అనగనగా ఒక అడవి. ఆ అడవి ప్రక్కన ఒక ఊరు. ఆ ఊళ్లో మూడు పంది పిల్లలు, వాళ్ళ అమ్మనాన్నలతో కలిసి హాయిగా బతుక్కుంటూ ఉండేవి.

కొన్నాళ్లకు అవి కాస్తా పెద్దవైనై. అప్పుడు ఇంక వాళ్ళ ఇల్లు ఐదుగురికీ సరిపోలేదు.

దాంతో వాళ్ళ అమ్మానాన్నలు అన్నాయి, "ఇదిగో పిల్లలూ, మనకు ఐదుగురికీ ఇంత చిన్న ఇల్లు చాలట్లేదు; అందుకని మీకు మీకు నచ్చినట్లు వేరేగా మంచి ఇల్లు కట్టుకొని బతుక్కోండి" అన్నాయి.

అప్పుడు ఆ మూడు పంది పిల్లలూ మంచి ప్రదేశం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవిలో లోపల్లోపలికి వెళ్ళాయి.

అక్కడ, ఓ రావిచెట్టుకి దగ్గర, మంచి చోటు ఒకటి కనిపించింది వాటికి.

"చోటు అయితే దొరికింది, కానీ ఇల్లు ఎలా కట్టుకోవాలిరా" అనుకున్నై అవి. అట్లా అనుకుంటుంటే, ఆ దారినే పోతున్న ఒంటె ఒకటి ఈ పందిపిల్లల్ని చూసి ఆగింది: "ఏంటమ్మా, సంగతి? ఏంటి ఆలోచిస్తున్నారు?" అని అడిగింది.

"మేం ఇక్కడ ఓ మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియట్లేదే!" అన్నాయి పందులు మూడూ.

"ఏమీ దిగులు పడకండి పిల్లలూ! నాకు ఓ ఇటుకల బట్టీ ఉంది. బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను. వాటితో చక్కటి ఇల్లు కట్టుకోండి!" అంది ఒంటె.

పందిపిల్లలు చాలా సంతోష పడినై. "మాకు దారి చూపించావు ఒంటే! నీకు ధన్యవాదాలు!" అని, బట్టీ దగ్గరికి వెళ్ళి ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకున్నాయి. అటుపైన మూడూ కలిసి బాగా శ్రమపడి, వాటితో మంచి ఇల్లు కట్టుకున్నాయి. చక్కటి ఇల్లు తయారైంది.

ఆ రోజు నుండీ మూడు పంది పిల్లలూ ఆ ఇంట్లో ఉండటం మొదలు పెట్టాయి. ఆ చుట్టుప్రక్కల అంతా శుభ్రం చేసుకున్నాయి; నీళ్ళు చల్లాయి; ఇంటి ముందు అంతా అలికాయి; ముగ్గులు పెట్టుకున్నాయి; ఎంత శుభ్రంగా ఉంచుకున్నాయంటే, భలే ఉంచుకున్నాయి.

వాళ్ళ ఈ కొత్త ఇంటిని చూసింది- ఒక తోడేలు. "ఎవరు, ఇక్కడ అడవిలో ఏదో ఇల్లు కట్టుకున్నట్లున్నారే?! ఎవరిది?" అనుకున్నది.

అనుకొని, మెల్లగా-జాగ్రత్తగా చెట్టు చాటున నిలబడి చూసింది. "ఓహో! చిట్టి చిట్టి పంది పిల్లలు! బలే ఉన్నాయి! తింటే బలే ఉంటుంది!" అనుకున్నది. ఆ ఆలోచన వచ్చేసరికి దానికి బలే నోరు ఊరింది.

ఒకరోజు ఉదయాన్నే అది పందులున్న ఇంటి దగ్గరకొచ్చి "ఏయ్, మురికి పందులూ, నన్ను లోపలకి రానివ్వండి!" అన్నది.

“నిన్ను మేము రానివ్వం! ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వం తల్లీ! రానిస్తే నువ్వు మమ్మల్ని తినేస్తావు- మాకు తెలుసు!" అన్నాయి పందులు.

“మీరు రానివ్వకపోతే మీ ఇంటిని ఊదేస్తాను, మీ ఇంటిని పగలగొట్టేస్తాను, మీ ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి కడుక్కోని తినేస్తాను!" అంది తోడేలు పళ్ళు బయట పెట్టి.

“వద్దు! వద్దు! మా ఇంటిని ఏమీ చెయ్యకు!" అని అరిచాయి పందులు, లోపలనుండి.

తోడేలు "హఫ్, హుఫ్, హఫ్, హుఫ్.." మని ఊదింది. ఇంటిని బాగా గీకింది. ఇటుకల్ని పట్టుకొని పీకేందుకు ప్రయత్నించింది. ఏం చేసినా ఇల్లు మాత్రం కదల్లేదు.

“అబ్బ! ఈ ఇల్లు గట్టిగా ఉందే!" అనుకున్నది తోడేలు. బయటికి ఏమన్నది? "సరేలెండి పిల్లలూ! ఇప్పడు చీకటి పడింది; కాబట్టి వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం సుత్తితో వస్తాను. మీ తలుపుని పగలగొట్టుకొని లోపలకి వస్తాను! చూస్తూండండి" అంటూ వెళ్ళిపోయింది.

“వద్దు! వద్దు! మా తలుపునేమీ చేయొద్దు!" అరిచాయి పందులు.

తెల్లవారింది. కానీ అసలు పంది పిల్లలకి ఆ రాత్రి నిద్ర పట్టనే లేదు! పొయ్యి రాళ్ళలాగా మూడూ మూడు మూలల్లో ఏడుస్తూ కూర్చున్నాయి. ఎంత ఏడ్చినా ఏం చెయ్యాలో మటుకు తెలీలేదు వాటికి.

తెల్లవారాక, మూడూ కలిసి ఇంటి ముందు పేడ అలుకుతుంటే, అటుగా పోతున్న నిప్పుకోడి ఒకటి అక్కడ ఆగింది. "ఏంటి, మీ ముఖాలు అలా ఉన్నాయి? రోజూ సంతోషంతో వెలిగిపోయేవి కదా! అట్లా వెలిగితేనే బాగుంటారు మీరు!" అన్నది.

"తోడేలు మా తలుపులు పగలగొట్టేస్తుందట ఇవాళ్ల!" అన్నాయి పంది పిల్లలు.

"అయ్యో!ఏడవకండి. ఈమాత్రం‌ దానికి ఏడుస్తారా, ఎవరైనా? నా దగ్గర పట్టుకుంటే షాక్ కొట్టే తాళాలు ఉన్నాయి. వాటిని తెచ్చి మీ ఇంటి చుట్టూ బిగించండి. ఆ తోడేలు కనబడగానే స్విచ్‌ వేసి పెట్టండి- అది ఒక్కసారి గొళ్ళాన్ని పట్టుకున్నదంటే చాలు- షాక్ కొట్టి అల్లంత దూరాన పడుతుంది. ఇంక జన్మలో మీ జోలికి రాదు!" అంది నిప్పుకోడి.

మూడు పందులూ నిప్పుకోడికి "ధాంక్సు" చెప్పాయి. వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి కరెంట్ తాళాలు తెచ్చాయి. ఇంటి చుట్టూ బిగించాయి.

సాయంత్రం అయ్యింది. తోడేలు వచ్చింది- పెద్ద సుత్తి ఒకటి పట్టుకొని వచ్చింది అది- “ఏయ్, మురికి పందులూ! కంపు కొట్టే పందులూ! నన్ను లోపలకి రానిస్తారా, లేదా?!" అంది.

“రానివ్వం! రానివ్వం! మేం నిన్ను రానివ్వం తల్లీ! ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వం! లోపలికి రానిస్తే మమ్మల్ని తినేస్తావని మాకు తెలుసు!" అన్నాయి పందులు.

“మీరు రానివ్వకపోతే మీ తాళాన్ని పీకేస్తాను; మీ తలుపులని పగలగొడతాను, లోపలికి వచ్చి మిమ్మల్ని పట్టి కడుక్కోని తినేస్తాను!" అంది తోడేలు పళ్ళు బయట పెట్టి.

“వద్దు! వద్దు! మా తలుపుల్ని ఏమీ చెయ్యకు!" అని అరిచి గబగబా స్విచ్‌ వేశాయి పందులు. స్విచ్‌ వేయగానే తాళాలన్నీ ఎర్రగా మండటం మొదలు పెట్టాయి.

అయినా తోడేలు ఆగలేదు. సుత్తి తీసుకుని తాళం మీద గట్టిగా ఒక్క దెబ్బ వేసింది. అంతే- ఒక్కసారిగా షాక్ కొట్టి ఎగ్గిరి అవతల పడింది.

“ఓహో! కరెంట్ తాళాలు వేశారా? సరేలే! రేపు వస్తాను! ఈసారి డ్రిల్లింగ్ మిషన్ తెస్తానులే, చూస్తూండండి- ఎట్లా తాళాలు పగలగొట్టి లోపలకి వస్తానో!" అంది కోపంగా, కోరలు బయటికి పెట్టి.

“వద్దు! వద్దు! మా తాళాల్ని ఏమీ చేయొద్దు!" అని అరిచాయి పందులు.

ఆరోజు రాత్రంతా ఆలోచించాయి పందులు. ఏం చెయ్యాలో తెలీనే లేదు.

చూస్తూండగానే తెల్లవారింది. వాటికి మళ్ళీ ఏడుపు వచ్చేసింది. ఇంటి వాకిట్లో కూర్చుని మూడుకు మూడూ గట్టిగా ఏడవటం మొదలు పెట్టాయి.

అప్పుడు ఆ దారిలో పోతున్న సీతాకోక చిలుకల గుంపు ఒకటి ఈ పందుల దగ్గర వాలింది. అవన్నీ ముక్కు మూసుకుని- "ఎందుకేడుస్తున్నారు?" అని అడిగాయి.

విషయం చెప్పగానే అవన్నీ నవ్వాయి. ముఖాలు ముఖాలు చూసుకున్నాయి.

"మేం చెప్పినట్లు చేయండి. ముందుగా అదిగో- ఆ ప్రక్కనున్న చెరువులో స్నానం చేసి రండి" అంది ఒక తెల్లని సీతాకోకచిలుక. మూడు పందులూ పోయి బాగా తోముకుని స్నానం చేసి వచ్చాయి.

"ఈ ఇంటిని ముందు రకరకాల పూల చెట్లతో అలంకరించండి!" అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. మూడు పందులూ గబగబా వెళ్ళి, రకరకాల రంగుల పూలచెట్లని తీసుకొచ్చి నాటాయి. అన్నిటికీ అప్పటికే పూలు పూసి ఉన్నాయి!

“మరి, ఇప్పుడు మీ ఇంటి పైకి ప్రాకేట్లుగా పూల తీగలని నాటండి" అన్నాయి పసుపురంగు సీతాకోకచిలుకలు. పందులు పూలతీగలను తెచ్చి ఇంటి పైకి ప్రాకించాయి.

చూస్తే ఇల్లు చా..లా అందంగా తయారయింది.

“అబ్బ! మీ ఇల్లు ఇప్పుడు ఎంత బాగుంది?!” అంటూ సీతాకోకచిలుకలన్నీ ఇంటి ముందు పుప్పొడితో రంగవల్లులు వేసినై.

"తోడేలు వచ్చినప్పుడు ఇట్లా చెయ్యండి- అని ఏవేవో చెప్పి, చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. పందులకి చాలా సంతోషం వేసింది. "మీరు బలే సలహాలు ఇచ్చారు! వామ్మో, మీ సలహాలు చాలా బాగున్నై!" అని
సీతాకోకచిలుకలకి వీడ్కోలు చెప్పాయి.

“ఆహా! ఇవాళ్ల మన ఇల్లు ఎంత బాగుంది?!” అనుకున్నాయి మళ్ళీ. ఆ రోజు మధ్యాహ్నానికే అవి మూడూ బాగా అలిసిపోయి, హాయిగా పడుకుని నిద్రపోయాయి.

సాయంత్రమైంది. డ్రిల్లింగ్ మిషన్‌ పట్టుకొని వచ్చింది తోడేలు.

రాగానే- "పందులుండే ఇల్లు ఇది కాదే, దారి తప్పానా, ఏంటి?" అనుకుందది. కళ్ళు నులుముకొని సరిగా చూసింది. "ఆహా, ఇదే! కానీ ఈ ఇల్లు ఎంత బాగుంది?!" అని దగ్గరికి వచ్చింది. "ఓ పందులూ, శుభ్రంగా ఉన్న పందులూ! మీ ఇల్లు ఎంత బాగుంది! ఎంత సువాసనగా ఉంది! నన్ను లోపలకి రానివ్వండి!" అని అడిగింది గౌరవంగా.

“రానిస్తాం, కానీ నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావ్, అసలు? మా దగ్గర బోలెడన్ని దుంపలున్నాయి; కుండల కుండల తేనె ఉంది. నీకు అవన్నీ ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే చాలా ఆటలు కూడా నేర్పుతాం కదా?!" అన్నాయవి.

తోడేలు కొంచెం ఆలోచించింది. “ఓ! అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను. మీరు పెట్టినవే తింటాను; మీరు నేర్పే ఆటలు నేర్చుకుంటాను. లోపలకి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు క్షమించండి" అన్నది.

"ఇప్పుడు మేం కూడా చాలా సంతోషంగా ఉన్నాం!" అంటూ పందులు తలుపు తీశాయి.
తోడేలు లోపలకి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందుల్నీ, వాటి ఇంటినీ చూసి చాలా ఆనందపడింది. అన్నీ చక్కగా చేతులు కడుక్కుని, దుంపలు తిన్నాయి; తేనెని తాగాయి; ఇంటి వెనక ఉన్న తోటలో అన్నీ కలసి సంతోషంగా ఆటలాడుకున్నాయి.
రావి చెట్టు మీద వాలి ఇదంతా చూస్తున్న సీతాకోకచిలుకలు కిలకిలా నవ్వాయి.