మా ఇంట్లో చక్కని బొమ్మ ఒకటి ఉంది. ఆ అమ్మాయి బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం.
అది నాకు ఎవరిచ్చారో తెలుసా? మా అమ్మ.
ఎందుకిచ్చిందో తెలుసా? నా పుట్టిన రోజు బహుమతిగా!
అది బలే బొమ్మ! దానికి ఎన్నో బట్టలు, ఎన్నో బూట్లు ఉన్నాయి. నేను దానికి రోజూ బట్టలు మారుస్తాను. అది ఉండేందుకు ఒక చిన్న ఇల్లు కూడా ఉంది మా ఇంట్లో. దాని ఇల్లు చాలా ముద్దుగా ఉంటుంది. ఆ ఇంట్లోనే పడుకోబెడతాను దాన్ని. దానికి నేనే పేరు పెట్టాను తెలుసా? దాని పేరు జెస్సిక. నాకు జెస్సికతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం.
నీకు తెలుసా? జెస్సిక బొమ్మ కదా, అయినా దానికి మూసి, తెరిచే కళ్లు ఉన్నాయి! పడుకోబెడితే అది కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. నిలబెడితే తన నీలం రంగు కళ్ళు తెరిచి చూసి నవ్వుతుంటుంది.
జెస్సికకి మెరిసే జుట్టు కూడా ఉంది; దాని తల దువ్వేందుకు ప్రత్యేకమైన దువ్వెనలు కూడా ఉన్నాయి. నేను దానికి రోజూ తల దువ్వుతాను మరి. లేకపోతే పేన్ల సమస్య ఉంటుంది కదా, అందుకని!
నా స్నేహితులకు కూడా అందరికీ జెస్సిక అంటే చాలా ఇష్టమే. నీకు తెలుసా, జెస్సికకు ఒక చిన్న బ్యాగ్ కూడా ఉంది. మనం ఆ బ్యాగును తీసుకుంటే "నా బ్యాగు! నా బ్యాగు!" అంటుంది. దాని పొట్టను నొక్కితే కూడా అది మాట్లాడుతుంది. "నా పొట్ట! నా పొట్ట!" అంటుంది.
జెస్సికకు ఒక చిన్న డాక్టర్ సెట్ కూడా ఉంది. అందులోంచి స్పూన్ తీసి జెస్సిక నోట్లో పెడితే అది "స్పూన్! స్పూన్!" అంటుంది బలేగా. జెస్సికకి చాలా తెలివి ఉంది.
నేను జెస్సికతో రోజూ ఆడుకునేదాన్ని కదా, ఒకరోజున అది నాకు కనిపించలేదు. అప్పుడు
నేను ఎంత కంగారు పడ్డానో! దాని కోసం చాలా సేపు వెతికాను. చివరికి అది ఎక్కడ దాక్కుందో తెలుసా? నా మంచం క్రింద! నన్ను ఏడిపించాలని అక్కడ దాక్కుని ఉంటుందది. భలే తెలివి దానికి. ఎట్లా ఆలోచిస్తుందో చూశావుగా? అప్పటి నుండి నేను దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాను.
ఆకుపచ్చ రంగు బట్టలలో చాలా అందంగా ఉంటుంది జెస్సిక. దాని బట్టలు అందుకనే ఎక్కువగా ఆకుపచ్చవే ఉన్నాయి. దానికేమో మరి ఎర్రరంగు బూట్లంటే చాలా ఇష్టం. అందుకని దాని బూట్లు ఎర్రగా ఉంటాయి.
జెస్సికకు ఎంత చక్కటి పిలక ఉంటుందో! దాని జుట్టు బలే ఉంటుంది మెత్త మెత్తగా, మెరుస్తూంటుంది. జుట్టు దువ్వుకునేందుకు దానికో దువ్వెన కూడా ఉంది. నేను ఒక్కోసారి దాని జుట్టు దువ్వి ఊరికే వదిలేస్తుంటాను. అప్పుడు అది నిజంగా కొత్త బొమ్మలాగా అయిపోతుంది- 'మా జెస్సికానే' అంటే ఎవరూ నమ్మరు- అంత మారిపోతుందది!
నేను పెద్దయ్యే సరికి అది నా అంత అవుతుంది కదా, అప్పుడు నేను దాన్ని ఇంకా చాలా బాగా చూసుకుంటాను!