అమరాపురం రవి, కిరణ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు; కలిసి చదువుకునేవాళ్ళు; కలిసి ఆడుకునేవాళ్ళు. అయినా చదువుల్లోను, ఆటపాటల్లోను 'నువ్వా-నేనా' అన్నట్లు పోటీ పడేవాళ్ళు; ప్రతి పనిలోనూ ముందుండేవాళ్ళు; దాంతో ఉపాధ్యాయులకు వాళ్ళంటే చాలా అభిమానం ఉండేది.
అయితే అమరాపురంలో కొన్నేళ్ళు నుండి వరసగా వర్షాలు తగ్గిపోతూ వచ్చాయి. ఆ ఏడాదైతే త్రాగేందుకు కూడా నీరు లేక జనం అల్లాడిపోయారు. చిన్న రైతుల పరిస్థితి ఐతే ఘోరంగా తయారైంది. ఎక్కడ చూసినా ఎండిపోయిన చేన్లు కనిపించసాగాయి.
'ఇక తప్పదు-నగరానికి వలస పోవలసిందే' అని తయారైన వాళ్లలో రవి తల్లిదండ్రులు కూడా ఒకళ్ళు. ఆ రోజున రవి తన పుస్తకాలన్నీ మూటగట్టి కిరణ్కి ఇచ్చేసాడు- "వేరే ఎవరైనా పిల్లలకు పనికొస్తాయేమో ఇవ్వు. ఇంకో రెండు రోజుల్లో మేం ఎట్లాగూ సిటీకి వెళ్ళిపోతాం. నేనైతే చదువు మానేసినట్లే" అంటూ.
అది విని కిరణ్కి ఏడుపు వచ్చింది. స్నేహితుడిని తలచుకొని వాడు చాలా దిగులు చెందాడు. రోజంతా ముభావంగా ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం కల్లా వాడికి జ్వరం వచ్చేసింది.
తరువాతి రోజున రవి-కిరణ్ ఇద్దరూ బడికి రాకపోయేసరికి ఉపాధ్యాయులందరికీ సంగతి తెల్సింది. వాళ్లలో ఒక అయ్యవారు రవి వాళ్లింటికి, కిరణ్ వాళ్ళింటికి వెళ్ళి పలకరించి వచ్చారు. "గడవటం కష్టంగా ఉన్నది సార్. మా వాడి చదువు మాన్పించటం ఇష్టంగా లేదు గానీ, ఏం చెయ్యమంటారు? మాకు వేరే అవకాశం లేదు!" చెప్పాడు రవి వాళ్ళ నాన్న.
"ఎవరో పట్నం వలస పోతున్నారని వీడు దిగులు పెట్టుకుంటే అవుతుందా? వీడి చదువు వీడు చదువుకోవాలి, అంతే" అన్నాడు కిరణ్ వాళ్ల నాన్న. ఆయన ఊళ్ళో కిరాణా వ్యాపారి.
అయ్యవారు ఆయనకు నచ్చ జెప్పారు- "చూడండి, వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, కలిసి బాగా చదువుకుంటారు. ఆ పిల్లాడి కుటుంబం కష్టాలలో ఉంది. మీలాంటి వాళ్ళు వాళ్ళకు కొద్దిగా సాయం చేస్తామంటే, మేం- ఉపాధ్యాయులం కూడా మావంతు సాయం మేం చేస్తాం. ఏవేవో మొక్కుబళ్లనీ, దేవుడికి-గుడికి అని మీరు ఎంతో కొంత ఖర్చు పెడుతూనే ఉంటారు కదా; ఇది ఈ రూపంగా దేవుడికి చేస్తున్న సేవ అనుకుంటే, చూడండి మరి. విద్యాదానం కూడా ఊరికే పోదు" అని.
ఆయన మాటలు కిరణ్ తల్లిదండ్రులను కదిలించాయి. ఆరోజు దీపాలు పెట్టే వేళన కిరణ్ వాళ్ల నాన్న రవి వాళ్లింటికి వెళ్లి, చెప్పాడు- "చూడండి, మీరు వలస పోతామంటే నేను కాదనేది లేదు. అయితే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వేరే మార్గం ఏదైనా ఆలోచిద్దాం. కరువు ఉన్న ఈ కొద్ది నెలలూ మా దుకాణంలోనే ఏదైనా పని కల్పిస్తాను. మీ కుటుంబం నడిచేందుకు అవసరమయ్యే డబ్బులు కూడా మా వంతు బాధ్యతగా మేం సర్దుతాం. అలా కాదంటే, పోనీ- మీ పిల్లాడిని ఇక్కడే- మా ఇంట్లో వదిలి వెళ్తామంటే అదీ పర్లేదు- మాకు ఇద్దరు కొడుకులనుకుంటాం. వాడిని మేం చదివిస్తాం- మీరు ఎలాగంటే అలా చేద్దాం" అన్నారు.
అది విని రవి తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉండేందుకు నిశ్చయించు-కున్నారు. ఆ మాట వినగానే రవి ఎగిరి గంతేసాడు. కిరణ్ జ్వరం మాయం అయిపోయింది!
మరుసటి రోజున ఎప్పటిమాదిరే చెట్టపట్టాలు వేసుకొని బడికొచ్చిన రవి-కిరణ్లను చూసి బడిలో ఉపాధ్యాయులతో సహా అందరూ ఎంతో సంతోషపడ్డారు. అందరూ వాళ్ల తల్లిదండ్రులను అభినందించారు.
తర్వాతి ఏడాది వానలు బాగా పడ్డాయి. చెరువులు నిండాయి. పంటలు బాగా పండాయి. రైతుల కష్టాలు తీరాయి. రవి తల్లిదండ్రులు మళ్ళీ నిలద్రొక్కుకున్నారు. ఇప్పుడు ఇద్దరి కుటుంబాలూ కూడా దగ్గరయ్యాయి.
ఆపదలో ఆదుకున్న వారే కదా నిజమైన ఆప్తమిత్రులు?! ఒకరికొకరు సహాయం చేసుకోవటమే కద, సామాజిక జీవనం అంటే?!