"తాతా! మీ కొడుక్కు నువ్వైనా చెప్పచ్చుగా! ప్రతి శుక్రవారం రాత్రి ఇక్కడికీ, ప్రతి ఆదివారం రాత్రి ఆ ఫైవ్ స్టార్ హోటలుకూ,

ఇట్లా అందరినీ ఈ మూడు వారాలుగా ఎందుకు తిప్పుతున్నాడు నాన్న? అసలిదంతా ఎందుకు?" తాత దగ్గరకొచ్చి గుసగుసగా అడిగాడు అవినాష్.

"ఒరే నా కొడుక్కొడుకా ! ఆ అడిగేదేదో నా కొడుకునే అడగరాదురా?! నన్నడిగితే నేనేం చెప్తానూ?" అన్నాడు తాతయ్య, ఉత్సాహంగా.

"అమ్మో మానాన్ననే! భయం బాబూ!"

"ఏరా ఎందుకూ భయం? మీ నాయనేమన్నా దయ్యమా, భూతమా?"

"ఐనా ఆయనెందుకు తాతా? నువ్వున్నావుగా, చెప్పేందుకు? నువ్వే చెప్దూ!" ప్రాథేయపడ్డాడు అవినాష్.

"సరే, అయితే నువ్వు ఇంకో పదివారాలు ఆగు- నీకే తెలుస్తుంది, అప్పటికీ తెలీకపోతే నేను చెప్తాను- సరేనా?!” అంటూ, చల్లని పూరి గుడిసెలో, పేడ అలికిన నేలమీద పరచిన తాటాకుల చాప మీద- అటుకేసి తిరిగి పడుకున్నాడు తాత....

పది వారాలు గడిచాయి-

"ఒరే!ఎక్కడున్నావురా, అవినాష్?!" మనవడికోసం పల్లెలోని వీధులన్నీ తిరిగి తిరిగి చివరికి ఊరి నడిబొడ్డుకు వచ్చాడు తాత. అక్కడ పంచాయితీ ఆఫీసు ముందు ఉన్నది ఓ వేపచెట్టు. దాని క్రింద, అరుగు దగ్గర చిల్లాంకట్టె (కోడుంబిళ్ల-గిల్లీడండా) ఆడుతున్న మనవడిని చూసి "ఏరా, ఒరే నా కొడుక్కొడుకా! మనం వెళ్ళే సమయమైంది. నా కొడుకు నీకోసం కార్లో కాచుకొని కూర్చున్నాడు, రా నాయనా!" అన్నాడు.

"తాతా! ఇంకో గంట ఆగి వెళితేనేం? అసలు ఏముందక్కడ?! ఆ ఏసీకి ఒళ్ళంతా ఎండుతుంటుంది; ఇంక ఆ హోటల్లో ఎప్పుడో వండిన కూరలు వేడి చేసి, రుచీ పచీ లేకుండా పెడతారు. తాతా! నువ్వు చెప్పవూ, నాన్న నేను చెబితే వినడు?!"

"ఏరా! నేనేమన్నా నీకూ మీ నాయనకూ మధ్య పోస్టు నడిపే బంట్రోతును అనుకున్నావేరా? నాకు తెలీదు- పోయి నువ్వే అడుగు. ఐనా చక్కగా క్రికెట్ ఆడేవాడికి ఈ గలీజు కోడుంబిళ్ళ ఏంట్రా?"

"అబ్బ, తాతా! నీకేం తెల్సు, ఈ కోడుంబిళ్ల మజా? అయినా వాళ్ల తోటలో పండిన జామపండ్లు, తేగలు తెస్తానని వెళ్ళాడు వీరయ్య. వాడు తిరిగి వచ్చే వరకూ నన్ను రమ్మనకు ప్లీజ్.. " అంటూనే ఆటని ఆపి, అరుగు ఎక్కి చూడసాగాడు అవినాష్. అంతలోనే వీరయ్య గస పెట్టుకుంటూ పరుగెత్తుకొచ్చాడు. ఓ చిక్కంలో అరమాగిన జామ పండ్లూ, తేగల కట్టా తెచ్చి అవినాష్ చేతికి ఇచ్చాడు. వాడు అవి తీసుకుని, వీరయ్యను గుండెలకు హత్తుకుని "థాంక్స్ రా! మళ్ళా శుక్రవారం వస్తా, నీకు మిఠాయి ఉండలు తెస్తాన్లే!" అంటూ అవన్నీ తీసుకుని కదిలాడు.

"ఒరే మనవడా! అదేంట్రా, ఆ 'ఛీ..పాడు!' తేగలు తీసుకుని, ఆ మొరటు వీరడిని- చెమట వీరడిని- అలా హత్తుకున్నావ్?! వాడెక్కడ, నువ్వెక్కడరా?" అడిగేశాడు తాత, వెటకరిస్తున్నట్లు.

తాతకేసి కోపంగా చూస్తూ "అను, తాతా, అను! ఇదివరకు నేను అన్న మాటల్నే ఇప్పుడు మళ్ళీ నాకు తిరిగి రామ బాణంలా కొడుతున్నావ్ కదూ?! ఈ వీరయ్య ఎంత మంచివాడో తెలుసా, నీకు? నాకోసమనే ప్రత్యేకంగా వాళ్ళ తోటలోకి వెళ్ళి, నాకు ఇష్టమైన జామకాయలు, తేగలూ తెచ్చి ఇస్తున్నాడు చూడు! ఇట్లాంటి స్నేహితులు పట్నంలోఎక్కడ దొరుకుతారు తాతా?! ఇంత చల్లటి గాలి,ఇల్లు, కల్మషం లేకుండా మాట్లాడే మిత్రులు, కమ్మని గుమ్మ పాలు, ఇంత చక్కగా మ్రోగే మువ్వల గంటలు- ఇక్కడి లేగ దూడలతో పరుగు పందెం వేసుకొని చూడు, అవే గెలుస్తాయ్- అసలు ఈ పల్లెకూ మన పట్టణానికీ అసలు పోలికే లేదు" అన్నాడు అవినాష్.

"అవునా, నాయనా?! మరి పదినెల్ల క్రితం నువ్వే దీన్ని 'ఛీ..పాడు పల్లె' అన్నావే?!" అడిగాడు తాత, సూటిగా.

"అయాం సో సారీ తాతా, అట్లా అన్నందుకు! ఈ ప్రశాంతతలో ఉండే సుఖం అప్పుడు నాకు అసలు తెలీనే లేదు" అని విచారంగా ముఖం పెట్టాడు ఎనిమిదోక్లాసు ఇంగ్లీష్ మీడియం మనవడు అవినాష్.

ఇద్దరూ కారులోకి వచ్చి కూర్చునే సరికి అవినాష్ చెల్లెలు మాధురి అంటున్నది "నాన్నా! మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నాన్నా, హోటలుకు వద్దు! అసలైతే ఇవాళ్ళ రాత్రికి ఇక్కడే ఉండి, రేపు నేరుగా ఇంటికి వెళ్దాం" అని. మాధురి చేతులు గోరింటాకుతో ఎర్రగా పండి ఉన్నాయి.

తాతయ్య చెప్పాడు: "పిల్లలూ! మేం చిన్నప్పుడు పిట్టల మేలుకొలుపులతో లేచి, వేప పుల్లతో పళ్ళు తోమి, గుమ్మపాలు త్రాగి, బడికెళ్ళి చక్కగా చదువుకున్నాం. మీరేమో పట్టణపు పిల్లలాయె! మరి మీకు ఆ రోజుల్ని పరిచయం‌ చెయ్యాలి కదా, పల్లె జీవితపు మధురిమని మీకూ అందించాలి కదా? అందుకనే ప్రతి శుక్రవారం మనందర్నీ ఇక్కడికి తీసుకొస్తున్నాడ్రా, మీ నాన్న! మరి నగరాల్లో జనాలు తినే తిండి ఎంత ఘోరంగా ఉంటోందో మీకు కూడా తెలియాలనేరా, ప్రతి ఆదివారం రాత్రీ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి డిన్నర్ పెట్టిస్తున్నది! కాలుష్యంతో నిండిన నగర వాతావరణానికీ, ప్రశాంతంగా ఉండే పల్లె వాతావరణానికీ ఎంత తేడా ఉందో చూశారా?!" నవ్వాడు తాత, వాళ్ళ తలలు నిమురుతూ.

తాత చేతులు పట్టుకొని "నిజంగానే బాగా తెలిసిపోయింది తాతా! ఫైవ్ స్టార్ హోటలు వాళ్ళు ఐదు రోజుల పాత వాటిని, త్రీస్టార్ హోటలు వాళ్ళు మూడు రోజుల పాత వాటిని మళ్ళీ వేడి చేసి తేగలరు! అంత సాంకేతికత ఉంటుంది వాళ్ల దగ్గర. అయినా మాకిప్పుడు ఆ తిండి అంటే మొహం మొత్తింది. పల్లెలో దొరికే తేగలు, కొబ్బరి నీళ్ళు, తాటిముంజెలు, గడ్డపెరుగు- వీటి రుచి మరి దేనికీ రావు! ఇక్కడి స్నేహాల్లో మంచితనం ఉంది. మన పల్లెలు బలే ఉంటాయి.." మెరిసే కళ్లతో చెప్తున్న పిల్లలిద్దరినీ మురిపెంగా చూశారు తాత, అమ్మ, నాన్న!