"మన దేశ ప్రజలకు ఒక లక్షణం ఉంది- మన దగ్గర వంద ఉన్నా పక్కవాడి నూటఒకటే నచ్చుతుంది " అంటూ కథ రాసింది సాయి ప్రియ.
రచన: జెముడుగాని సాయి ప్రియ, ఎనిమిది లిల్లి, అరవింద హైస్కూల్, కుంచనపల్లి, కృష్ణాజిల్లా.
పచ్చటి ఓ గ్రామంలో ఒక మూలన క్యాటీ అనే పిల్లి, ఇంకో మూలన డాగీ అనే కుక్క ఉండేవి.
ఆపదలో ఉన్న వారిని కాపాడే స్వభావం డాగీది. తన స్నేహితులందరికీ సాయం చేసేదది; వాళ్ల కోరికలు తీర్చేది. అయితే క్యాటీది మటుకు స్వార్థం; అందరినీ అనుమానించే తత్వం- ఇతరుల చేత పనులు చేయించుకునేది; కానీ అవసరానికి ఎవ్వరికీ సాయపడేది కాదు.
డాగీకి ఊళ్ళో తిరగటం అంటే చాలా ఇష్టం. దాని సంగతి తెలిసిన యజమాని దానికి ఒక స్కూటీ కొనిపెట్టాడు. ఆ స్కూటీనెక్కి, అది రోజులో అనేకసార్లు ఊళ్ళోకి వచ్చేది. యజమాని ఇంట్లో ఏ సామాను కావాలన్నా దానికో చీటీ రాసిచ్చి పంపేవాళ్ళు. అది ఎంచక్కా పనులు చేసుకొని తిరిగి ఇంటికి పోయేది.
డాగీని చూసీ చూసీ క్యాటీకి కూడా స్కూటీ అంటే మోజు పట్టుకున్నది. "అట్లా స్కూటీలో బుర్రు బుర్రున తిరిగితే ఎంత బాగుంటుంది! నాకూ ఓ స్కూటీ ఉంటే బాగుండును- డాగీకే ఎందుకు, ప్రత్యేకంగా?!" అనుకోవటం మొదలు పెట్టిందది.
ఒక రోజున క్యాటీ అటువైపుగా వెళ్లుతూంటే రోడ్డు ప్రక్కనే ఓ ఇంటి ముందు ఆగి ఉన్న స్కూటీ కనిపించింది. క్యాటీ దాని దగ్గరకెళ్ళి ఉత్సాహంగా అటూ ఇటూ చూసింది- డాగీ ఎక్కడా కనిపించలేదు. దాంతో దాని ఉత్సాహం మరింత ఎక్కువైంది. మెల్లగా స్కూటీ మీదికి ఎక్కి కొంచెం సేపు పడుకున్నది; లేచింది; సీటు మీద ఎగిరింది; దూకింది; గంతులు వేసింది- అయినా ఇంకా డాగీ రాలేదు.
అప్పుడు చూస్తే స్కూటీకి తాళంచెవులు తగిలించే ఉన్నాయి! క్యాటీ ఉత్సాహం ఉరకలు వేసింది. ఒకవైపున "నాకు కాళ్లు అందవేమో.." అని అనుమాన పడింది. "అయినా ఏం కాదులే, దీనిలో ఏమున్నది? డాగీ చేయగలిగే పనిని నేను మాత్రం ఎందుకు చేయలేను?" అనుకొని, స్కూటీ ఇంజను స్టార్టు చేసి, స్టాండు తీసి, ముందుకు నడిపింది! కొంచెం దూరం వెళ్ళిందో, లేదో- ఢమాలున పడింది- దాని మీదికొచ్చి పడింది స్కూటీ!
ఆ శబ్దం విని, ఎక్కడినుండో పరుగున వచ్చింది డాగీ. పాపం, క్యాటీని ఆ స్కూటీ మీదే ఎక్కించుకొని నేరుగా ఆస్పత్రికి పరుగు పెట్టించింది!
మనవి కాని వస్తువులమీద మోజెందుకు, చెప్పండి?!
"మార్జాల కష్టాలా, మజాకా?!” అంటున్నాడు సాయినాథ...
రచన: చాగంటి శివ సాయినాథ్ రెడ్డి, అరవింద హైస్కూల్.
స్కూటీ మీద కూర్చున్న పిల్లి చెబుతున్నది-
అబ్బా! ఏంటండీ, మంచి నిద్ర చెడగొట్టారు? ఏంటీ, ఫోటోలు తీసుకుంటున్నారు? మరీ అంత అందంగా ఉన్నానా? సర్లే, ఈ ఫోజుతో ఒక ఫోటో తీసుకోండి పర్లేదు. నేను ఏమీ అనుకోనులెండి.
ఏంటీ, నేను ఇక్కడ ఎందుకు పడుకున్నాను అనేగా, మీ సందేహం? ఏం లేదండి- ఈ మధ్య మా ఇంట్లో నాకు ప్రశాంతత లేనే లేదు! ఏం చెప్పమంటారండీ, కనబడితే చాలు- "ఇట్లానా ఉండేది, నా బిడ్డ అంటే ఎంత అందంగా ఉండాలి?! ఇట్లా అయితే ఇంక నీకు సంబంధాలు దొరికినట్లే" అని మేకప్ కొడతారు, మా అమ్మగారు.
"ఒక్క ఎలుకనూ చంపకుండా ఖాళీగా ఉన్నావు, కనీసం ఇప్పుడైనా 'పిల్లి ఇన్సిట్యూట్ ఆఫ్ హంటింగ్‌లో' చేరచ్చు కదా. కనీసం ఒక డిగ్రీ అన్నా ఉంటే, వచ్చేవాళ్ళకూ మర్యాద!" అని గోల చేస్తున్నారు నాన్నగారు.
అందులో చేరి హంటింగ్ నేర్చుకొని తర్వాత ఇంకేదో ఉద్యోగం వెలగబెట్టాలట! అక్కడేమో పూర్తిగా మాంసాహార భోజనం పెడతారు- అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎలుకల్ని వేటాడుకొని తినాలి! మరి నేనేమో పూర్తిగా శాకాహారిని- అంటే కేవలం పాలు, మీగడల మీద బతికేదాన్ని: ఏం చేయమంటారు, డబ్బుకోసం ఇష్టంలేని పని చేయడం నా మనస్సుకు నచ్చదు!
మా తమ్ముళ్ల గురించి అడుగుతున్నారా, ఏం చెప్పను? నేను తెచ్చిన పాలే త్రాగి, నా మీది దూకి ఆడుకుంటారు వాళ్ళు. ఇంక నా చెల్లెలేమో తనకు ఒక మంచి పిల్లిగాడిని తీసుకొచ్చి పెళ్లి చేయమని గొడవ. "ముళ్లులేని చేపలకూర తెచ్చిపెట్టురా, నాకు? చెబితే వినవేమి?" అని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటుంది మా బామ్మ- ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోననుకోండి, అయినా అది పెద్ద నస గదా, ఇంత పెద్దయ్యి కూడా ఆమాత్రం గమనించుకోలేకపోతే ఎట్లాగ, ఈ పెద్దవాళ్ళు?
ఇక మా స్నేహితులెవ్వరూ మా ఇంటికి రారు- వస్తే మా ఇంట్లోవాళ్ళు వాళ్ళని ఊరికే వదలరు- పీల్చి పిప్పి చేస్తారు. అందుకని వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా తప్పించుకొని తిరుగుతారు.
అందుకే, ఇక్కడికి వస్తే "కనీసం మా స్నేహితులనన్నా కలుసుకోవచ్చు, కొంచెం ఫ్రీగా" అని ఇక్కడికొచ్చా. "ఎవరో ఇక్కడ స్కూటీ నిలబెట్టారు కదా, కనీసం నా గురించి ఆమాత్రం అన్నా ఆలోచించారు" అని ఇప్పుడే దీనిమీదికి ఎక్కి కూర్చొన్నా- ఏదో ఆలోచిస్తుండగానే కొంచెం కునుకు పట్టినట్లుంది- అంతే తప్ప నేనేమీ సొంత ఇల్లు లేని బికారిగాడిననుకోకండి..
ఏంటి, ఈ స్కూటీ మీదేనా, మీకు కావాలా? మా వాళ్ళు రాగానే ఈ స్కూటీని ఖాళీ చేస్తాను- కొంచెం ఓపిక పట్టండి, ఏంకాదు ఊరుకోండి. ఏంటి ఈ తొందర? మర్యాద..! అదే కదా, నేను చెబుతున్నది- మరీ అంత అమర్యాదగా తరుముతారేమి?!
"ఆశకు పోతే అత్యాస మిగిలె ”నట... బలే పేరు పెట్టాడేం, దినేష్ ?!
రచన: చాగంటి దినేష్ రెడ్డి, ఏడవ తరగతి, లిల్లీ, అరవింద హైస్కూల్
చాలు! చాలు! ఆపు ఇంక. అసలే సినిమాలన్నా, వాటిలో పనిచేయడం అన్నా దానికి చచ్చేటంత ఇష్టం! ఇప్పుడు నువ్వు ఫోటోలు తీస్తున్నట్లు తెలిసిందంటే చాలు- అది ఇంక లేచి ఫోజుల మీద ఫోజులు ఇస్తూనే ఉంటుంది. దాని వల్ల నీ 'మెమోరి పుల్' అవటమే తప్ప, ఇంకేమీ ఉండదు. నిన్ను, నీ కెమెరాని చూస్తే దాని ఊహలు ఆకాశాన్ని అంటుతాయి. అది ఇక్కడ ఎందుకు పడుకుందో తెలుసుకోవాలనే కదా, నువ్వు ఇక్కడికి వచ్చింది?! నాకు తెలుసు! అయితే వినూ.. వినూ!
అనగనగా కుంచనపల్లి అనే ఊరు. ఆ ఊరిలో ఒక మూలగా ఉందొక చిన్న గూడెం. అందులో పుట్టిందీ పిల్లి. గూడెంలో ఎన్నో పిల్లులు పుట్టాయి, బ్రతుకుతున్నాయి; కానీ వేటికీ దీనికున్నన్ని తెలివితేటలు లేవు.
"ఏమా తెలివి" అంటున్నావు కదూ? ఆగు- ఓపిక ఉండాలి నీకు!
గోదావరి అని ఓ సినిమా చూసిందది. ఊళ్ళో పిల్లులన్నీ చూశాయిలే. అయితే వాటికి వేటికీ సినిమా అసలు అర్థమే కాలేదు. దీనికి మటుకు ఆ సినిమా ఎందుకు నడిచిందో బాగా అర్థమైంది. ఆ సినిమాలో కుక్క ఒకటి ఉంది. 'సినిమావాడు ఎవరిమీద ఎన్ని డబ్బులు కుమ్మరించినా, సినిమా నడిచింది మాత్రం ఆ కుక్క నటన వల్లే'- ఎవ్వరికీ అర్థం కాని ఈ రహస్యం దీనికి అర్థమైపోయింది. మరేమనుకున్నావు దీని తెలివితేటలు?!
దాంతో దీనికి ఓ కోరిక పట్టుకున్నది- కనీసం ఒక్క పిల్లి సినిమాలోనైనా తను నటించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలూ తనను, తన నటనను ఆదరిస్తారని దాని దానికి గట్టి నమ్మకం. "నేను ఒక్క సినిమాలో నటిస్తే చాలు- నాతోబాటు ఆ సినిమా కూడా పాపులర్ అవుతుంది" అని అది ఎంతమందికో చెప్పింది.
అయినా పల్లె వాళ్లంతా మొరటోళ్ళు. దాన్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? దాని తెలివితేటలకు ఇక్కడ గుర్తింపు ఎందుకుంటుంది? దాని నటనను ఇక్కడెవరు ఆదరిస్తారు?
అందుకనే తన నటనతో సినిమా రంగాన్ని ఉర్రూతలూగించటం నటించడం కోసం అది పల్లె నుంచి పట్నం బయలుదేరిపోయింది.
నేనైతే దాని ఫొటోని సినిమా పత్రికల్లో చూస్తాననుకున్నాను- మరి ఇదేంటో, మీ పత్రికలో కనిపించిందది!
"ఇదేంటి?" అని అడిగితే చెప్పిందది-
మీ నగరాల కాలుష్యాన్ని, రణగొణ ధ్వనిని అది అస్సలు తట్టుకోలేకపోయిందట. మీ దగ్గర రైల్వే స్టేషన్లో ఒకచోట జనం గుంపుగా ఉండటం చూసి వెళ్లిందట. చూస్తే అక్కడో సినిమా షూటింగ్ జరుగుతూన్నదట! అక్కడ అసలు నీళ్ళే లేవు కదా, అయినా హీరో ఎవరో తెచ్చి ఇచ్చిన చేపల్ని ఒక టబ్బులోంచి పట్టి, వాటిని ఒక్కటొక్కటిగా పైకి లేపి, ఇంకో బక్కెట్లో వేస్తున్నాడట.
"ఇంకోసారి- మళ్ళీ చేపలు తేండి-" అని అరిచారట, ఎవ్వరో. చూస్తే బక్కెట్టు అంతా ఖాళీగా ఉన్నదట! ఎందుకంటే మరి, ఈ పిల్లి బక్కెట్లోకి దూకి వాటిని ఆరగిస్తూ ఉందట!
"కిలో చేపలు ఎంతనుకున్నావు? డబ్బులు ఊరికే వస్తున్నాయా?" అని దాని మీదికి దూకాడట నిర్మాతగారు. పిల్లి తిరగబడి సినిమాలోలాగా గర్జించిందట. కానీ దాని నటనను అర్థం చేసుకోలేక, ఆ సినిమాలో గూండాలంతా అప్పుడు మన పిల్లి మీదికి వచ్చారట. దానిని కొట్టి కొట్టి తరమసాగారట!
అట్లా గూండాల బారి నుండి తప్పించుకొని వచ్చి, ఇక్కడ, ఇదిగో- చక్కని పొదరిల్లులాంటి కుటీరం ముందు, పచ్చని తోటలో విశ్రాంతి తీసుకుందామని ఆగిందట. బాగా అలసిపోయి ఉన్నది కదా, అందుకని అలా ఆ స్కూటీ మీదే విశ్రాంతి తీసుకుంటూ ఒక కునుకు తీసింది. అంతలోనే మీరు వచ్చి దాన్ని కెమెరాలో బంధించారు...
ఏంటీ.. నన్ను సినిమాల్లోకి రమ్మంటున్నారా,.. దాన్ని కాదా?! నేను స్క్రీన్‌ప్లేలు బాగా రాస్తానా? సరేలెండి. డబ్బులు బాగానే ఇస్తారా? అయితే సరే- రాక తప్పుతుందా?! వస్తాను వస్తాను. ఎప్పుడు బయలుదేరాలంటారు?