వరదాపురంలో ఉండే రాంబాబు చాలా మంచివాడు- ఏమంటే మహా భయస్తుడు. వాడికి వాళ్ల నాన్నంటే కూడా భయమే. ఏది కావాలన్నా అమ్మనే అడిగేవాడు.

వరదాపురం చాలా చిన్నది. ఊళ్లో ప్రాథమిక పాఠశాల ఉండేది; ఐదో తరగతి అవ్వగానే పై చదువుల కోసం పిల్లలందరూ దగ్గరలో ఉన్న చంద్రగిరికి వెళ్ళాల్సి వచ్చేది. ఆ ఊరికి కూడా బస్సు సదుపాయం లేదు. పిల్లలంతా ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లాలి; నడుచుకుంటూ రావాలి! అట్లా రోజూ నడచి వచ్చి, అలసిపోయి, అన్నం కూడా తినకుండా పడుకునేవాడు వాడు. ఇంక 'హోంవర్కు' ఎక్కడ, చదువు ఎక్కడ? రాను రాను వాడు చదువులో కూడా వెనకబడటం మొదలైంది. ప్రతిరోజూ బళ్లో టీచర్లతో తిట్లు తినసాగాడు.

అయితే నిజానికి రాంబాబు చాలా తెలివైనవాడే! "నేను ఎందుకు, మిగిలిన పిల్లల్లాగా చదవలేకపోతున్నాను?' అని ఆలోచించాడు. వాడికి అర్థం కూడా అయ్యింది: "నేను ఎక్కువ నిద్రపోతున్నాను; అందుకనే సరిగ్గా చదువుకోలేకపోతున్నాను" అని.

అయితే అట్లా ఎక్కువ నిద్రకు కారణం అలసటేనని వాడు అనుకోలేదు- అంతా తన బద్ధకం వల్లనే అనుకున్నాడు. అందుకని బద్ధకాన్ని వదిలించుకునేందుకు వాడు గట్టి సంకల్పం చేసుకున్నాడు. "రాత్రి పన్నెండు వరకూ చదవుతాను రోజూ" అనుకున్నాడు. "ఎట్లాగైనా సరే నేను నిద్రపోకుండా ఉండాలి అంతవరకూ" అనుకున్నాడు. అయితే మొదటి రోజున ఎనిమిది గంటలకల్లా అవలింతలు మొదలయ్యాయి. తొమ్మిది అయ్యాక ఇంక ఎంత ప్రయత్నించినా మేలుకొని ఉండలేకపోయాడు.

రెండవరోజునా ఇలాగే జరిగింది. వాడికి ఇంక ఏం చేయాలో తోచలేదు. వెళ్లి వాళ్ల అమ్మని అడిగాడు: "నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా" అని.

"ఏమోరా, నాకు తెలీదు. ఒకవేళ మీ నాన్నకు తెలుసేమో, అడుగు!" అన్నది అమ్మ.

రాంబాబు ధైర్యం కూడగట్టుకొని నాన్న దగ్గరికి వెళ్ళాడు: "నిద్రపోకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి నాన్నా, అమ్మకు తెలీదట, నిన్ను అడగమన్నది" అనేశాడు.

వాళ్ల నాన్న కొంచెం సేపు వాడికేసే చూసి "ఇదేం ప్రశ్నరా? ఎవరైనా నిద్రపోకుండా ఉంటారా?" అన్నాడు.

ఊళ్ళో కనబడిన వాళ్ళనల్లా ఇదే అడుగుతూ పోయాడు రాంబాబు. నిద్ర రాకుండా ఉండే మార్గం మటుకు ఎవ్వరూ చెప్పలేక పోయారు. చివరికి వాళ్ళ టీచరుగారు కూడా "నీ ప్రశ్నకు సమాధానం ఇంక ఆ దేవుడే చెప్పాలిరా" అనేశాడు.

ఆ రోజు సాయంత్రం‌ ఇంటికి వచ్చేసరికి రాంబాబుకు ఒకవైపున నిద్ర వస్తూండింది; మరోవైపున మెలకువ ఉండింది. కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉన్నాడు; పడుకున్నవాడు పడుకున్నట్లే ఉన్నాడు. వాళ్ల అమ్మ,నాన్న ఏం చెప్పినా వాడికి అసలు వినబడనే లేదు. మనసులో అంతా అదే ఆరాటం: "దేవుడిని అడగాలి; నిద్ర లేకుండా వరం సంపాదించుకోవాలి" అని.

రోజులు గడిచే కొద్దీ రాంబాబు ఓ ఋషిలా మారిపోయాడు. ఇప్పుడు వాడి ధ్యాస అంతా దేవుడే. అనుక్షణం అతను దేవుడిని తలచుకుంటూనే ఉన్నాడు. "దేవుడా, రా! నా నిద్రను పోగొట్టు" అని. చివరికి ఇంక దేవుడు ఆగలేక పోయాడు. రాంబాబుకు ప్రత్యక్షమయ్యాడు. "నాయనా, రాంబాబూ! ఎందుకు బాబూ, నీకింత పట్టుదల?" అన్నాడు.

"స్వామీ! నేను నిద్ర పోవటం వల్ల చదవలేక పోతున్నాను. అలా చదువులో వెనకబడిపోతున్నాను. అందరిలోనూ నవ్వుల పాలౌతున్నాను. నాకు ఈ నిద్ర వద్దు. నాకు అసలు నిద్రే లేకుండా వరమివ్వు స్వామీ. ఇంకేమీ వద్దు" అనేశాడు రాంబాబు. దేవుడు నవ్వాడు-"రాంబాబూ! నువ్వు ఏం కోరుతున్నావో నీకు అర్థమౌతున్నదా?" అన్నాడు.

"లేదు స్వామీ! నేను బాగా ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను" అన్నాడు రాంబాబు.

దేవుడు నిట్టూర్చాడు. "సరే నాయనా! ఇక పైన నీకు నిద్ర ఉండదు గాక ఉండదు" వరం ఇచ్చేసి మాయమైపోయాడు దేవుడు. రాంబాబుకు బలే సంతోషం వేసింది. ఆరోజంతా బలే చదివాడు. రెండవరోజు కల్లా తన నోట్సులన్నీ పూర్తయినాయి. మూడో రోజున వాడికి కొద్ది కొద్దిగా తలనొప్పి మొదలయింది. ఆరోజు సాయంత్రం కల్లా వాడికి కడుపునొప్పి వచ్చింది. తల తిరిగినట్లు అయ్యింది. వాంతులు అవ్వసాగాయి. నీరసం అనిపించసాగింది. మనసు దేనిమీదా లగ్నం కాలేదు. పడుకుంటే, నిద్ర రాదు!

అటుపైన వాడు ఏం చేసినా, ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ఏమాత్రం లాభం లేకపోయింది. బరువు తగ్గుతూ పోయాడు. రోజు రోజుకూ వాడి ఎముకలు బయట పడ్డాయి. ఎంత నీరసించి పోయాడంటే, అడుగు తీసి అడుగు పెట్టటం గగనం అయిపోయింది. అట్లా ప్రాణం మీదికి వచ్చాక, వాడి గట్టితనం అంతా కరిగిపోయి, కళ్లలో నీళ్ళు వచ్చాయి.

ఆ సమయంలో మళ్ళీ కనిపించాడు దేవుడు- "ఏం రాంబాబూ? అర్థమైందా? అన్నీ ఆలోచించాకే నిర్ణయానికి వచ్చానన్నావే?" నవ్వుతూ అన్నాడు.

"స్వామీ! నిద్ర లేకపోతే బాగా చదవచ్చు కదా- అనుకున్నాను. కానీ ఇదేంటో స్వామీ ఇట్లా జరిగింది?!" అన్నాడు రాంబాబు. దేవుడు మళ్ళీ ఓసారి నవ్వి "రాంబాబూ! ఈ లోకంలో నిద్ర అనేది లేకపోతే ఎవ్వరూ బ్రతకలేరు. పని చేసి అలసిపోయిన మెదడుకు, ఇతర శరీర భాగాలకు కొంత విశ్రాంతి లభించేది నిద్రలోనే. నిద్ర మనిషికి బరువు కాదు; అది మనిషికి చాలా అవసరం! ఆహారం‌ ఎంత అవసరమో, నిద్రకూడా అంతే అవసరం! గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, రచయితలు అంతా నిద్రలేకపోవడం వల్ల గొప్పవాళ్లయ్యారు అనుకుంటున్నావా, కాదు! అంతా కష్టపడి గొప్పవాళ్లయ్యారు. వాళ్ళు చేసే పనిని ఇష్టంగా, మనసు పెట్టి చేయటం‌ వల్ల గొప్పవాళ్ళు అయ్యారు. నువ్వు బాగా చదవకపోవడానికి కారణం నిద్ర కాదు నాయనా, నువ్వు శ్రమించకపోవడం. నీ చదువుని నువ్వు ప్రేమించకపోవటం. దాని మీద శ్రద్ధ పెట్టకపోవటం. అర్థమయ్యిందా, ఇప్పట్నుంచి అయినా కష్టపడి చదువు. ఈ తపస్సులు, నన్ను పిలవటాలూ‌ పెట్టుకోకు!" మందలించి, మాయమైపోయాడు.

సరిగ్గా అదే సమయానికి రాంబాబు వాళ్ళమ్మ "ఒరే!‌రాంబాబూ! ఇంత మొద్దు నిద్ర పోతే ఎలారా? అసలే మార్కులు బాగా రాలేదన్నావు?!" అని వాడిని నిద్రలేపింది.

చూసుకుంటే వాడు బలంగానే ఉన్నాడు- ఏమీ చిక్కిపోలేదు! 'ఓహో ఇదంతా కలేనా, దేవుడేమీ రాలేదా?'అని రాంబాబు నవ్వితే వాళ్లమ్మ వాడికేసి వింతగా చూసింది.