విజయపుర మహారాజు సమర్థుడైన పాలకుడు. ఆయన లక్షణాలన్నిటినీ పుణికి పుచ్చుకున్న యువరాజు అనంతుడు చక్కనివాడు; తెలివైనవాడు; ఆలోచనా పరుడున్నూ. దేశ సంక్షేమం కోసం తండ్రి చేసే ప్రయత్నాలకు అతను ఎప్పుడూ చేదోడు వాదోడుగా నిలిచేవాడు. మహారాజుగారి వారసుడిగా రాజపీఠాన్ని అధిష్ఠించడానికి కావలసిన అర్హతలన్నీ అనంతునికి ఉండేవి. ప్రజలందరూ అతన్ని ఎంతో గౌరవించేవాళ్ళు; మంచి సమయం చూసి కుమారుడికి సింహాసనం అప్పగించ వలసినదిగా మహారాజుకు అనేక పర్యాయాలు విన్నవించుకున్నారు కూడాను.

అయితే యువరాజుకు ఇంకా వివాహం కాలేదు. తగిన కన్యను చూసి వివాహం చేసుకొని, ఆ తరువాత రాజ్యభారాన్ని వహించటం మంచిదని మహారాజు రాజకుమారునికి సలహా ఇచ్చాడు.

'సరే- నాకు కొంత సమయం‌ ఇవ్వండి-' అని తగిన కన్యను వెతుక్కుంటూ యువరాజు దేశాటనకి బయలుదేరాడు: సాదా పౌరుడి వేషం వేశాడు; స్నేహితుడినొకడిని వెంటబెట్టుకున్నాడు. కాలి నడకన దేశం దాటి తగిన పిల్లకోసం వెతుకుటూ వెళ్లాడు. అట్లా వాళ్ళిద్దరూ చాలా రోజుల పాటు ప్రయాణం చేశారు. ఆ దారంట పోతూ వాళ్ళు చాలా మంది పెళ్ళి ఈడుకు వచ్చిన అమ్మాయిలను చూశాడు. కానీ ఎవరినీ రాజ్యానికి కాబోయే రాణిగా ఎంపిక చేయలేకపోయాడు యువరాజు.

ఒకరోజు సాయంత్రం వాళ్ళిద్దరికీ‌ ఓ చిన్న గ్రామంలో ఒక రైతు ఇంట బస దొరికింది. తమను తాము బాటసారులుగా పరిచయం చేసుకున్నారు వాళ్ళిద్దరూ. రైతు కూతురు చక్కగా అందంగా ఉంది. అతిధుల్ని చూసి పొయ్యి రాజేసింది. అయితే ఇంట్లో వంటకి కావలసిన కట్టెలు సరిపడా లేనట్లున్నాయి- ఆమె ఇబ్బందిని గమనించి యువరాజు, అతని మిత్రుడు ఇద్దరూ కట్టెలు కొన్ని కొట్టి, తెచ్చి ఇచ్చారు. ఆమె వంట చేసింది.

యువరాజు ఆమెకు వంట పనిలో సహాయం చేశాడు. ఆమె వద్దనలేదు. పైపెచ్చు అతని స్నేహితుడికి కూడా చిన్న చిన్న పనులు పురమాయించింది. "మన పనులు మనం చేసుకోవాలి- అందులో సిగ్గు పడేది ఏముంది?" అన్నది. రాజ కుమారుడికి ఆమె నచ్చినట్లుంది- ఆమె వెంటనే తిరిగాడు; ఆ పనీ ఈ పనీ చేసి పెడుతూ మాట్లాడాడు.

మర్నాడు తెల్లారే లేచి ఆ అమ్మాయి నీళ్లు తోడింది; ఇల్లు శుభ్రం చేసింది. ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడుతూ చకచకా ఇంటి పనులు చేసింది. మరోసారి అతిథులకు భోజనం చేసి పెట్టింది. మధ్యాహ్నం అవుతుండగా "ఊరికే మన బ్రతుకు మనం‌ బ్రతికితే చాలదు- పొరుగు వాళ్లకు కొంచెం సాయపడాలి" అని వాళ్ళిద్దరినీ ఊళ్ళోకి తీసుకెళ్ళింది. మళ్ళీ వాళ్ళిద్దరి చేతా చిన్న చిన్న పనులు చేయించింది. వాళ్ల గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు పెద్దలతోటీ, చిన్నలతోటీ చర్చించింది. చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్లకి వాటి నుండి బయటపడే ఉపాయాలు చెప్పింది.

ఆమె వ్యక్తిత్వం యువరాజుని చాలానే ఆకర్షించింది. "కానీ ఈమె సాధారణ రైతు బిడ్డ. సాదా-సీదాగా ఉన్న మామూలు యువతి. రాణివాసపు తీరు తెన్నులేమీ‌ పరిచయం లేవు ఈమెకు" అనుకున్నాడు యువరాజు వెంటవచ్చిన మిత్రుడు. అయినా యువరాజు తీరును గమనించి, అతన్ని హెచ్చరిస్తున్నట్లు- "మిత్రమా! మనం ఉన్నది బొత్తిగా చిన్న కారు రైతు ఇంట్లో. ఇది వీరున్న స్థితికి, మనం వచ్చిన పనికి రెండింటికీ సరిపోదు. మనం‌ పొరుగు రాజ్యం చేరాలి కదా, ఇక బయలుదేరితే మంచిదేమో" అని తన అభిప్రాయాన్ని అన్యాపదేశంగా వ్యక్తం చేశాడు.

స్నేహితుని భావాన్ని అర్థం చేసుకున్న రాజకుమారుడు మౌనం వహించాడు; మధ్యాహ్న భోజనం తర్వాత రైతు దగ్గర ఇద్దరూ సెలవు తీసుకున్నారు.

అట్లా కొన్నాళ్లు ప్రయాణం చేసాక ఇద్దరూ పొరుగు రాజ్యం చేరారు. అది బాగా సంపన్నమైన దేశం. ఆ దేశపు రాజుగారు అనంతుడిని గుర్తుపట్టారు. "మీ నాన్నగారి సందేశం అందింది నాయనా! నేను, మీ నాన్నగారు ఇద్దరం కలిసి చదువుకున్నాం. నీ గురించి అంతా చెప్పారు నాన్నగారు" అన్నాడాయన, వాళ్లకు రాజోచితమైన బస ఏర్పరచి. అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు. ముగ్గుర్నీ పరీక్షించి, వారిలో ఒకరిని పెళ్లి చేసుకుంటే సరిపోతుందన్నాడు స్నేహితుడు. యువరాజు చిరునవ్వు నవ్వాడు.

మొదట రాజకుమారి పేరు సుకుమారి. పేరుకు తగ్గట్టే ఆమె పరమ సుకుమారి. సన్నగా, నాజూకుగా, ఊదితే పడిపోయేలా ఉంది. అద్భుతమైన అందగత్తె ఆమె.

ఆ రోజు సాయంత్రం, వెన్నెల వేళన, ఆమె అందం చూసేసరికి యువరాజు ఏవేవో ఊహల్లో తేలిపోయాడు. అయితే కొద్ది సేపటికి తేరుకొని, "అలా విహారానికి వెళ్దామా, కొంచెం సేపు వెన్నెల్లో విహరించి వద్దాం?!" అన్నాడు గుసగుసగా.

"హమ్మో, నేను రాలేను!" సుకుమారి కంగారు పడింది.

"ఎందుకూ?!" రాజకుమారుడు అడిగాడు.

"బైట వాతావరణం అనుకూలంగా లేదు!" అన్నది రాకుమారి.

"భలే దానివే. బైట వెన్నెల కురుస్తోంది. ఇది చాలా మంచి కాలం!" అంటూ సుకుమారిని చనువుగా చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్లాడు రాకుమారుడు.

వెన్నెల్లోకి వస్తూనే సుకుమారి కాస్తా కకావికలైంది. వెన్నెల సోకేసరికే ఆమె మొహం కమిలిపోయింది. రాజకుమారుని చెయ్యి ఎక్కడైతే తగిలిందో ఆ చేయంతా ఎర్రగా కందిపోయింది.

ఆమె అవస్థ చూసి యువరాజు ఆశ్చర్యపోయాడు."అబ్బ! ఎంతటి సౌకుమార్యం!" అనుకున్నాడు నివ్వెరపోతూ.

ఆ తర్వాత అతను రెండో రాకుమారి దగ్గరికి వెళ్లాడు. సుకుమారి కంటే రెండింతలు అందంగా ఉన్నది ఆమె. పేరు మృదుల. ఆమె శరీరం ఎంత మృదువుగా ఉందో చూసి రాకుమారుడు పరవశించి పోయాడు.

వాళ్ళిద్దరూ నిలబడిన తావుకు దగ్గరలోనే ఏడు పరుపులున్న తల్పం ఒకటి ఉన్నది. రాకుమారుడిని మర్యాదగా ఆహ్వానించి చిరునవ్వుతో పలకరించింది రాకుమారి మృదుల. పాన్పుపై కూర్చోబెట్టింది.

"మీరూ కూర్చోండి" అన్నాడు రాకుమారుడు.

మృదుల తన చేతిని పరుపుకి ఆనించిందో లేదో- ఒక్కసారిగా కెవ్వుమని కేకపెట్టింది. పరుపుకు ఆనినంత మేర, ఆమె అర చేతికి లోతుగా ఒక గాటు పడింది!

'పరుపు క్రింద శత్రువులెవరైనా ఏ మేకులో, కత్తులూ-కటార్లో పెట్టారేమో!' అని యువరాజు హడావిడిగా దుప్పట్లు తీసి చూశాడు. ఏమీ కనబడలేదు.

ఆశ్చర్యపోయిన యువరాజు పరుపులన్నీ దులిపాడు. ఏడో పరుపు అడుగున సన్నటి వెంట్రుక ఒకటి కనబడింది.

"హారి దేవుడో! వెంట్రుకే!! ఎవరు, ఇంత నిర్లక్ష్యంగా సర్దింది, ఈ‌ పరుపుల్ని?!" అని కేకలు పెడుతూ అంత:పురంలోకి వెళ్లిపోయింది మృదుల.

ఆ తర్వాత యువరాజు మూడో యువతిని కలిశాడు. ఆమె పేరు సున్నిత. తన అక్కలిద్దరికన్నా పది రెట్లు అందంగా, సున్నితంగా ఉంది. బైట చల్లగాలి వీస్తోంది గానీ యువరాజు సున్నితని బైటికి రమ్మనేందుకు భయపడ్డాడు. ఇద్దరూ సుఖాసీనులయ్యారు. యువరాజు సున్నితతో చతుర సంభాషణ చేశాడు.

హఠాత్తుగా సున్నిత తన స్థానం నుండి లేచింది: "ఆపండీ!!" అని కేకలు పెడుతూ కోట దాటి వీధి వెంబడి పరుగు పెట్టింది!

రాజవీధికి నాలుగు వీధుల అవతలగా భార్యా భర్తలు ఇద్దరు అరిసెలు చేసుకుందామని పిండి దంచుకుం-టున్నారు. ఆ దంపుడు శబ్దానికి సున్నిత చేతులు కంది మందారాలయ్యాయి!

"అయ్యో, క్షమించండి యువరాణీ, ఇంకెప్పుడూ మీకు ఇంత దగ్గర్లో బియ్యం దంచము" ప్రాథేయపడ్డారు వాళ్ళు.

మరునాటి రోజు సాయంత్రం యువరాజు ఒంటరిగా ఉన్నప్పుడు "ఎవరిని ఎంపిక చేశారు యువరాజా?" అడిగాడు స్నేహితుడు, ఆసక్తిగా.

"వీళ్ళు ముగ్గురూ ఒకళ్లని మించి మరొకళ్లు అందగత్తెలూ, సుకుమారులూనూ. కానీ వెన్నెలకీ, వెంట్రుకకీ, రోకలి శబ్దానికీ కూడా తట్టుకోలేని వీళ్లు, రేపు రాజ్యభారాన్ని నాతో మోయడానికి పనికి రావడం కల! నాకు వీళ్లెవరూ వద్దు. పద, రైతు కూతురి సంబంధమే మాట్లాడుదాం. ఆమె నాకు నచ్చింది!" అంటూ లేచాడు యువరాజు.

యువరాజు నిర్ణయాన్ని మెచ్చుకుంటూ, సమర్థతకి కాకుండా హోదాకి విలువనిస్తూ తాను మాట్లాడిన మాటలకు సిగ్గుపడ్డాడు వెంట వచ్చిన స్నేహితుడు.