనిక భరించలేను" అన్నాడు రామయ్య అతని గడ్డం పట్టుకుని కళ్ల నీళ్ళు పెట్టుకుంటూ. "సరే! అయితే రేపటెల్లుండి కల్లా ఏదో ఒకటి చేస్తాలే, నువ్వు బాధ పడకు. అంతా మర్చిపోయి విశ్రాంతిగా ఉండు. నీ అల్లుడిని నేను ఓ ఆట ఆడిస్తాను" అన్నాడు జగ్గయ్య, ఏదో ఆలోచిస్తూ.


ఇంకా బాగా తెల్లవారకనే రామయ్య దగ్గరికొచ్చాడు జగ్గయ్య. "ఇదిగోరా, నువ్వు అంతగా బాధ పడుతుంటే చూడలేకపోయాను. ఇందులో రెండు లక్షలుంది. ముందు ఈ డబ్బు తీసుకెళ్లి మీ అల్లుడికి ఇచ్చి రా. నీ కళ్ళముందు, అతనే స్వయంగా వీటిని లెక్క పెట్టుకోవాలి" అని ఒక మూటను అతనికి అందించాడు.

ఒక్క క్షణం పాటు రామయ్య ముఖం కృతజ్ఞతతో వెలిగిపోయింది. వెనువెంటనే అది మాడిపోయిన బల్బులాగా నల్లబడింది- "మళ్ళీ నేను నీకు ఈ డబ్బుల్ని ఎప్పటికి తిరిగి ఇవ్వాలి?" అన్నాడు కంగారుగా. "ఏమీ కంగారు పడకు. ముందు ఈ డబ్బు తీసుకెళ్లి మీ అల్లుడికి ఇచ్చి 'చూడు ప్రసాదూ! నేను ఈ డబ్బు తీసుకు-రావడానికి చాలా కష్టపడ్డాను. నాకు నా కూతురు, నువ్వు తప్ప ఎవరూ లేరు. కాబట్టి దయచేసి నా కూతుర్ని సరిగ్గా చూసుకో' అని చెప్పు. వీలైతే మీ మాటల్ని సెల్‌ఫోనులో రికార్డు కూడా చేసుకో- ఎలా రికార్డు చేసుకోవాలో‌ తెలుసుగా?" అని రామయ్య సెల్‌ఫోనులో‌ శబ్దాల్ని ఎలా రికార్డు చేసుకోవాలో చూపించాడు.

రామయ్య ఇచ్చిన డబ్బుల మూటని అల్లుడు సంతోషంగా తీసుకున్నాడు. "ఎందుకైనా మంచిది- ఒకసారి లెక్క చూసుకో అల్లుడూ" అన్నాడు రామయ్య. అల్లుడు మూటవిప్పి లోపల ఉన్న కొత్త నోట్లన్నిటినీ లెక్క పెట్టుకున్నాడు. "అన్నీ సరిగా ఉన్నాయి. ఇంక మీరేమీ కంగారు పడకండి మామయ్యగారూ" అన్నాడు చాలా మర్యాదగా.

"సరే నాయనా, జాగ్రత్త మరి. డబ్బుల్ని వీలైనంత త్వరగా బ్యాంకులో వేసుకోండి మరి. పెద్ద పెద్ద మొత్తాలు, ఊరికే అలా ఇంట్లో‌ ఉంచుకోకండి" అని గౌరవంగా వెనుతిరిగాడు రామయ్య.


కొద్ది సేపటికి ప్రసాదు ఆఫీసుకు బయలుదేరుతుండగా ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే ఇద్దరు పోలీసులు!

"ఇక్కడ ప్రసాద్ అంటే మీరేనా?" అన్నాడు ఇన్స్పెక్టర్.

"నేనేనండి- ఏమి సంగతి?" అడిగాడు ప్రసాదు.

"నేను ఇన్స్పెక్టర్ విజయ్‌ని. యు ఆర్ అండర్ అరెస్ట్" అన్నాడు ఇన్స్పెక్టర్.

"మీరేదో పొరపడ్డట్లున్నారు- నన్నెందుకు, అరెస్టు చేయటం?" అన్నాడు ప్రసాదు, కలవరపడుతూ.

"మీరు ఆఫీసులో ఒక క్లయంటు దగ్గర మూడు లక్షలు లంచం తీసుకున్నట్టుగా మాకు ఇన్‌ఫర్మేషన్ వచ్చింది" అన్నాడు పోలీసు.

ఆ మాట వినగానే ప్రసాదుకు గుండె ఆగినంత పనైంది- "లేదు లేదు- మీకు ఎవరో రాంగ్ ఇన్‌ఫర్మేషన్ ఇచ్చారు" అన్నాడు. "అందరూ ఇలాగే అంటారు. మా పని మేం చేస్తాం. త్రీ నాట్ త్రీ! నేను ఈయనతో మాట్లాడుతుంటాను- నువ్వు ఇల్లంతా సెర్చ్ చెయ్" అని సోఫాలో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్.

కొద్ది సేపటికి పోలీసు లోపలినుండి అరిచాడు- "సార్! దొరికాయి సార్! రెండు లక్షలు! కొత్త నోట్లు కూడా సార్! మనకు వేలి ముద్రలు కూడా దొరకచ్చు" అని. ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు క్రూరంగా- "ఇప్పుడేమంటారు మిస్టర్ ప్రసాద్?!" అంటూ. "లేదు సార్.. ఇవి- ఇవి- మా మమయ్య.. నాకు ఇచ్చిన కట్నం డబ్బుల బ్యాలెన్సు..ఇందాకే తెచ్చి ఇచ్చారు సార్ ఆయన..!" గొణిగాడు ప్రసాదు.

"ఇప్పుడిక సాకులు చెప్పకండి. మీకు తెలీనిదేమున్నది? మీరూ‌ ప్రభుత్వ ఉద్యోగులేగా? కట్నం ఇవ్వడం, తీసుకోవటం కూడా నేరమే కదా అందువల్ల ముందు మిమ్మల్ని, ఆ తర్వాత మీ మామని కూడా అరెస్టు చేస్తాం" అంటూ బేడీలు తీశాడు ఇన్స్పెక్టర్. "లేదు సార్.. కాదు సార్.. ఇవి కట్నం కాదు సార్.. మరి ఇవి.. అట్లా కాదు- తప్పయి పోయింది- కాపాడండి- మీరే ఏదో ఒకటి చేయాలి సార్.." బ్రతిమిలాడటం మొదలెట్టాడు ప్రసాదు.

"అయినా ఇందులో ఉండాల్సింది మూడు లక్షలు కదా, రెండే ఉన్నాయే?" అన్నాడు ఇన్స్పెక్టర్ అనుమానంగా.

"నిజం సార్! అవి రెండు లక్షలే సార్! కావాలంటే మా మామ- వద్దులెండి సార్ మీరు ఎట్లా అంటే అట్లా చేయండి..." అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ప్రసాదు.

"ఇదిగోండి- రెండు లక్షలకు రసీదు రాసి ఇస్తున్నాను. మీరు సంతకం‌ పెట్టండి" అని ఒక రసీదు పుస్తకాన్ని ముందుకు జరిపాడు పోలీసు.

"వద్దు సార్! నాకూ దీనికీ ఏమీ సంబంధం లేదు- నేను ఏమీ సంతకాలు పెట్టను- నన్ను కాపాడండి" అనేసాడు ప్రసాదు.

"సరే!‌ మీ ఇష్టం. మిమ్మల్ని స్టేషన్‌కి పిలిచినప్పుడు రండి" అన్నాడు ఇన్స్పెక్టర్ డబ్బుల మూటతో సహా పైకి లేస్తూ.


అల్లుడు చెప్పిందంతా విని రామయ్య ఏడుస్తూ "ఇక ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అల్లుడూ" అన్నాడు.

"వదిలెయ్ మామయ్యా! నాకు నీ కట్నం‌ డబ్బులూ వద్దు; ఏమీ వద్దు. నా ఉద్యోగం‌ నిలిస్తే అది చాలు!" ఏడుపు ముఖం పెట్టాడు ప్రసాదు.

"అవును నాన్నా! పెద్ద గండం గడిచింది. త్వరలో తిరుపతి వెళ్ళి రావాలి" అన్నది పద్మ.


"నీ డబ్బుకు మా అల్లుడి రుణం ఉన్నట్లు లేదురా! అవి పోయాయి" అని సంగతంతా జగ్గయ్యకు చెప్పుకున్నాడు రామయ్య.

"నీకేమీ నష్టం జరగనివ్వనులే- ఎలాగో ఒకలా నీ అప్పు నేను తీరుస్తాను" అన్నాడు.

జగ్గయ్య నవ్వాడు- "లేదులే, నా డబ్బులు నా దగ్గరికి ఎప్పుడో‌ వచ్చేసాయి- నువ్విప్పుడు ఇవ్వాల్సిందల్లా ఆ దొంగ పోలీసులకు రోజువారీ ఖర్చులు" అని తనిచ్చిన డబ్బుల మూటను చూపించాడు!