దేశాధినేతలు కొందరు చాలా వింతగా ఉండేవాళ్ళు.

ఒకప్పుడు ఫిలిప్పీన్స్ దేశానికి ఫెర్డినాండ్ మార్కోస్ అనే ఆయన అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన భార్య పేరు ఇమెల్డా.

ఆయనకంటే ఎక్కువ అధికారాన్ని చెలాయించేది ఆవిడ! ఆమెకు ఖరీదైన వస్తువులంటే మహా ఇష్టం ఉండేది. తనకు కావలసిన వస్తువుల్ని ప్రభుత్వ ఖర్చుతో కొనుక్కునేందుకు ఆమె వేరే దేశాలకు వెళ్ళేదట! అప్పుడు ఆమె విమానం వెంట మరో నాలుగు విమానాల పనివాళ్ళు వెళ్ళేవాళ్ళట! మార్కోస్ ప్రభువు అమెరికాకు సన్నిహితంగా ఉండేవాడు- దాంతో ప్రపంచ బ్యాంకుతో సహా అనేక దేశాలు ఫిలిప్పీన్స్‌కు లెక్కకు మిక్కిలిగా అప్పులిచ్చాయి. మార్కోస్, ఆయన కుటుంబం ఆ డబ్బులతో పండగ చేసుకున్నారు- ఏవేవో‌ కంపెనీలు, హోటళ్ళు, పెయింటింగులు, ఏవి చిక్కితే అవి కొనుక్కున్నారు. చివరికి జనాలు తిరగబడి విప్లవం తెచ్చారు. దాంతో ఆయన తన కుటుంబంతోటీ, ఆస్తులతోటీ కూడా పారిపోయి, అమెరికాలో తల దాచుకున్నాడు. పారిపోతున్న ఇమెల్డా తనకున్న మూడు వేల చెప్పుల జతల్ని, వందలాది పెయింటింగులనీ ఫిలిప్పీన్స్‌లో‌నే వదిలేసి పోతే కొత్త ప్రభుత్వం వాళ్ళు ఓ మ్యూజియం పెట్టి వాటిని ప్రదర్శించారు. మరి మార్కోస్ దంపతులు అమెరికాకు వెళ్ళాక 150 బిలియన్ డాలర్ల విలువైన భవనాలు కొన్నారట. ఓ 750 బిలియన్ డాలర్లను అక్కడి బ్యాంకులనుండి అప్పుగా తీసుకొని వాటికి రిపేర్లు చేయించారట!

ఒకప్పుడు జర్మనీ దేశాన్ని పరిపాలించాడు అడాల్ఫ్ హిట్లర్‌. అతనికి 'మేము ఆర్యులం' అని బలే నమ్మకం ఉండేది. వాళ్ల దేశంలోనే చాలా మంది యూదు జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు 'ఆర్యులు కారు' అని కూడా హిట్లర్ గట్టిగా నమ్మేవాడు. దాంతో సమయం చూసుకొని, సైనిక పరిపాలకుడిగా తనకుండే అధికారాలను ఎంచక్కా పెంచేసుకొని, పన్నెండేళ్ళపాటు రాజ్యంలో‌ దొరికిన యూదుడినల్లా గాలి చొరని భూగర్భ గృహాలలో బంధించేసి, 'రోజుకు ఇంతమంది' అన్నట్లుగా విష వాయువుల్ని పంపి చంపించాడు. ఇట్లా అతని చేత చంపబడ్డ యూదులు కనీసం అరవై లక్షల మంది ఉంటారని చెబుతారు! చివరికి హిట్లర్‌కు ఉన్న జాత్యహంకారం ముదిరి రెండో ప్రపంచ యుద్ధాన్నే తీసుకొచ్చింది!

ఇంకోవైపున, రష్యాను ఒకప్పుడు జార్ చక్రవర్తులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళు భోగలాలసులై జనాల్ని పట్టించుకోలేదు. దాంతో‌ ప్రజలు తిరగ బడ్డారు. ఆ రోజుల్లో 'అందరూ సమానం' అని చెప్పేవాడు, జోసెఫ్ స్టాలిన్‌ అనే ఆయన. ఆ స్టాలిన్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టారు తిరుగుబాటుదారులు. ఆ తర్వాత స్టాలిన్ తనకు అడ్డువచ్చిన వాళ్లనల్లా 'దేశద్రోహి' అని ఉరికంబాలెక్కించాడు. తనవాళ్లకు అధికారం కట్టబెట్టాడు. 'తాము చెప్పే మాటను అందరూ వినాలి' అని గట్టిగా భావించాడు. తనూ, తన మనుషులూ ఆడింది ఆట, పాడింది పాటగా ప్రవర్తించాడు. "రష్యా వెలిగిపోతున్నది - అమెరికాకు ఇది పోటీ" అని బయటి ప్రపంచానికి ఒక భ్రాంతి కలిగించాడు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరం అయిపోయేవరకూ ఆ అబద్ధాన్ని నిజం చేసేందుకే తన్నుకులాడింది రష్యా. రాను రాను 'రష్యాలో అందరూ సమానమే, కానీ కొందరు మటుకు ఎక్కువ సమానం' అని ఎగతాళికి గురైంది. చివరికి ఒక్కటిగా నిలబడలేక ముక్కలు ముక్కలైపోయింది!

ఆఫ్రికాలో ఉగాండా అని ఒక దేశం‌ ఉంది. దానికి ఒకప్పటి అధ్యక్షుడు, 'ఇది-అమీన్' అనే ఆయన. ఆయన 'నరమాంసం తినేవాడు'అని పుకార్లు. ఆయన చేతిలో హతమైనవాళ్ళ లెక్క ఇంకా తేలలేదు. మానవహక్కులకు అతను కట్టినట్టుగా మరెవ్వరూ గోరీ కట్టలేదని చెబుతారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారి లెక్కల ప్రకారం, అతని చేతిలో‌ కనీసం ఐదు లక్షల మంది మరణించి ఉంటారు! ఆ రోజుల్లో‌ ఓసారి ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలనుకున్నాడట అతను. దాంతో ఇంక అప్పటికి వాళ్ళ దేశంలో‌ నివసిస్తూ ఉన్న ఆసియా వాసులు ఓ 80,000 మందిని దేశం నుండి తరిమేశాడు. అట్లా తరిమేసాక, వాళ్ళ భూముల్ని, ఆస్తుల్ని, కంపెనీలను అన్నిటినీ‌ జప్తు చేసి, వాటిని తన మద్దతుదారులకు ఇచ్చుకున్నాడట అమీన్. వాళ్ళేమో ఆ ఆస్తుల్ని సరిగా నిర్వహించక, దివాలా తీయించి, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఛిన్నాభిన్నం‌ చేశారు.

ఇక మన పొరుగుదేశం పాకిస్తాన్‌- ప్రజాస్వామ్య దేశం- అయినా అక్కడి సైన్యం పరిపాలనలో ఎన్ని సార్లు నేరుగా జోక్యం కలగజేసుకున్నదో లెక్కలేదు. అనేకమార్లు ప్రజాస్వామ్యం నియంతృత్వం అయ్యింది; అనేక ఒత్తిళ్ళ నడుమన నియంతృత్వం‌ తిరిగి ప్రజాస్వామ్యం అయ్యింది. పాకిస్తాన్‌ను ఆనుకొని ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ నేతలు మతాన్ని ఆయుధాలతోటీ, కట్టుబాట్లతోటీ ఎంత విచక్షణా రహితంగా జోడిస్తున్నారో మలాలా యూసుఫ్‌జాయ్ రకరకాలుగా చెప్పింది. ఈ గొడవలకు నిజంగా అంతం ఉన్నట్లు తోచదు.

ప్రపంచంలో ఇన్నిన్ని గందరగోళాలు ఉండగా మనం మటుకు అరవైఎనిమిది ఏళ్ళ పాటు 'మతప్రసక్తి లేని- లౌకిక – ప్రజాస్వామ్య – గణతంత్ర రాజ్యం'గా నిలిచామనేది చూస్తే, ఒక రకంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. దీనికి కారణం సమున్నతమైన మన వారసత్వమేనేమో- మహాత్మా గాంధీలోని మానవత, బాబా అంబేద్కర్‌లోని రాజ్యాంగ పటిమ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తాత్వికత, జవహర్‌లాల్‌ నెహ్రూ విదేశాంగ విధానం, సర్దార్ పటేల్‌లోని ఉక్కు తత్వం, లాల్‌బహదుర్ శాస్త్రి గట్టితనం,.. ఇవన్నీ నిరంతర ప్రవాహాలుగా మన సంస్కృతికి ఎప్పటికప్పుడు జీవం పోస్తూ వచ్చాయి. వీరి వ్యక్తిత్వాలు మనందరికీ మార్గదర్శకాలుగా నిల్చాయి.

జులై 27న పరమపదించిన మన పదకొండవ రాష్ట్రపతి డా.ఎ.పి.జె అబ్దుల్ కలాం మన ఈ వారసత్వానికి జాజ్వల్యమానమైన మరొక ప్రతీక. శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, 'భారత క్షిపణి పితామహుడు' అనిపించుకొని, రాష్ట్రపతిగా మనదేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన అబ్దుల్ కలాం ఏలాంటి భేషజాలూ లేకుండా, చనిపోయేవరకూ అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు.

శాస్త్రీయతకు, మత సామరస్యానికి, నిరాడంబరతకు, త్యాగశీలతకు, సౌశీల్యతకు, నిబద్ధతకు, దేశ ప్రజల పట్ల ప్రేమాభిమానాలకు నిలువెత్తు నిదర్శనాలైన ఇలాంటి మహనీయులు పుట్టిన భూమిలో పుట్టటం నిజంగానే మన అదృష్టం. వారి ఆశయాలకు జీవం పోయటం మనందరి కర్తవ్యం.

              కొత్తపల్లి బృందం