కొత్తపల్లి సంతలో అరటి పళ్ళు అమ్మే గోపాలం నిజాయితీ పరుడు. పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉంది ఆయనకు. ఆమె పెళ్ళి సంబంధాలకోసం‌ కాలికి బలపం కట్టుకొని తిరిగితే, చివరికో మంచి సంబంధం నిశ్చయం అయ్యింది. పెళ్ళి కొడుకు చిరుద్యోగి- మంచివాడూ, సౌమ్యుడూనూ.

పెళ్ళి ఇంకా కొద్ది రోజుల్లో ఉందనగా గోపాలం కూతురి పెళ్ళి కోసం తను ఇంతకాలంగా కూడబెట్టిన యాభై వేల రూపాయలూ బ్యాంకు నుండి తెచ్చి, ఇంట్లో దాచు-కున్నాడు- పెళ్ళి ఖర్చులకు కావాలి కద!

అయితే ఆయన బీరువాలో డబ్బు దాచే సమయంలో ఆయన తమ్ముడి కొడుకు నంద అక్కడే ఉన్నాడు. నందకు పనీ పాటా లేదు; చిన్న చిన్న దురలవాట్లూ ఉన్నాయి. పెదనాన్న డబ్బు దాయటం, బీరువా తాళం చెవులు అక్కడే ఓ ప్రక్కన పెట్టం చూసి వాడి చెయ్యి ఆగలేదు. గోపాలం బయటకు పోగానే వాడు బీరువా తెరిచి ఆ డబ్బంతా కాజేశాడు!

వాడికి ఊళ్ళో తనలాగే దుబారాగా, అల్లరి చిల్లరగా తిరిగే స్నేహితులు ముగ్గురున్నారు. పెదనాన్న నుండి కాజేసిన నోట్ల కట్టని ప్యాంటు జేబులో దాచుకొని, వాడు సైకిలెక్కి గబగబా వాళ్ళ ఇళ్ల వైపుగా బయలుదేరాడు. అయితే ఆ హడావిడిలో వాడు చూసుకోలేదు- వాడి జేబుకో పెద్ద కన్నం ఉంది: అందులోంచి ఆ డబ్బులు ఎప్పుడు జారాయో, ఎక్కడ పడిపోయాయో, వాడికి తెలీనే లేదు!

అట్లా పడిపోయిన ఆ నోట్లకట్ట ఒక వర్తకుడికి కనిపించింది. వర్తకుడు ఆశపోతు. అతను గబుక్కున దానిమీద తన చేతి రుమాలు వేసేసి, ఎవరైనా తనను గమనిస్తున్నారేమో అని అటూ-ఇటూ చూశాడు: ఎవ్వరూ చూస్తున్నట్లు లేరు! అతను వెంటనే దాన్ని పైకెత్తి, గబుక్కున తన సంచీలో వేసుకొని, వెనుతిరిగి చూడకుండా ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు చేరుకోగానే సంబరం పట్టలేక ఆ డబ్బు కట్టను భార్యకు చూపించాడు. ఒక్కసారిగా అంత డబ్బు దొరకటం చూసి వర్తకుడి భార్య సొమ్మసిల్లి పడిపోయింది!

కొంచెం తేరుకున్నాక వర్తకుడు ఆలోచించాడు: "ఇంత దొంగ సొమ్ము చేతిలో ఉంటే ప్రమాదం. ఎక్కడైనా దాచాలి- ఎక్కడ?" అని. చివరికి అతను పెరట్లో ఒక గొయ్యి త్రవ్వి, డబ్బును అందులో పాతేసి, తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

అయితే అతను అట్లా దేన్నో పాతిపెట్టడం అక్కడే తచ్చాడుతున్న ఒక దొంగ చూడనే చూశాడు. 'ఎంతోకొంత విలువైంది కాకపోతే వర్తకుడు అంత శ్రమ ఎందుకు పడతాడు?' అనుకున్న దొంగ, చీకటి పడేంత వరకూ ఆగి, వ్యాపారి పడుకోగానే పెరట్లో పనికి వంగాడు. త్వరలోనే అతని శ్రమ ఫలించింది: ప్లాస్టిక్ కవర్ చుట్టిన నోట్ల కట్ట అతని చేజిక్కింది! వాడు కొంత సేపు తన అదృష్టానికి నివ్వెరపోయి, తర్వాత ప్లాస్టిక్ కవర్ తీసి అక్కడే పడేసి, నోట్లకట్టను రొండిన చెక్కుకొని, గోడ దూకి పరుగు మొదలెట్టాడు.

అయితే ఆ రోజున వాడి అదృష్టం సరిగ్గా ఉన్నట్లు లేదు- వీధి కుక్కలన్నీ వాడి వెంటే పడ్డాయి. వాడు ఎటు వెళ్తే అటు కుక్కలు! వాటి అరుపులకు గ్రామంలోని ప్రజలందరూ నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు. ఇక దొరికిపోతానని భయం వేసింది వాడికి. డబ్బుతో దొరికితే జనాలతో కష్టం! అందుకని వాడు నోట్ల కట్టని దారి ప్రక్కనే విసిరేసి, వేరే దిక్కుకు పరుగు పెట్టాడు.

ఆ ఊళ్ళోని రామాలయం పంతులికి తెల్లవారు జామునే స్నానం చేయడం అలవాటు. ఆ రోజున ఆయన అట్లా స్నానం చేసి తిరిగి వస్తుండగా, దారి ప్రక్కనే నోట్లకట్ట కనిపించింది. "అయ్యా! రామా! ఇన్నాళ్ళకు నీ భక్తుడిని కరుణించావా తండ్రీ!" అంటూ ఆనందంగా డబ్బుని తన కండువాలో చుట్టి పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన.

ఆయన ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి ముందు పెద్ద గుంపు ఒకటి మూగి ఉన్నది: వాళ్లంతా ఆయన చేత పెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోటానికి వచ్చిన గ్రామస్తులు. పంతులుగారు కాళ్ళు-చేతులు కడుక్కొని, చేతిలో ఉన్న చెంబును అరుగు మీద పెట్టి, కండువాను ఎవరికీ కనిపించకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి, దాన్ని పడక కుర్చీ పైన పెట్టి, ముహూర్తాల వాళ్ళతో మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు.

సరిగ్గా అదే సమయానికి పంతులుగారి భార్య బట్టలు ఉతికేందుకు బయలు దేరింది. వెళ్తూ వెళ్తూ ఆవిడ పడక కుర్చీలో పంతులుగారు వేసిన కండువాని కూడా ఎత్తి తన బకెట్ లో వేసుకున్నది- కండువాలో డబ్బు ఉందని ఆమెకు తెలీదుగా?

పంతులుగారి భార్య చాకిరేవుకు చేరుకునే సరికి అక్కడ గోపాలం భార్య శ్రీలక్ష్మి కూడా బట్టలు ఉతుకుతున్నది. ఇద్దరూ అంత:పురం సీరియల్ గురించి కబుర్లాడుతూ బట్టలు ఉతుక్కున్నారు. నోట్ల కట్ట పంతులుగారి బక్కెట్లోనే పడి ఉన్నది- ఇద్దరూ దాన్ని గమనించలేదు. పని ముగించుకున్నాక, ఇద్దరూ ఎవరికి వాళ్ళు తాము ఉతికిన బట్టల్ని బకెట్లో వేసుకొని ఇంటికెళ్ళారు.

ఆ సమయంలో ఒక పొరపాటు జరిగింది: ఇద్దరి బకెట్లూ ఇత్తడివే. రెండూ ఒకే కాంతం దగ్గర కొన్నవి; ఒకేలాంటివి! దాంతో ఒకరి బకెట్ ఒకరికి వచ్చింది. పంతులుగారి బక్కెట్టు నోట్ల కట్టతో‌సహా అలా గోపాలంగారి ఇల్లు చేరుకున్నది!

శ్రీలక్ష్మి ఉతికిన బట్టలు ఆరవేస్తుంటే బకెట్ అడుగున డబ్బు కనిపించింది. ఆమె ఆ నోట్లకట్టని చూసి ఆశ్చర్యపోతున్నంతలో గోపాలం గాభరాగా అక్కడికి వచ్చి , "లక్ష్మీ! నిన్న నేను బీరువాలో దాచిన డబ్బు కనిపించట్లేదు, నువ్వు గాని తీశావా?" అంటూనే బకెట్ లో ఉన్న డబ్బుని చూసి - "నువ్వెందుకు తీశావు, దీన్ని? దీని కోసం ఎంత సేపటినుంచి వెతుకుతున్నానో తెలుసా?" అన్నాడు దాన్ని తీసుకుంటూ.

గోపాలం భార్యకు ఆ డబ్బు తన బక్కెట్టులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. చివరికి 'పొరపాటున నేనే తీసుకుపోయి ఉంటాను బట్టలతోబాటు- పోయి ఉంటే ఎంత గందరగోళం జరిగేది?!' అనుకొని సంతోష పడ్డది. "ఏమైనా నా అదృష్టం బాగుంది ఇవాళ్ల" అంటూ తెగ నవ్వింది.

అట్లా తిరిగి తిరిగి గోపాలం సొమ్ము గోపాలాన్నే చేరుకున్నది! ఏది ఏమైనా కష్టం చేసి సంపాదించిన సొమ్ము వృధా కాదు. "పోవుట దొరకుట కొరకే" అంటే ఇదే!