అనగా, అనగా ఓ అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది. దాని పేరు చింపు. అది ఆడుతూ, పాడుతూ, చలాకీగా అడవిలో తిరుగుతూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది.
అయితే మిగిలిన జంతువులన్నీ చింపుని ఏమైన పనులున్నప్పుడు దగ్గరికి రానిచ్చేవి తప్పిస్తే, మిగిలిన సమయాల్లో పూర్తిగా దూరం పెట్టేవి.
-కారణం? చింపు మురికిగా ఉండటమే! చింపూ రోజంతా పని చేసేది, చెమటలు కక్కేది, సరిగా స్నానం చేసేది కాదు; మంచి బట్టలు కూడా వేసుకునేది కాదు.
కాని ఈరోజెందుకో, అది సూటు, బూటు వేసింది; తలకు నూనె పెట్టింది; చక్కగా దువ్వుకుంది; ముఖానికి పౌడర్ రాసుకున్నది; అందంగా ముస్తాబైంది; దర్జాగా రోడ్డు మీద వెళ్తూ ఉంది!
"ఎప్పుడు మురికిగా ఉండే కోతి పిల్ల ఈ రోజు ఇంత చక్కగా ఎందుకు తయారయిందబ్బా?" అని దాన్ని చూసిన జంతువులన్నిటికీ విచిత్రంగా తోచింది.

"చింపు స్వయంవరానికి వెళ్తునట్లు ఉన్నాడు" అని గాడిద హేళనగా నవ్వింది.
"చింపిరి చింపూ! ఎక్కడికీ, వెళ్తున్నావు? ఎక్కడ ఊడుస్తావు, ఈ రోజు?" అని జింక అడిగింది, వెటకారంగా.
"ఏయ్! ఎటు, పోతున్నావు? ఆగు! దుంపలు ఏరటంలో నాకు సహాయం చేయాలి- రా!" అని కుందేలు గద్దించింది.
అయినా చింపు ఎవ్వరికీ ఏమీ సమాధానం చెప్పలేదు. తనకి ఏమీ పట్టనట్లు, వాళ్లందరికేసీ పొగరుగా చూసి నడుచుకుంటూ పోసాగింది.
దాంతో తోడేలుకు చాలా కోపం వచ్చింది. "ఎంత పొగరు! ఎంత కావరం?! ఈ చింపిరి చింపుకి మనమంటే ఎంత చులకనో చూడు!! మనల్ని కాదని ఇది ఈ అడవిలో ఎట్లా బ్రతుకుతుందో చూస్తాను" అని కోపంతో రగిలిపోయింది.
"ఇది మనల్ని అందరినీ ఎగతాళి పట్టించి, తనొక్కతే ఎక్కడికో పోదామనుకుంటున్నది. అదేమీ‌ కుదరదు. ముందు మనందరం ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం- తర్వాత దీని పని పడదాం, పదండి!" అంది ఏనుగు.
"సరే సరే" అన్నాయ్ మిగిలిన జంతువులు.
చింపు నడిచి నడిచి చెరువు పక్కన- ఉన్న ఓ పొద దగ్గర ఆగింది. దానినే అనుసరిస్తూ వస్తూన్న జంతువుల గుంపంతా దానితోబాటే ఆగింది.
అప్పుడు చూసాయవి- ఆ పొద అంతా రకరకాల పువ్వులతో అలంకరించబడి చాలా అందంగా ఉంది! కొంగలు అతిథుల కోసం విందు ఏర్పాట్లు చేస్తున్నాయి! నెమళ్ళు, తాబేళ్లు కోలాహలంగా అటు ఇటు తిరుగుతున్నాయి! అవన్నీ ఏదో‌ పార్టీకి వచ్చాయి! ఏమీ అర్థం కాక, అయోమయంగా చూస్తున్న జంతువుల గుంపుతో చింపు చెప్పింది- "చూడండి మిత్రులారా! మీ అందరికీ చాలా కృతజ్ఞతలు! విషయం ఏమిటంటే, ఈరోజు నా మిత్రురాలు టుమ్మి పుట్టినరోజు. దానికి 'మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలి' అనుకున్నాను. కానీ నాకు తెలుసు- 'మీరు అందరూ బిజీగా ఉంటారు- ఎవరివో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి రమ్మంటే మీరు ఎవ్వరూ రారు' అని! ఆందుకే ఈ పథకం వేసాను- ఎప్పుడు మురికిగా ఉండే నేను చక్కగా ముస్తాబై వెళ్తుంటే, 'కుతూహలం కొద్దీనైనా మీరంతా నా వెంట వస్తారు' అని ఈ పని చేసాను. మీరంతా నన్ను క్షమించాలి" అంది.
చింపు తెలివికి అవన్నీ ఆశ్చర్యపోయాయి,
ఇంతలో మర్రి చెట్టు మీద నుండి ఉడతమ్మ దిగి వచ్చి టుమ్మీని పిలిచింది- ఇదిగో టుమ్మీ!‌ ఎవరెవరు వచ్చారో చూడు! త్వరగా బయటకి రా!" అని పిలిచింది.
టుమ్మి బయటకి వచ్చి "హాయ్ చింపూ,హాయ్ ఏనుగు మామా! హాయ్ అందరూ! హమ్మయ్య! వచ్చారా! మీరెవ్వరూ రాలేదనే బెంగ పడుతున్నాను!" అంది. జంతువులన్నీ‌ సిగ్గు పడుతూ నవ్వాయి. టుమ్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి.
"వీళ్లందరినీ నేనే పిల్చుకొచ్చాను. ఇకనుండి వీళ్లంతా కూడా నీ మిత్రులు" చెప్పింది చింపూ.
"పదపద.. కేక్ కోద్దాం! టైం అయ్యింది" అని టేబుల్ దగ్గరకి తీసుకెళ్ళింది చింపు. టుమ్మి కేకు కట్ చేసీ అతిథులందరికి తినిపించింది.
అంతలో "మీ అమ్మా, నాన్న ఎక్కడ టుమ్మీ?!" అని అడిగింది తోడేలు.
టుమ్మీ ముఖం చిన్నబోయింది. కళ్లలో నీళ్ళు తిరిగాయి.

"మీకు తెలియదు కదూ? టుమ్మీకి అమ్మా-నాన్న లేరు. ఎప్పుడో చనిపోయారు. దాంతో టుమ్మీ ఊరికే కూర్చొని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆ సమయంలో టుమ్మీకి చింపూతో స్నేహం కుదిరింది. దాన్ని అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది చింపూ. దాని సాయం వల్లనే టుమ్మి కోలుకుని, ఇప్పుడు ఇంత పెద్దదయింది. ఈ పుట్టిన రోజు వేడుకలను కూడా చింపునే ఏర్పాటు చేసింది- తెలుసా? 'నాకు ఎవ్వరూ లేరు' అని టుమ్మి బాధ పడుతుంటే "లేదు టుమ్మీ!మనకి చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు" అని చెప్పి, మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది" వివరించింది అక్కడికొచ్చిన గొల్లభామ.
"బయటికి ఎప్పుడు అల్లరి చిల్లరిగా కనిపించే మురికి కోతిపిల్ల 'చింపిరి చింపూ' మనసు మాత్రం పాలంత తెల్లనిది; సెలయేటి నీరంత స్వచ్చమైనది" అని తెలుసుకున్నాయి అడవిలోని జంతువులన్నీ.
"స్నేహానికి విలువ కట్టలేం; 'ఎవరికైనా రూపం కాదు- గుణం ముఖ్యం' " అని పాడాయి. ఆ రోజే కాదు; తర్వాత ఏనాడూ‌ టుమ్మీకి ఇక ఒంటరితనం గుర్తుకే రాలేదు- అంతగా అవన్నీ కలిసి పోయాయి!