రాజు, వాళ్లమ్మ ఒక రోజున దుకాణానికి వెళ్లారు.

బిల్లు కట్టే కౌంటరు దగ్గర్లో మూత లేని ఓ సీసా కనబడింది రాజుకు. ఆ సీసాలో సగానికి పైగా చాక్లెట్లున్నాయి.





రాజుకు వాటిని చూస్తే నోరూరింది.

అటూ ఇటూ చూసాడు. అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే రాజు అందులోంచి మూడు చాక్లెట్లు తీసి జేబులో వేసుకున్నాడు.





ఇంటికి రాగానే వాళ్లమ్మకు చూపించాడు వాటిని. "ఇవెక్కడివి? నేను కొనలేదే?" అని ఆశ్చర్యపోయింది రాజు వాళ్లమ్మ.

"నేనే తీశాను- వాటిని తినాలనిపించింది!" అన్నాడు రాజు అమాయకంగా.




రాజు వాళ్లమ్మకు కోపం వచ్చింది. అట్లా ఎవరికీ చెప్పకుండా ఎందుకు తీసావు? అది దొంగతనం అవుతుంది! అట్లా చేయకూడదు! ఇతరుల వస్తువులను దొంగలించకూడదు! అది ఎంత అసహ్యపు పనో తెలుసా?" అని బాధ పడింది అమ్మ. రాజు చేసిన పనికి ఆమె కళ్లలో నీళ్ళు తిరిగాయి.




రాజు వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. "ఇంకెప్పుడూ ఇట్లా చేయనమ్మా! అడగకుండా తీసుకుంటే పాపం, వాళ్ళకు నిజంగా కష్టమే" అన్నాడు.

రాజు వాళ్ల అమ్మ నవ్వి, రాజును ముద్దు పెట్టుకున్నది. "వెంటనే పో. ఆ దుకాణం యజమానికి నువ్వు తెచ్చిన మూడు చాక్లెట్లూ ఇచ్చేసి- ఇంకెప్పుడూ ఇట్లా చేయనని చెప్పి రా!" అని పంపించింది.




దుకాణపు యజమాని రాజు నిజాయితీని మెచ్చుకున్నాడు. "అవును బాబూ! అడక్కుండా‌ తీసుకోకూడదు. అయితే నువ్విప్పుడు మంచివాడివైపోయావు కదా, అందుకని నీకు ఇదిగో, బహుమతి!" అని వాటికి మరో మూడు చాక్లెట్లు కలిపి ఇచ్చి పంపాడు!!