అనగా అనగా చాలా ఏళ్ల క్రితం హిమాలయాల అంచుల్లో ఓ కుగ్రామం ఉండేది. ఈ రోజుల్లో ఉండే ఆధునిక సౌకర్యాలేమీ రాలేదు అక్కడికి ఇంకా. ఆ చిన్న పల్లెలో ఉన్నదల్లా కేవలం కొన్ని ఆదివాసుల కుటుంబాలు. ఆ కుటుంబాల వారికి కానీ, ప్రపంచపు అంచుల్లో ఓ చిన్న దీవిలా ఉండే ఆ గ్రామానికి గానీ బయటి ప్రపంచంతో ఏ సంబంధమూ ఉండే అవకాశం లేదు. అందుకేనేమో ఆ గ్రామస్తులు ఎలాంటి చీకూ-చింతా లేకుండా హాయిగా కాలం గడుపుతున్నారు.
ఆ కుటుంబాల్లో ఒకటి 'గుంబా' కుటుంబం. గుంబా, అతని భార్య 'సిప్పి' సంతోషంగా, అరమరికలు లేకుండా, ఒద్దికగా కాపురం చేసుకొనేవారు.
ఆ ఊరి చుట్టూ దట్టమైన అడవి ఉండేది. చుట్టు ప్రక్కల ఉండే చాలా ఊళ్ళ జనం వేటకోసం ఆ చుట్టుపక్కలకు వచ్చి వెళ్తుండేవారు. ఒకసారి అట్లా వచ్చినవాళ్ళెవరో తమతో బాటు తెచ్చుకున్న అద్దాన్ని పొరబాటుగా మరిచిపోయి అక్కడే వదిలి వెళ్ళారు.
ఆ మరునాడు పండ్లకోసం వెదకుతూ అడవిలోకి వెళ్ళిన గుంబా కంటపడింది అది. 'అదేంటా' అని చూసిన గుంబాకు అందులో తనకు బాగా పరిచయం ఉన్న ముఖం ఒకటి కనబడింది. మరెవరో కాదు- చాలా కాలం క్రితం చనిపోయిన తన తండ్రి ముఖమే, అది!
కొద్దిసేపు దాన్నే కళ్ళార్పకుండా చూసి, గుంబా చిరునవ్వు నవ్వాడు. చిత్రంగా, ఆ సాధనంలోంచి గుంబా తండ్రి కూడా చిరునవ్వు నవ్వాడు!
గుంబాకు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. 'చనిపోయిన ఇన్నేళ్ళకు మళ్ళీ తన తండ్రి తన దగ్గరికి వచ్చాడు!' అని అతనికి చాలా సంతోషమైంది. ఆ సాధనాన్ని చేతిలోకి తీసుకొని, దాన్నే తిప్పితిప్పి చూసి, ఏదో పెద్ద నిధి దొరికినట్టు సంబరపడిపోతూ ఇంటికి తీసుకెళ్ళాడు దాన్ని.
ఆ సమయానికి సిప్పి ఇంట్లో లేదు. గుంబా నేరుగా పోయి, నులక మంచం మీద కూర్చొని, తనకు దొరికిన ఆ సాధనాన్ని బయటికి తీసి, దానిలోకి చూసాడు ఆత్రంగా. అందులో తండ్రి ముఖం ఇంకా అలాగే ఉంది. అయితే ఇప్పుడది కొంచెం ఆత్రంగా ఉన్నట్లు అనిపించింది-
'చనిపోయి మళ్ళీ వచ్చిన తన తండ్రిని చూసి, ఇప్పుడు సిప్పి ఏమనుకుంటుంది? తనలాగే సంతోషపడుతుందా, లేకపోతే భయపడుతుందా?' అని ఆలోచించిన గుంబా, కొద్దిసేపటికి లేచి, అద్దాన్ని తీసి ఇంట్లో మూలగా ఉన్న చెక్క పెట్టెలో పెట్టాడు భద్రంగా. "దీన్ని సిప్పికి ఇప్పుడే చూపించను- కొద్ది రోజులు ఈ మనిషిని నేనే గమనించాలి" అని నిశ్చయించుకున్నాడు.
ఆ రోజునుండీ అతను తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు, అద్దాన్ని బయటికి తీసి చూసుకోవటం మొదలెట్టాడు. 'ఇప్పుడు తన తండ్రి ఎలా ఉన్నాడు?' అని క్షణం క్షణం అతని మనసు పీకేది. 'సిప్పి తనను గమనించట్లేదు' అనుకున్నప్పుడల్లా అతను అద్దం దగ్గరికి చేరేవాడు. అద్దంలో తన తండ్రి హావభావాలను గమనించేవాడు.
అయితే 'కొన్ని రోజులుగా తన భర్త ప్రవర్తనలో ఏదో మార్పు ఉన్నది' అని సిప్పికి అనిపించసాగింది. ఎన్నడూ లేనిది గుంబా ఇప్పుడు మధ్యాహ్నమంతా ఇంట్లోనే గడుపుతున్నాడు. ఇంటి బయట వసారాలో నులక మంచం వేసి ఉన్నా, అతను మాత్రం ఇంటి లోపలే ఉంటున్నాడు... దేన్నో పెట్టెలోంచి తీసి తీసి చూసుకుంటున్నాడు.. తనలో తానే నవ్వుకుంటున్నాడు- ఎందుకు? ఏమౌతున్నది? ఎంత ఆలోచించినా ఆమెకు అంతు చిక్కలేదు.
చివరికి ఆమె ఇక ఉండబట్టలేకపోయింది. గుంబా అటు అడవికి వెళ్ళగానే ఇటు తను పెట్టె మూత తీసి చూసింది. లోపల ఏదో వింత వస్తువొకటి ఉన్నది. ఏమిటది?- అని దాన్ని తీసి చూసింది- అందులో ఒక అందమైన యువతి ఒకామె...-!
ఇక ఆ క్షణం నుండి సిప్పి చాలా గందరగోళానికి లోనైంది. ఎవరీమె? తన భర్తను అంతగా కట్టి పడేసిన ఈ రాకాసి ఎవరు? నేనిక్కడ ఉండగా, నాతో మాట్లాడేది కూడా తగ్గించేసి, రహస్యంగా ఆమెనే చూడాల్సిన అవసరం గుంబాకు ఎందుకొచ్చింది? గుంబా మరి ఈమెను రెండో పెళ్ళి ఏమీ చేసుకోలేదు కదా..?" అని ఆమె మనసు పరిపరి విధాల పోయింది. "ఇవాళ్ళే తేల్చుకుంటాను తాడో, పేడో! ఏమనుకుంటున్నాడు, ఈ గుంబా? వీడి పని చెబుతాను- ఇంటికి రానీ!" అని సిప్పి చీపురు చేత బట్టుకొని పళ్ళు నూరుతూ కూర్చున్నది.
ఆరోజు మధ్యాహ్నంగా గుంబా ఇంటికి రాగానే “ఏమయ్యా, ఇన్ని రోజులు నీకింత ఊడిగం చేశానే? నన్ను ఇంత మోసం చేస్తావా? ఇంకొకామెను మనువాడతావా? ముందు నన్ను చంపేయవయ్యా!” అంటూ వేడి నూనెలో ఆవపు గింజలా చిటపటలాడుతూ మీదికి దూకింది సిప్పి.
"అయ్యో! అట్లాంటిదేమీ లేదే! నేనేమీ తప్పు చెయ్యలేదే!" అని అరుస్తూ సిప్పి చేతికి చిక్కకుండా ఇంటి చుట్టూ పరుగెత్తాడు గుంబా.
"నాకేమీ తెలీదనుకోకు! నువ్వు పెట్టెలో దాచిన బొమ్మను నేను చూడలేదనుకోకు! ఎట్లా ఉందో చూడు రాకాసి! నా మొగుడ్ని నాకు కాకుండా చేస్తుందా? దాని పని చెబుతాను! మా నాయన నిన్ను ఏం చేస్తాడో చూడు!" అని పెట్టె దగ్గరికి పరుగెత్తింది సిప్పి!
"ఒసే! అందులో ఉన్నది ఎవరనుకుంటున్నావు? చనిపోయిన మా నాయన వచ్చి అందులో కూర్చున్నాడే! జాగ్రత్త!" అని తనూ తటాలున అక్కడికి చేరుకున్నాడు గుంబా.
ఆ సరికి సిప్పి అద్దాన్ని బయటికి తీసి, అందులోకి చూసి, పళ్ళు పటపట కొరికి, "ఇది ఎవతె? మీ నాయన ఆడది ఎప్పుడాయె?" అంటున్నది.
గుంబా పోయి ఆమె ప్రక్కన నిలబడి అద్దంలోకి తొంగి చూసాడు- అందులో ఇప్పుడు తన తండ్రితో బాటు సిప్పి కూడా ఉన్నది! "ఒసే! ఇందులో ఉన్నది నువ్వేనే! అదిగో, మా నాయన- అదిగో, నువ్వు!" అన్నాడు ఆశ్చర్యపోతూ. అద్దంలో గుంబా తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు.
"ఊరుకో! అది మీ నాయన కాదు! నువ్వే!" అన్నది సిప్పి, సిగ్గు పడుతూ. అద్దంలో ఆమె కూడా సిగ్గుపడింది.
ఇప్పుడు అద్దంలో ఇద్దరూ కనిపిస్తున్నారు ఇద్దరికీ. కొద్దిసేపు ఇద్దరూ ఆశ్చర్యానందాలలో మునిగి పోయారు. ఒకరికేసి ఒకరు మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకున్నారు, ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఫక్కున నవ్వేసుకున్నారు.
అద్దంలో కూడా గుంబా, సిప్పి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఫక్కున నవ్వేసుకున్నారు.