శేషాచలం అడవిలో మూడు చెట్లు ఉండేవి.

ఒకరోజున మొదటి చెట్టు అన్నది- "నన్ను కొట్టేశాక నాలో రాజు కూర్చోవాలని నా కోరిక" అని.

అప్పుడు రెండో చెట్టు అంది-"బంగారం, వెండి, మణి మాణిక్యాలు దాచుకోవడానికి నేను ఉపయోగపడాలని నా కోరిక" అని. అది విని మూడవ చెట్టు అన్నది-"నేను అన్ని చెట్లకన్నా ఎత్తుగా పెరగాలి; అందరూ నన్ను తలెత్తి చూడాలి; నాకో గుర్తింపు ఉండాలి" అని.

కొన్నాళ్లు అయ్యాక ఒక వడ్రంగి అటుగా వచ్చి చూసాడు. మూడు చెట్లనూ చాలా ఇష్టపడ్డాడు. పనివాళ్ళను పిల్చుకొచ్చాడు; మొదటి రెండు చెట్లనూ కొట్టించుకెళ్ళాడు. మూడవ చెట్టును ఏమీ చెయ్యలేదు.

వడ్రంగి తను తీసుకెళ్ళిన మొదటి చెట్టును ఉయ్యాల తొట్టిగా మలచాడు. "అయ్యో! నాలో రాజు కూర్చోవాలంటే ఇతను ఇలా చేశాడే" అని బాధపడింది చెట్టు. అయితే అతను ఆ ఉయ్యాల తొట్టి చేశాడో లేదో, దంపతులు ఒకరు వచ్చి దాన్ని ఇష్టంగా కొనుక్కెళ్ళారు. వాళ్లకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడిని వాళ్ళు చాలా మురిపెంగా పెంచుతున్నారు.

తల్లి వాడిని ఉయ్యాలలో వేసి ముచ్చటగా "ఉయ్యాల-జంపాల ఊగరావయ్య! ఎనలేని భోగాల తూగి మా ఇంట వెలసిన రాజు నీవయ్యా!" అని జోలపాటలు పాడింది.

అటుపైన ఆ చుట్టు ప్రక్కల ఎవరింట్లో పిల్లలు పుట్టినా 'ఈ ఉయ్యాల డిజైన్ బలే ఉంటుందమ్మా!" "ఇది బలే అచ్చొచ్చిన ఊయలమ్మా" అని దాన్ని ఇష్టంగా తీసుకెళ్ళేవాళ్లు. వాళ్ల పిల్లల్ని బారసాల రోజున ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టేవాళ్లు. "రాజువయ్యా, రాణివమ్మా" అని పాటలు పాడేవాళ్ళు.

అదంతా చూసి మొదటి చెట్టు తన కల నిజమైందని చాలా సంతోషించింది: "ప్రతి తల్లికీ తమ పిల్లలు రాజులే, మహారాణులే, చక్రవర్తులే. ఇట్లా ఎంతో మంది రాజుల్ని, రాణుల్ని, రారాజుల్నీ, చక్రవర్తుల్నీ ఊపిన ఘనత నాదే!" అనుకున్నది మొదటి చెట్టు. ఇక రెండవ చెట్టును కొట్టిన వడ్రంగి పుస్తకాలు పెట్టుకునే అలమారను ఒకదాన్ని తయారు చేశాడు దానితో. దానిమీద అద్భుతమైన దృశ్యాలు, డిజైన్లు చెక్కాడు.

దాన్ని ఎంత అందంగా మలచాడంటే, అతను దాన్ని పూర్తి చేశాడో-లేదో నగరంలోని ఒక లైబ్రరీ వాళ్ళొచ్చి దాన్ని ఎక్కువ ధరకు కొనేశారు.

ఆ లైబ్రరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిగారు విచ్చేశారు. ఆయన తన ఉపన్యాసంలో విద్య గురించి చెబుతూ"
న చోర హార్యం (దొంగలెత్తుకుపోనిది),
న చ భారకారి (బరువు లేనిది),
వ్యయే కృత వర్థత ఏవ నిత్యం (ప్రతి రోజూ ఖర్చు పెట్టినా వృద్ధి చెందేది),
విద్యా ధనం సర్వ ధన ప్రధానం" (అన్ని సంపదల కన్నా గొప్ప సంపద- విద్య !)
"అట్లాంటి విద్యను మనకు అందించేవి పుస్తకాలు. ఆ గ్రంథాలకు ఆధారం ఇదిగో, ఈ అలమార! విజ్ఞానం అనే నిధికి నెలవు ఇదిగో, ఈ గ్రంథాలయం" అని వివరించారు.

అది విని రెండవ చెట్టు సంతోషపడింది- ఇంత విలువైన ధనాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడ్డానే, నా జన్మ ధన్యం!" అనుకున్నది.

ఇట్లా కొన్ని యేళ్లు గడిచాయి. మూడవ చెట్టు ఎత్తుగా పెరిగింది. దానిని వడ్రంగి కొట్టనే లేదు.

"ఆ రెండు చెట్ల కోరికలూ తీరాయేమో! నా కోరికే, ఇంకా నెరవేరనిది!" అనుకునేదది. "నా గతి ఏమౌతుందో ఏమో! నా కోరిక నెరవేరుతుందో లేదో?" అని అనుమాన పడేది.

కొన్నాళ్లకు చాలామంది పనివాళ్ళు వచ్చారు. పెద్ద లారీని తీసుకొచ్చారు. దానికి అనేక చక్రాలున్న పొడవాటి ట్రాలీ. అందరూ కలిసి ఆ చెట్టును కొట్టి ట్రాలీలోకి ఎక్కించి జాగ్రత్తగా తీసుకెళ్లారు. "ఏం చేస్తారో, ఏమో" అని కంగారు పడింది మూడో చెట్టు.

వాళ్ళంతా కలిసి ఆ చెట్టును తిరుమలకు తీసుకెళ్ళారు. దానికి అభిషేకాలు జరిపి, చందనం రాసి, బంగారు తొడుగు తొడిగి, దేవుడి ముందు నిలబెట్టారు.

రోజూ లక్షలాదిమంది భక్తులు తలెత్తి చూసి ఆ ధ్వజ స్థంభానికి నమస్కరించసాగారు. ఆనందంతో పులకలెత్తింది మూడో చెట్టు. ఆలస్యమైతేనేమి, ఆ విధంగా ప్రతి చెట్టు కోరికా నెరవేరింది!