జోకులు:
అభినవ ధర్మం!     
   యమధర్మరాజు: చిత్రగుప్తా! ఈ పాపి చిట్టా చూడు- తక్షణమే శిక్ష విధిస్తాను!    
   చిత్రగుప్తుడు: రెండు రోజుల నుండి సర్వర్ డౌన్ ప్రభూ! తమరికి ముందే మనవి చేశాను.  నెట్ పునరుద్ధరింపబడే వరకూ వీడినేమీ చేయలేం.               
   (సేకరణ: అలివేలమ్మ, చెన్నేకొత్తపల్లి )
పొరపాటు!    
   రాణి. రైల్వే ఉద్యోగిని పెళ్లాడి పొరపాటు చేశాననిపిస్తోంది.    
   పక్కింటి ఆమె: ఏ ఏమైంది?     
   రాణి: చెప్పిన టైమ్‌కు ఒక్కనాడు ఇంటికి రావటం లేదు చెప్పింది రాణి...   .                          
   (సేకరణ: అలివేలమ్మ,  చెన్నేకొత్తపల్లి)
చాక్‌పీసు ప్రేమ!    
   లెక్కల అయ్యవారు:  పిల్లలూ! ఈ అభ్యాసంలోఎన్ని లెక్కలు ఉన్నాయి?    
   గోపి:  చాలా ఉన్నాయి సార్!    
   లెక్కల అయ్యవారు: మరయితే ఒక్క లెక్క చేస్తువురా, గోపీ     
   గోపి:  ఒక్క లెక్క కాదు సార్, అన్ని లెక్కలూ ఒకేసారి చేస్తా. బోర్డు తక్కువ అయినా పర్లేదు; చాక్‌పీసులు మాత్రం ఎక్కువగా ఇప్పించండి సార్!     
   (సేకరణ:  సి. రెడ్డి శ్రీను  7వ తరగతి, పివిఆర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, టి గుండువారిపల్లి)
చీకటి పక్షి!    
   పక్కింటి ఆమె (ఆశ్చర్యంగా) : వదినా, అన్నయ్య గారు చీకట్లో కూడా వంటింటి పనులన్నీ చక చకా చేసేస్తున్నారే!    
   రాధ: ఆయనపోటో గ్రాఫర్ కదా, డార్క్ రూములో పనిచేయడం అలవాటులే! 
   (సేకరణ:  అలివేలమ్మ, చెన్నేకొత్తపల్లి)
 ఆలస్యం అమృతం విషం    
   టీచర్: ఒరేయ్! చింటూ రైలుకి, బస్సుకీ తేడా ఏంటి?    
   చింటూ: రైలు చెప్పి ఆలస్యంగా వస్తే, బస్సు చెప్పకుండా ఆలస్యంగా వస్తుంది టీచర్.     
నిజపు సెగ!     
   సైన్సు టీచర్: పిల్లలూ! నాలుక తడిగానే ఎందుకుంటుంది, చెప్పండి, చూద్దాం!    
   విద్య : నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడం కోసమేమో టీచర్!      
   టీచర్: వామ్మో!                                                  
   (సేకరణ:  అలివేలమ్మ, చెన్నేకొత్తపల్లి )
ఆశపోతు!    
   రోగి: డాక్టరు గారు! మీరు రాసిన మందుల చీటి పోయిందండి.     
   డాక్టరు: అంతేనా! నేనింకా మీ జబ్బు పోయిందేమోనని ఎంత కంగారు పడ్డానో!                                                     
   Y. బాలాజి, ఎనిమిదవ తరగతి, గుండువారి పల్లి
పొడుపు కథలు:       
1. రెండు స్తంభాలు   
   రెండు స్తంభాల మీద తొట్టిలు    
   తొట్టి మీద గుండ్రాయి   
   గుండ్రాయి మీద గడ్డి    
   గడ్డిమీద రోడ్డు!    
   ఏంటి ఇది?                                              (జవాబు మనిషి!)
   2.  ముళ్ళ బాట!   
   ముళ్ళలో పుట్టాను    
   ముళ్ళలో పెరిగాను    
   రంగూ వాసన నాసొత్తు      
   ఎవరిని, నేనెవరిని?                                      (జవాబు :గులాబీ!)
3.దారిలేని మార్గం   
   తెల్లని గుడి-    
   లోనికి వెళ్ళే దారి లేదు!      
   ఏమిటది?    
   జవాబు: గ్రుడ్డు!     
గుర్తు ఉంచుకోదగిన వాక్యాలు:
'తల్లి తండ్రులు వృద్ధులై నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని రక్షించడం పిల్లలల బాధ్యత- (మహాత్మా జ్యోతి బా పులే)
నవ్వాలి, నవ్వించాలి- కానీ నవ్వులపాలు మాత్రం కాకూడదు!
"మొక్కలకూ భావాలుంటాయి. అవి వాటిని ప్రకటిస్తుంటాయి" అని కనుక్కున్న శాస్త్రవేత్త- 'జగదీశ్ చంద్ర బోస్'
ఉన్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండాలి; దాన్ని సాధించేందుకు ఓపికగా శ్రమించాలి; ఇదే మన జీవనసూత్రం కావాలి- డా.బి.ఆర్.అంబేద్కర్
ఒక్క అంటార్కిటికాలో తప్ప ప్రపంచంలోని అన్ని ఖండాలలోనూ పాములున్నాయి.
మంచి పద్యాలు:    
అంతరంగమందు అపరాధములు చేసి
మంచివానివలెను మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా,
విశ్వదాభిరామ వినురవేమ?
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై,
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానెయైన వా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్!
భావం:  "ఈ జగత్తు అంతా ఎవ్వనిలో పుడుతుంది, ఎవ్వనిలో లీనం అయి ఉంటుంది, ఎవ్వనిలో చేరి నశిస్తుంది? దీనికి మూలకారణం ఎవరు? తుది, మధ్య, మొదలు అంటూ లేకుండా అంతా తానే ఐనవాడు ఎవ్వడు? తనంతట తానే పుట్టిన ఆ గొప్ప భగవత్తత్వాన్ని నేను శరణు వేడుతాను”      
   సందర్భం:  అద్భుతమైన ఈ పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతంలోనిది.  మొసలి నోట చిక్కిన ఏనుగు ఒకటి అన్నిటికీ అతీతుడైన భగవంతుడిని ఆర్తిగా ఇలా ప్రార్థిస్తుంది.  తరతరాలుగా అనేకమంది తెలుగువారికి భగవంతుడిని దగ్గరగా తెచ్చిన పద్యం ఇది!  మీరూ నేర్చుకోండి మరి, ఆలస్యమెందుకు?   
కవితలు        
   సూర్యాస్తమయమేనా?!      
   కొండకోనల్లో నవ్వుతూ, తుళ్లుతూ పరిగెడుతున్న సెలయేరు     
   కాలుజారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకుల చాటు     
   సూరీడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు..      
   (రచన:  Y. బాలాజి, ఎనిమిదవ తరగతి, P.V.R.Z.P.H.పాఠశాల.)        
కొత్తపల్లి సంగతి:       
   స్వాగతం!     
   భారత ప్రభుత్వపు పత్రికా విభాగం వారి  గుర్తింపు లభించాక వెలువడుతున్న మొదటి కొత్తపల్లి ఇది-  దీనిపై మీ అభిప్రాయాలను, సలహాలు-సూచనలను మాకు రాసి పంపండి. అట్లా కొత్తపల్లిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుంది.  మరింతమంది పిల్లలకు తెలుగంటే మక్కువ ఎక్కువౌతుంది!     
చూశారుగా, కొత్తపల్లిలో  పిల్లల రచనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పుస్తకంలో దాదాపు సగం కథలు పిల్లలు రాసినవి; మిగిలినవి పిల్లలకోసం పెద్దలు రాసినవి.  బొమ్మలు వేసినవాళ్ళు   మటుకు యువకులు.  
పిల్లలను కలవటం, వాళ్లతో తెలుగులో కథలు రాయించటం, బొమ్మలు వేయించటం, వాళ్ళు పంపిన కథల్ని, బొమ్మల్ని సరిదిద్ది మిగతా పిల్లలందరికీ నచ్చేట్లు పుస్తకాలుగా తయారు చేయటం, దానికోసం ఓపెన్ సోర్సు ఉపకరణాలను వాడటం, కథల్ని అందరూ ఉచితంగా చదువుకునేట్లు ఇంటర్నెట్‌లో పెట్టటంతోపాటు, కొన్ని ప్రతులు అచ్చు వేయటం మాకు ఇష్టం. అందరి మేలూ కోరి చేసే ఈ పనిలో మీరూ పాలుపంచుకోండి. సాయం చేయండి. పిల్లల కథల ప్రపంచానికి స్వాగతం !
కొత్తపల్లి బృందం
