చిన్నపల్లి బళ్ళో ఎనిమిదో తరగతి చదివే స్వాతి చాలా తెలివైనది. తను చక్కగా చదువుతుంది; పాఠాలు శ్రద్ధగా వింటుంది; ఆటలూ చక్కగా ఆడుతుంది. అంతే కాదు ఆ పాపకు చాలా ధైర్యం కూడా.

పద్ధతి ప్రకారం వాళ్ల బడిలో ప్రతిరోజూ చివరి పీరియడ్‌ని ఆటలకు కేటాయించారు. కానీ వాళ్ల బడికి మటుకు 'డ్రిల్ సార్' లేడు! దాంతో పిల్లలంతా ఎవరికి తోచిన ఆటలు వాళ్ళు, వాళ్లకు తోచినట్లు ఆడుకునేవాళ్ళు; కానీ పద్ధతి ప్రకారం ఆడే ఆటలేవీ వాళ్లకు తెలీదు. ఒక్కోసారి ఆటల్లో వాళ్ళకు దెబ్బలు తగిలేవి; ఒక్కోసారి పోట్లాటలు అయ్యేవి- అలాంటప్పుడంతా మిగిలిన టీచర్లు వాళ్లనే తిట్టేవాళ్ళు- "ఎవరు ఆడుకోమన్నారు మిమ్మల్ని?! ఊరికే దెబ్బలు తగిలించుకొని మా మీదికి తెస్తారు?!" అనేవాళ్ళు.

ఒకసారి స్వాతి వాళ్లమ్మని వెంటబెట్టుకొని పట్నం వెళ్ళింది. సాయంకాలం అవుతుం-డగానే పట్నపు బడిలో పిల్లలు ఆటలు మొదలెట్టారు. ఆటల్లో వాళ్ల కదలికల్ని, నైపుణ్యాన్ని గమనిస్తూ నిలబడిన స్వాతి ఆశ్చర్యపోయింది. అదంతా వాళ్లకి శిక్షణ ఇస్తున్న 'పి.డి.సార్' ప్రతిభే అని తెల్సిపోయిందా పాపకు!

దాంతో "మాకు కూడా ఇట్లా 'పి.డి.సార్' ఉంటే ఎంత బాగుంటుంది కదా" అని ఆలోచన మొదలైంది ఆమెకు. వెంటనే ఆ కనిపించిన డ్రిల్‌సార్ దగ్గరికే పోయి "సార్! మీరు మా బడికొచ్చి మాకు కూడా‌ ఆటలు నేర్పించరాదా సార్?" అని అడిగింది. ఆ సార్ ఆశ్చర్యపోయి, "ఇంతకీ మీదే ఊరు పాపా?!" అని అడిగాడు. తర్వాత చెప్పాడు-"చూడు పాపా! మీ బడికి పిఇటి పోస్టు లేదు- ముందు మీ హెడ్మాస్టరు గారితో చెప్పండి మీరంతా. ఒక్కొక్కళ్ళే వెళ్తే లాభం లేదు- పిల్లలంతా వెళ్ళి అడిగితే, అప్పుడు ఆయన పై అధికారులకు చెబుతారు. ఆయన మాట మీద మీ‌ బడికి పిఇటి పోస్టు మంజూరు చేస్తారు" అని చెప్పాడు. మరునాడు స్వాతి బడికి రాగానే తన స్నేహితులకు ఆ సంగతి చెప్పి, "రండి- మనందరం కలిసి హెడ్మాస్టరు సార్‌ని అడుగుదాం" అంది.

వాళ్లంతా భయపడ్డారు- "ఏయ్! నీకేమైనా పిచ్చి పట్టిందా?! హెచ్‌యం సారు- ఏమనుకుంటున్నావో- మేం రాం. మనకేమీ డ్రిల్‌సారు అవసరం లేదు అసలు- ఇట్లా ఆడుకోవటమే బాగుంది' అని వెళ్లి పోయారు.
కాని స్వాతి చాలా పట్టుదల గల అమ్మాయి. ఒకసారి ఏదైనా అనుకున్నదంటే సులభంగా వదిలేది కాదు. అదీగాక పట్నపు బడిలో పిడిసార్‌ని చూసింది కద! ఆ సార్ చాలా నచ్చాడు ఆ పాపకు.

'మరేం చేయాలి?' అని ఆలోచించి, ఆ పాత తనకై తాను ఒక అర్జీ రాసింది: "గౌరవనీయులైన హెచ్‌యం సారుకు- మన బడిలో పిఇటి సార్ లేకపోవటం వల్ల చాలా సమస్యగా ఉంది. పిల్లలకు శరీరశిక్షణ లభించటం లేదు. దయచేసి మన బడికి ఒక పిఇటి సారును పెట్టించండి" అని రాసి, దానిమీద తనకు తెలిసిన పదిమంది పిల్లలతో సంతకాలు పెట్టించి, దాన్ని తీసుకెళ్ళి నేరుగా హెడ్మాస్టరు గారికి అందజేసింది.

'ఇదేంటి? సెలవు చీటీనా?' అని చదివిన హెడ్మాస్టరు, స్వాతికేసి చూసి కళ్ళెగరేసారు. "ఏంటి పాపా, ఇది?!" అన్నారు. "సార్ మన బడికి 'పిఇటి సార్' ఉంటే బాగుంటుంది సార్. పిల్లలందరిదీ అదే కోరిక. కానీ అందరూ మీ దగ్గరికి వచ్చేందుకు భయపడుతున్నారు" అన్నది స్వాతి తల వంచుకొని.

హెడ్మాస్టరు గారికి ఆ పాపని చూసి ముచ్చటేసింది. అయినా ఆయనన్నారు "చూడు పాపా! నేను ఈ స్కూల్‌కి కేవలం హెడ్మాస్టారును. నీకు తెలుసా, నా పైన MEOగారు, DEOగారు ఇట్లా చాలా మంది ఆఫీసర్లు ఉంటారు. వాళ్లంతా ఒప్పుకుంటే తప్ప, మనకు ఇట్లా కొత్త టీచర్లు రారు. అర్థమైందా?" అని.

స్వాతి కళ్లలో నీళ్ళు తిరిగాయి. హెడ్మాస్టరుగారు అది చూసి మెత్తబడ్డారు- "సరేలే! నేను ఈ అర్జీ తీసుకొని, పై అధికారులకు పంపుతాను. తర్వాత వాళ్లు ఎలా అంటే అలా" అన్నారు.

ఒక వారం రోజుల తర్వాత స్వాతి మళ్ళీ హెడ్మాస్టరుగారి దగ్గరికి వెళ్లింది- ఆయన "ఏంటి? మళ్ళీ వచ్చావు?" అని అడిగారు.
"సార్! మరి.. డ్రిల్ సార్" అన్నది స్వాతి.

హెడ్మాస్టరుగారికి కోపం వచ్చేసింది- "నువ్వు ఏమనుకుంటున్నావు పాపా! మేం ఇన్ని సమస్యలతో సతమతమౌతుంటే- నువ్వు ఒక దానివి తయారయ్యావు- డ్రిల్ సార్ కావాలట! ముందు నువ్వు బయటకు వెళ్లు- నీకేమైనా కావాలంటే పోయి యంఈవోని అడుగు!" అని అరచారు.

ఆ అవమానానికి స్వాతి ముఖం ఎర్రబడ్డది. అయినా పట్టు వదలని స్వాతి ఆ మరుసటి రోజున మరో అర్జీ తయారు చేసింది. ఈసారి దాని మీద ఇరవై మంది బడిపిల్లల సంతకాలు తీసుకుని, 'యంఈవో సార్' దగ్గరకు వెళ్లింది.

యంఈవోగారు ఆమె ఇచ్చిన అర్జీ తీసుకొని చదివి, "చూడు పాపా, ఇది మీ హెడ్మాస్టరు గారి ద్వారా రావాలి" అన్నారు. కళ్లలో నీళ్ళు తిరగగా, ఆయన ఏం చేసారో, చివరికి ఏమన్నారో చెప్పింది స్వాతి. "నిజమే పాపా! హెడ్మాస్టర్లు రకరకాల పనులతో సతమతమౌతున్నారు. సరేలే, నీ అర్జీని నేను పై అధికారులకు పంపుతాను- అవసరమైతే నువ్వు వెళ్ళి డీయీవో గారిని కలవాల్సి వస్తుంది- పోతావుగా?!" అన్నారాయన.

'సరే' అన్నట్లు తల ఊపింది స్వాతి.

"ఆయన నవ్వి, చిన్న పిల్లవి నీకు ఇవన్నీ అవసరమా? ముందు నువ్వు మీ ఇంటికి వెళ్లు" అని పంపించేశాడు.

స్వాతికి అర్థమైంది- "యంఈవో గారు కూడా‌ ఏమీ చేయరు- ఇక్కడ కూడా పని అవ్వదు" ఆ పాపకి చాలా బాధగా అనిపించింది- అయినా "ఒకసారి అనంతపురం వెళ్ళి డీఈవో సార్‌ని కలిస్తే?" అనుకున్నది.

"ఓయ్.. నీకేమైనా పిచ్చి పట్టిందా? డీయీవో సార్ అంటే ఎవరనుకున్నావు?" అన్నారు తోటి పిల్లలంతా. "ఆయన్ని చూసేందుకు మన సార్లు కూడా భయపడతారు" అన్నారు.

అయినా పట్టుదలగల స్వాతి సొంతగా డీయీవో సార్ అఫీసు అడ్రస్ కనుక్కొని, అనంతపురం వెళ్ళింది.

అక్కడ చూస్తే ఎంతో మంది టీచర్లతో అఫీసు అంతా ఒక సంత లాగా ఉంది. అక్కడున్న టీచర్లంతా ఈ పాప ఎందుకొచ్చిందో తెలుసుకొని, వెటకారంగా నవ్వారు. స్వాతి చాలా చిన్నబోయింది. బాగా నిరుత్సాహపడింది.

అయితే సరిగ్గా ఆ సమయంలో అక్కడికొచ్చారు, పట్నంలో తను చూసిన 'పీడీసార్'. ఆయన స్వాతిని చూడగానే దగ్గరికొచ్చి, "ఏంటి పాపా! నువ్విక్కడ?! ఒక్కదానివీ ఇంతదూరం వచ్చావేమి?" అని అడిగారు. స్వాతి తను తెచ్చిన అర్జీని చూపింది ఆయనకు.

అది చూడగానే ఆయన తటాలున దాన్ని తీసుకొని, నేరుగా లోపలికెళ్ళి డీయీవో గారితో ఏదో మాట్లాడారు. డీయీవోగారు వెంటనే స్వాతిని లోపలికి పిలిపించుకొని, ఆమె తెచ్చిన అర్జీని చదువుతూ, మొదట తన వివరాలు, స్కూల్ వివరాలు అడిగారు. ఆ తర్వాత "అర్జీ ఇవ్వడానికి నువ్వు ఇంత దూరం రావాలా? మీ హెడ్మాస్టరు సార్‌కి సరిపోయేది గదా!" అన్నారు.

"సార్ మొదట అర్జీ ఆయనకే ఇచ్చాను సార్! ఆయన నా మీద కోపగించుకొని యంఈవో సార్‌ని కలవమన్నారు. ఆ సార్ దగ్గరకు వెళ్తే 'మా పై ఆఫీసరు డీయీవో గారు ఉంటారు- ఇదంతా మా చేతిలో ఉండదు' అన్నారు. "చివరికి నేను ధైర్యం చేసి ఇట్లా మీ దగ్గరికి వచ్చాను" అన్నది.

డీయీవో గారు నవ్వారు- "లేదు పాపా! యంయీవో గారు నాలుగు రోజుల క్రితమే నాకు ఫోను చేసి మాట్లాడారు. నువ్వు అర్జీ ఇచ్చిన సంగతి చెప్పారు. త్వరలో మీ బడికి ఒక పిఇటి పోస్టు మంజూరు చేయాలని మేం నిర్ణయించాం కూడా. ఏమైనా నీ ధైర్యం, పట్టుదల మాత్రం మెచ్చుకోదగినవి. ప్రతి బడిలోనూ నీలాంటి పిల్లలు ఒకరిద్దరు ఉన్నా చాలు- మన వ్యవస్థ అంతా మంచిదారిన పడుతుంది" అని మెచ్చుకొని, స్వాతికి షేక్‌హ్యాండ్ ఇచ్చి, "ఇదిగో- ఈ పాపని జాగ్రత్తగా వాళ్ళు ఊరు చేర్చు" అని ఓ మనిషిని వెంట ఇచ్చి మరీ పంపారు.

మరుసటి నెలకల్లా చిన్నపల్లి బడికి కొత్త పీఈటీ సార్ వచ్చారు. ఆయన పిల్లలకు ఎన్నెన్ని ఆటలు నేర్పారో!

ఒక్క పాప పట్టుదల వల్ల ఇంత జరిగింది. ఇక మనందరం పట్టుబడితే ఎన్నెన్ని మంచిపనులు జరుగుతాయో?!