నిఖిల్ వాళ్ళ ఊరు సముద్ర తీరంలో ఉంది. మరొకవైపున దగ్గర్లోనే పెద్ద అడవి. సముద్రంలో చేపలు పట్టటానికి వచ్చే జాలరులు, వాళ్ళకు అవసరమైన చెక్క, వలలు, పడవలు తయారుచేసే సామానులు వగైరాలు అమ్మే వ్యాపారులు, చేపలు కొనుక్కునేందుకు వచ్చే వాళ్ళు, రవాణా వాహనాలు- ఎప్పుడూ వందలమంది రోడ్లమీద, కూడళ్ళలోను ఉండే ఊరది. నిఖిల్ బడికి వెళ్దామని బయలుదేరాడు ఒక రోజున. మామూలుగా ఎప్పుడూ నడిచే దారిలోనే నడుస్తూ పోతున్నాడు. ఊరంతా రోజూ మాదిరే హడావిడిగా ఉంది.
అకస్మాత్తుగా పెద్ద ఎత్తున హాహాకారాలు మొదలయ్యాయి. జనాలంతా ఎటుపడితే అటు పరుగు పెట్టటం మొదలు పెట్టారు.
దుకాణాలవాళ్ళు గబగబా షట్టర్లు మూసేయసాగారు. ఎవరో మధ్య వయసాయన ఒకడు పరుగు పెట్టలేక క్రింద పడిపోయి, వెంటనే గబుక్కున లేచి, వెనక్కి తిరిగి చూసి, పంచెను ఎత్తి పట్టుకొని వణుక్కుంటూ పరుగు తీశాడు. బడి ధ్యాసలో ఉన్న నిఖిల్‌కి ఇదేమీ అర్థం కాలేదు. కొంచెం సేపటికి ఊరికే వెనక్కి తిరిగి చూసి అతను కొయ్యబారిపోయాడు-
నిఖిల్ వెనకనే నిలబడి, అతన్ని పట్టుకునేందుకు చేతులు చాచి ఉన్నది- ఓ వింత మృగం! దానికి రెండు తలలున్నై! నాలుగు కళ్లు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు కొమ్ములు! దాని కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా మెరుస్తున్నాయి. డైనోసార్ల లాంటి బరువైన శరీరం. అది నడిచినంత మేర రోడ్డు గుంతలు పడిపోయింది. దాని తాకిడికే కాబోలు, వెనక రోడ్డు వారగా ఉన్న భవంతులన్నీ కుప్ప కూలిపోయి ఉన్నాయి. వాటిలో ఉండిన మనుషులు ఏమైనారో!
వింతమృగం నోరు తెరిచింది. దాని పళ్ళు గారపట్టినట్లు పచ్చగా. దాని నాలుక పొడవుగా ఉండి, చివర్లో చీలి ఉన్నది. తాడులాంటి ఆ నాలుక అటూ ఇటూ ఊగుతుంటే, ఊపిరి సలపనంత గబ్బు వాసన ఒకటి నిఖిల్‌ని కమ్ముకున్నది. వింతమృగం చేతులు నిఖిల్ చొక్కాకు తగిలాయి. మరుక్షణం నిఖిల్‌కి చలనం వచ్చింది. తన పుస్తకాల సంచీతో దాని చేతిని విసిరి కొట్టి పరుగు లంకించుకున్నాడతను. పుస్తకాల సంచీ బరువు దానికి ఒక లెక్క కాదు- కానీ విసురుగా వచ్చి పడ్డ సంచీ బరువుకి దాని చేతులు నిఖిల్‌ని వదిలేశాయి. అయితేనేమి, మరుక్షణంలో అది తేరుకొని వేగంగా నిఖిల్ మీదికి రాసాగింది.
నిఖిల్ వేసే ఐదడుగులూ దానికి ఒక్క అడుగుతో సమానం! త్వరలోనే అది మళ్ళీ నిఖిల్‌ను చేరుకోగలిగింది. ఈసారి వాడి వెంట పరుగెత్తుతూనే వాడి వైపుకు తన చేతులు చాచిందది. అయినా అదృష్టం నిఖిల్ పక్షాన ఉన్నట్లుంది. సరిగ్గా అదే క్షణంలో ఎడమవైపున ఉన్న సందులోకి మళ్ళాడు వాడు. "సన్నటి సందులోకి వస్తే ఈ జంతువు ఎక్కడో ఒకచోట ఇరుక్కుపోతుంది.." అనుకుంటూ. వింతమృగం వేగాన్ని పెంచుకుంటూ వాడి వెంట పడింది. అడ్డు వచ్చిన భవంతులను చేతులతో మట్టగిస్తూ పోయింది. ఊళ్ళో ఉన్న కరెంటు తీగలు అన్నీ దానికి చుట్టుకున్నాయి. వాటిలోంచి ఠపఠపా వెలువడిన మెరుపులు శబ్దాలు దాన్ని చికాకు పెట్టినట్లున్నాయి. అది మరింత రెచ్చిపోయింది. అంతలోనే కరెంటు తీగ ఒకటి దాని ముఖానికి తగులుకున్నది. బహుశ: దానికి ఇప్పుడు రెండు కళ్ళు పని చేయట్లేదేమో- గుడ్డిదాని మాదిరి, ఊరిమీద పడిందది. ఊళ్ళో ఉన్న జనాలంతా గగ్గోలెత్తిపోయారు. అయినా అది నిఖిల్‌ని వదలలేదు. వాడు ఎటుపోతే అటే పోయిందది!
నిఖిల్ పరుగెత్తుతూనే ఆలోచించాడు- "ఇది వచ్చిన దిక్కును చూస్తే ఇదేదో అడవి జంతువు అనిపిస్తున్నది. దాని శరీర నిర్మాణం కూడా, నీటి ప్రాణి మాదిరి లేదు. ఏదైనా ఉపాయంతో దీన్ని సముద్రంలోకి తీసుకుపోతే..?" అని.
వెంటనే అతను ప్రక్కకు తిరిగి సముద్రం వైపుకు పరుగు పెట్టాడు. వింతమృగం ఏమాత్రం ఆలోచించలేదు. తనకు అడ్డు వచ్చిన చెట్లనీ, స్తంభాలనీ, భవంతులనీ మొద్దుల్లాంటి తన చేతులతోటీ, కాళ్ళతోటీ చరుచుకుంటూ, తన్నుకుంటూ నిఖిల్ వెంట పడి పోయిందది. సముద్ర తీరం చేరుకున్న నిఖిల్‌కి అప్పుడే సముద్రంలోకి బయలు దేరుతున్న పడవ ఒకటి కనబడింది. "ఏయ్! ఆగండి! ఆగండి!" అని ఒక్క పరుగున పోయి ఆ పడవలోకి దూకాడతను. పడవలో ఒక జాలరివాడు మాత్రం ఉన్నాడు. నిఖిల్ వెనకనే ఇసుకలో పరుగు పెట్టుకుంటూ, గస పోసుకుంటూ వస్తున్న వింతమృగాన్ని చూసి అతను నిశ్చేష్టుడైపోయాడు.
"పద- పద- వేగంగా పోవాలి" అని నిఖిల్ అతని చేతిలో ఉన్న తెడ్డునొకదాన్ని లాక్కొని తనూ తెడ్డు వేయసాగాడు. పడవ వేగంగా ముందుకు పోయింది. నీళ్ళ అంచుకు రాగానే వింతమృగం ఒక్కసారిగా ఆగిపోయి ఓ వింత అరుపు అరిచింది. నిజంగానే దాని కళ్ళు రెండు- కాదు కాదు- నాలుగు కళ్ళూ- పనిచేయట్లేదిప్పుడు! ఆ కళ్ళలో ఏవో ఊచలు గుచ్చుకుపోయి ఉన్నాయి.
అయినా దాని ముక్కు పనిచేస్తూనే ఉంది- నిఖిల్ వాసన దానికి తెలుస్తూనే ఉన్నది! అలల శబ్దం దాని చెవులకు వినబడుతూనే ఉన్నది! ఒక్క నిముషంపాటు అటూ ఇటూ తిరిగిన వింత మృగం ఇంక ఎక్కువ ఆలస్యం చేయకుండానే సముద్రపు నీళ్ళను నెట్టుకుంటూ ముందుకు నడిచింది!
పడవలో కూర్చున్న నిఖిల్‌కి మతిపోయినట్లు అయ్యింది. "ఇది ఉభయ చరమా, నీళ్ళలోనూ, నేలమీద కూడానూ బ్రతుకుతుందా, కప్పలాగా..?" అతని ఆలోచనలు కనిపెట్టినట్లు పడవలో ఉన్న జాలరి అన్నాడు- "లేదులే, ఇది నీళ్లలో బ్రతికే జీవి కాదు- అడవిలోంచి వచ్చిన ప్రాణి. దీన్ని లోతైన సముద్రంలోకి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తే దాని పని అవుతుంది" అని.
పడవ సముద్రంలో ముందుకు పోయింది. దాని వెనకనే సముద్రంలో పడుతూ లేస్తూ పోయింది వింత మృగం. వేగంగా ఎగిసి పడుతున్న అలలతో పడవ ముందుకు పోతున్నట్లే పోతున్నది, మళ్ళీ వెనక్కి పడుతున్నది. చూస్తూ చూస్తూండగానే వింతమృగం బాగా దగ్గరికి వచ్చింది. "ఇప్పుడెలా?" అనుకున్నాడు నిఖిల్. సరిగ్గా ఆ సమయాని పెద్ద కెరటం ఒకటి వచ్చి పడవను పూర్తిగా పైకి లేపింది. "దూకు! పారిపో!" అని జాలరి వాడు పడవమీదినుండి ఒక్క ఉదుటున సముద్రంలోకి దూకేశాడు. 'అలా చేయాలా, వద్దా' అని ఒక్క క్షణకాలం పాటు ఆలోచించాడు నిఖిల్. అంతలోనే వెనక ఉన్న వింతమృగం పెద్దగా గర్జిస్తూ ఒక్క ఎగురు ఎగిరింది. ఇంక ఆలోచించుకునేందుకు ఏమున్నది? అది పడవలోకి వచ్చి పడే లోగా నిఖిల్ పడవనుండి నేరుగా సముద్రంలోకి దూకేశాడు. వాడి వెనకనే ఉవ్వెత్తున లేచిన ఓ కెరటం వాడిని ఎత్తుకెళ్ళి సముద్రంలోనే మరో వైపున పడేసింది.
ఆ మృగం తన వెనకే వస్తూందని భయపడ్డాడు నిఖిల్. అయితే వాడు వెనక్కి తిరిగి చూసే సరికి పడవ సముద్రంలో ఇంకా లోపలికి కొట్టుకు పోయి ఉన్నది!
వింతమృగం పడవలో తన్నుకులాడుతున్నది! పడవకు రంధ్రం పడినట్లున్నది- చూస్తూ చూస్తూండగానే వింతమృగంతో సహా పడవ సముద్రంలో మునిగిపోయింది!
కొంతసేపు దానివంకే చూసిన నిఖిల్ మెల్లగా ఒడ్డుకు ఈదుకొచ్చాడు. సముద్రతీరంలో గుమిగూడిన ఊరి ప్రజలు వింతమృగం సముద్రంలో మునిగిపోవటాన్ని కళ్ళారా చూశారు. నిఖిల్‌ను మెచ్చుకొని చప్పట్లు కొట్టారు. వాడిని మెడమీద ఎక్కించుకొని డప్పులు కొడుతూ ఊరంతా మెరిమిని తిప్పి జాతరలాగా చేశారు.
ఆ మరుసటిరోజు పేపర్లో ఫోటో కూడా వచ్చింది- 'సాహస వీరుడు నిఖిల్' అని!