"ఏమర్రా, పిల్లలూ! ఎండలో తిరక్కండి!" అంటూ పిల్లల్ని మందలించారు తాతయ్య- ఎండలో ఆడుకుని వడదెబ్బ తిన్నంత పనైన పావనిని చూస్తూ.

"ఏంచేయమంటావ్ తాతా! శలవుల్లో తోచదాయె; నువ్వేమో ఎండ- ఎండ అంటావు, బలే తిప్పలొచ్చిపడ్డాయి!" అంటూ విసుక్కున్నారు పిల్లలు.

"ఓరోరీ! తోచకపోవటానికి ఏముందోయ్! ఏదో ఒక కొత్త పని మొదలెట్టేస్తే సరి. అదీ మీకు ఉపయోగంగా ఉండాలి, తెలివిని పెంచాలి, భవిష్యత్తులో ఉపయోగ పడాలి. అలాంటి పని ఒకటి చెప్తాను చేస్తారేంట్రా?" అంటూ తాత ఆగాడు.

" ఓ తప్పక చేసేస్తాం, చెప్పు తాతా !" అంటూ తాత చుట్టూ చేరారు పిల్లలంతా.

"ముందుగా మీరు వేసవి శలవుల తర్వాత వెళ్ళే క్లాస్ పుస్తకాలు సంపాదించి పెట్టుకోవాలి.."

తాత మాటలు పూర్తవందే "ఓహో, అవి ఎప్పుడో సంపాదించేశాం. వేసవి తర్వాత కొత్త పుస్తకాలు అచ్చై రావటం, కొత్తగా ఏ ప్రభుత్వం వస్తుందో, పుస్తకాలెప్పుడు ప్రింటవుతాయో ఎవ్వరికీ తెలీదుగనుక, మా మాస్టార్లందరూ పై తరగతుల పిల్లల పుస్తకాలు సేకరించి మా అందరికీ పంచేశారు. కొందరికైతే కొత్త పుస్తకాలు కూడా దొరికాయి"

"మరి చెప్పరేం! మీ పంతుళ్ళు చాలా తెలివైనవారూ, ఆలోచనాపరులూ, రాబోయే ఇబ్బందులన్నీ తెలిసినవారూనూ! సరి సరి- ఆ పుస్తకాలు తీసుకురండి. మీరు వెళ్లబోయే తరగతి పాఠాలు తీయండి. అందులోనూ మీకు అంతగా ఇష్టంలేని సబ్జెక్ట్ తీసుకురండి" అన్నారు తాతగారు సర్దుకు కూర్చుంటూ.

“ ఇవిగోండి తాతగారూ!" బిలబిల మంటూ పిల్లలంతా తమ క్లాస్ పుస్తకాలు తీసుకుని వచ్చారు. "పిల్లలూ! మీరు మీకు అంతగా ఇష్టంలేని సబ్జెక్ట్ పుస్తకాలు తీయండి!"

"తాతగారూ ! మాకు పరిసరాల విజ్ఞానం పెద్ద బోర్! ఆ మ్యాప్ పాయింటింగ్సూ , నదులూ, సముద్రాలూ, పర్వతాలూ, నగరాలూ, అవన్నీ ఇప్పుడు వద్దు బాబోయ్!" అంటూ తలలు పట్టుకున్నారు.

"మంచిదైందిరా ! మీ అందరికీ ఒకే సబ్జెక్ట్ బోరవటం మేలైంది. ఏదీ మీ అట్లాస్‌లు తీయండి!" అని మొదలెట్టి నెట్టారు తాతగారు. ఒకవైపు అయిష్టంగానే‌ ఉన్నా, తాతగారి మీద గౌరవం కొద్దీ ”ఇవిగోండి తాతగారూ!" అంటూ పిల్లలంతా అట్లాసులు తెరిచారు.

తాతగారు వాళ్ళందరినీ ముందుగా దేశ-పటాలు తీయమన్నారు- "పిల్లలూ ! ముందు మీరంతా మీ దగ్గరున్న దేశపటంలో చూసి, మీకు కనిపించే రకరకాల నదుల పేర్లూ, అవి పుట్టే ప్రదేశాల పేర్లూ, ప్రవహించే పట్టణాల పేర్లూ రాయండి- ఎవరికి వారే వెతికి రాయాలి, కాపీ కొట్టకండి- మీకు అర్ధ గంట సమయం ఇస్తున్నా ను “ అన్నారు .

అంతా తలో మూలా కూర్చుని చకచకా తమ అట్లాసులు తెరిచి నదులు ఏవేవి- ఎక్కడెక్కడున్నాయో వెతికి రాయటం మొదలు పెట్టారు.

"ఇంకా పదినిముషాలే .. ఐదునిముషాలే.. ఒక్క నిముషమే..ఇక ఆపేయండి" అని కామెంటరీ చెబుతూ అందర్నీ ఉత్సాహపరుస్తూ పోయాడు తాతయ్య.

"ఇప్పుడు ఎవరు- ఎన్ని నదుల గురించి- వ్రాశారో చూద్దాం" అని అందరి పుస్తకాలూ చూసిన తాతయ్య రమేష్‌ను బలే మెచ్చుకున్నాడు- "ఒరేయ్! పరిసరాల విజ్ఞానం అంటే బోర్ అన్న మొదటివాడివి, అందరికంటే బాగా రాశావు కదరా!" అని. పిల్లలందరూ నవ్వారు.

తాతయ్య చెప్పాడు- "చూడండి, ఇట్లా మనకు ఏ సబ్జెక్టు బోరో, దాని మీదే పనిచేసి, మనకు ఇష్టమైన దానిగా మలచుకోవాలి, ఇలాగ!" అని.

అలా పిల్లలంతా ఒకరోజున రైల్వేస్టేషన్ల గురించీ, మరో రోజున రోడ్డు మార్గాల గురించీ, ఇంకో రోజున నగరాల గురించీ, ఖండాలూ, సముద్రాల గురించీ- అట్లాసులో చూసి కనుక్కొని రాసారు. అందరికీ బాగానే అనిపించింది. ఆశ్చర్యం- ఎవ్వరికీ బోరు కొట్టలేదు!

వేసవి సెలవలు ముగిసి బళ్ళు తెరిచేసరికి పిల్లలందరికీ సాంఘిక శాస్త్రమేకాదు- సైన్స్ లో బొమ్మలూ, గణితంలో సమస్యలూ, డిక్షనరీ చూసి ఇంగ్లీషు పదాల అర్థాలు కనుక్కోవటం , కొత్త మాటల అర్ధాలు వెతుక్కోడం- అన్నీ తెలిశాయి.

బళ్ళు తెరిచే రోజున పిల్లలంతా తాత గారికి ఇష్టమైన మెత్తని జామ పండ్లు తెచ్చిచ్చి- "తాతా! ఈ వేసవి మాకెంతో సరదాగా గడిచింది. అసలు పరిసరాల విజ్ఞానం ఇంత బాగుంటుందని మాకు తెలీనే తెలీదు- ఇప్పుడు మాకు అన్ని సబ్జెక్టులలోకీ ఇదంటేనే ఎక్కువ ఇష్టం అయ్యేట్లుంది!" అని చెప్పారు.

"ఓరీ, నేను విశ్రాంత ఉపాధ్యాయుడినని మరచిపోయారట్రా?!

40 ఏళ్ళపాటు బడిపంతులుగా మీలాంటి ఎందరో పిల్లలకు కష్టమైన దాన్ని ఇష్టంగా చేసుకునేదెలాగో చెప్పినవాడ్నిరా" అంటూ బోసి నవ్వు నవ్వుతున్న తాతను చూసి, తామూ నవ్వారు పిల్లలంతా.