"ఒరేయ్! దయ్యాలున్నాయట్రా?" అడిగాడు సోము, చంద్రాన్ని.
"లేవు" చెప్పాడు చంద్రం, ఖచ్చితంగా
"ఎట్లా తెలుసురా, నీకు?" అడిగాడు సోము.
"ఎట్లా ఏముంది?! తెలుసు, అంతే!" అన్నాడు చంద్రం "మన ఊరవతల కరెంటు తీగలున్నాయి చూడు-" అని జోడిస్తూ. "ఉన్నాయిగా! మనం అందరం పోయి అవి 'గుయ్-గుయ్' అని పాడుతుంటే విన్నాం, గుంపుగా దాక్కుని!" చెప్పాడు సోము "అయితేనేమి?" అంటూ.
"అవును కదా! అవి పాటలు పాడేది ఎందుకనుకుంటున్నావు? ఊళ్ళలో ఉన్న దయ్యాలన్నీ ఆ పాటలు విని, వాటి చుట్టూ చేరేందుకు పరుగులు పెడతాయి. ఒక్క సారి ఆ తీగలను అంటితే చాలు- అవి ఇంక వాటికే అతుక్కుపోయి, నల్లగా మాడి, మసైపోతాయి. అట్లా ఒకటీ, రెండూ కాదట, వేలకు వేల దయ్యాలు బూడిదైపోయాయట, తెలుసా?"
"ఊఁ.." అన్నాడు సోము, సాలోచనగా "అందుకేనా, మరి ఇంజనీర్లు ఎవ్వరూ దయ్యాలంటే భయపడరు?!" అని అడిగాడు స్వగతంలో మాదిరి చిన్నగొంతుతో.
"మరెందుకనుకున్నావు? దయ్యాలంటే నిజానికి వాళ్ళకీ భయమే. అయితే వాళ్ళని ఏమైనా చేసేముందే అవన్నీ వెళ్ళి తీగలకి అతుక్కుంటాయని తెలుసు, వాళ్ళకి" చెప్పాడు చంద్రం, మరింత తెలిసినట్లు.
"అవున్రా. మరి అప్పుడోసారి కరెంటు పోయింది చూడు- రెండు రోజులు వరసగా కరెంటు లేదు. అప్పుడు ఏమై ఉంటుంది?" సోముకి సందేహం.
"ఓరి పిచ్చి ముఖమా, 'ఇప్పటికే దయ్యాలన్నీ మాడి మసైపోయినాయిరా' అంటే, ఇప్పుడింక కరెంటు పోతే మాత్రంఏం?" నవ్వాడు చంద్రం, గమ్మత్తుగా.
"అన్నీ చచ్చిపోయాయంటావా, ఒక్కటీ మిగలకుండా?!"
"ఒక్కటి గూడా లేదు. అటు కరెంటు తీగలొచ్చాయి; ఇటు వాటి పనైపోయింది- అంతే!"
మాట్లాడుకుంటూ వస్తున్నారు సోము, చంద్రం, పొరుగూరు నుండి. అప్పుడపుడే చీకటి పడుతున్నది. చెట్ల చివర్లలో మాత్రం సూర్యుడి వెలుతురు పడుతున్నది- అవి పచ్చగా,ఎర్రగా మెరుస్తున్నాయి. మిగిలిన భాగాలన్నిటినీ చీకటి కొద్ది కొద్దిగా మింగేస్తోంది. నీడలన్నీ పరచుకొని గాలికి ఊగుతుంటే వాతావరణం ఏదోలా అనిపిస్తున్నది.
దూరంగా, ఊరివైపుగా, చింత చెట్టొకటి, ఎడారిలో ఒంటరి పక్షిలాగా నిలబడి ఉంది. దానినుండి తెల్లగా ఏదో వేళ్ళాడుతున్నది. దాన్ని చూడగానే పిల్లలిద్దరూ ఠక్కున ఆగిపోయారు- సోము గబుక్కున చంద్రం చెయ్యి పట్టుకున్నాడు- "లేవన్నావుగా?! చూడు!
ఇప్పుడేం చేద్దాం?! వెనక్కి తిరిగి పారిపోదామా?!" గుసగుసగా, ఏడుపు గొంతుతో అన్నాడు.
చంద్రం మాట్లాడలేదు. వాడి గొంతు పెగలటం లేదు. "ఎటుపోతాం? ఊళ్ళోకి పోవాలంటే మళ్ళీ ఇటువైపు రావాల్సిందేగా?" అన్నాడు మెల్లగా.
అంతలో ఈదురు గాలి వీచింది. దూరంగా సుడి చుట్టుకొని దుమ్మంతా పైకి ఎగిరింది.
కెవ్వున అరిచాడు సోము-"ఇదిగో, చూడు! చింతచెట్టుకంటే పైకి ఎగిరిందది!" అని. పిల్లలిద్దరి కాళ్ళూ నేలకి అతుక్కుపోయినై. ఇక కదల్లేకపోయారు. అంతలో తెల్లటి ఆ ఆకారం నిజంగానే గాలిలోకి ఎగిరి వీళ్లవైపుకు దూసుకు వచ్చింది. రెక్కలల్లార్చుకుంటూ ఎగిరొచ్చి చంద్రం ముఖాన్ని ఠపాలున కొట్టింది! పిల్లలిద్దరూ వణికిపోతూ గట్టిగా అరిచారు-
అంతలో ఎవరిదో గొంతు వినబడింది గట్టిగా, -ఏమీ లేదమ్మా, భయపడకండి. ఇది ఒట్టి బట్ట. గాలిగి ఎగిరి వచ్చిందంతే!" అని చంద్రం ముఖానికి అంటుకొని ఉన్న బట్టను తొలగించారు. చూడగా, ఆ వచ్చింది సూర్యారావు మాస్టారు. పిల్లలిద్దరూ భయంతోవణుకుతూ ఆయన కాళ్లని చుట్టేసుకున్నారు. ఆయన వాళ్ల వీపులు తడుతూ "ఒట్టి బట్టే కదా! అంత భయపడాల్సింది ఏముంది?" అన్నారు.
"దయ్యం అనుకున్నాం సార్!" పిల్లలు చెప్పారు కొంతసేపటికి.
"దయ్యాలు అంటూ బయట అస్సలు లేవురా! ఉంటే గింటే అవి మన లోపల ఉన్నై- భయాలుగాను, ఆలోచనలు గాను! మనం ఎంత భయపడతామో, అవి ఆలోచనలుగా మనల్ని అంత భయపెడతాయి. భయం పోవాలంతే జ్ఞానం పెంచుకోవాలి. మనకి తెలిసిన సంగతులు పెరిగిన కొద్దీ తెలీనివి తగ్గిపోతాయిగా, ఎలాగూ?! అట్లా మన భయాలూ పోతై; దయ్యాలూ పోతై " అన్నారు సూర్యారావుగారు.
"మరి, అవి కరెంటు తీగలకి తగులుకోవా..?" అడిగాడు చంద్రం.
ముందు ఆ ప్రశ్న సూర్యారావుగారికి అర్థం కాలేదు. అర్థమయ్యాక పడీ పడీ నవ్వారు- "కరెంటు తీగలమీద వాలి ఉండే పక్షుల్ని చూడలేదా? వాటికి ఏమౌతున్నది? కరెంటు తీగలు వాటినే ఏమీ చేయట్లేదే, మరి మీరనే దయ్యాల్ని ఏం చేస్తాయట?!"
"అవునే! నాకు గుర్తుకే రాలేదు ఈ సంగతి!" నవ్వాడు చంద్రం- "అంటే మనకూ ఏం కాదా, కరెంటు తీగల్ని పట్టుకుంటే?!" "జాగ్రత్త నాయనా! అట్లాంటి పిచ్చి పనులు చెయ్యకు! మనం కరెంటు తీగను పట్టుకుంటే కరెంటు మనగుండా ప్రవహించి, నేలను చేరుకుంటుంది; అందువల్ల మనకు పెద్దషాక్ కొడుతుంది. కానీ పక్షులు వచ్చి కరెంటు తీగల మీద వాలితే వాటికి ఏమీ కాదు- ఎందుకనో చెప్పు, చూద్దాం?"
"అవి నేలను తగిలి లేవుగా?!" అర్థమైనట్లు చెప్పాడు చంద్రం.
"అవును. ఒక్కోసారి తెలీక ఏదైనా పిట్ట ఒక తీగమీద వాలి, ఇంకో తీగను గానీ, స్తంభాన్నిగానీ తగిలిందనుకో, అప్పుడు దానిగుండా కరెంటు ప్రవహించి, దాని శరీరం కాలిపోతుంది; అది చచ్చిపోతుంది!
"అవునవును. తీగలకి వ్రేలాడే పక్షి శరీరాల్ని చూశాను చాలాచోట్ల!" అన్నారు పిల్లలిద్దరూ, ఒకేసారి.
"ఇన్నాళ్ళూ వాటిని దయ్యాలే చంపాయనుకున్నాను!" అన్నాడు సోము ముఖం వేళ్ళాడేసుకొని.
"అనుమానం తీరిందిగా, ఇప్పుడు హాయిగా నవ్వు!"అన్నారు సూర్యారావుగారు, తనూ నవ్వుతూ.