అనగనగా ఒక ఊళ్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది.
గాడిద అతనికి ఎన్నో పనులు చేసిపెడుతుండేది. ప్రతి పనిలోనూ సహాయంగా ఉండేది.
రైతు ఒక రోజున ఎప్పటిలాగే గాడిదను తీసుకొని పొలానికి వెళ్ళాడు. దాన్ని మేత మేసేందుకు వదిలి, తను పొలం పనులు చేసుకోవటం మొదలు పెట్టాడు.
తన పని అయిపోయిన తర్వాత చూస్తే.. గాడిద కనిపించడం లేదు! ఎవరో దాన్ని దొంగిలించారు!
రైతు నేరుగా గ్రామ చావడి దగ్గరికి వెళ్ళాడు. దాదాపు ఊళ్ళోని రైతులందరూ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. "మీరంతా పిరికి పందలురా,...ఒట్టి పనికి మాలిన దొంగలు! నేనుఏమైనా తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నారా? నా గాడిదను నాకిచ్చేయండి!
లేకుంటే మానాన్న చేసినట్లు చేస్తాను జాగ్రత్త! మళ్ళీ నన్ను అని లాభం లేదు! ముందుగానే చెబుతున్నాను, చూసుకోండి మరి!" అని అక్కడి వారిని బెదిరిస్తూ, నానా హంగామా చేశాడు రైతు.
గాడిదను దొంగిలించిన వాడు కూడా ఆ సమయానికి అక్కడే ఉన్నాడు. రైతు వీరంగాన్ని చూసి, వాడికి భయం వేసింది. వీడే ఇట్లా ఉంటే వీడి తండ్రి ఇంకా ఏమి చేసి ఉండచ్చో దొంగ ఊహకు అందలేదు.
వాడు గబుక్కున పోయి, తను దాచిపెట్టిన గాడిదను తెచ్చి భద్రంగా రైతుకు అప్పగించాడు. "ఇది నీదేనా, ఎవరిదోతెలీక మా దొట్లో కట్టేశాను" అని బొంకాడు.
తరువాత అడిగాడు- "ఇంతకీ మీ నాన్న ఏం చేశాడు?" అని.
"ఒకసారి మానాన్న గాడిదని ఇలాగే ఇంకోడు ఎత్తుకెళ్ళాడు. అప్పుడు ఆయన ఏం చేశాడో నాకు తప్ప వేరే ఎవ్వరికీ తెలీదు!" అన్నాడు రైతు.
"అదే, ఏం చేశాడు?" అడిగాడు దొంగవాడు, ఉత్కంఠను తట్టుకోలేక.
"ఏముంది, ఆయన ఇంకొక గాడిదని కొనుక్కున్నాడు" జవాబిచ్చి, తన గాడిదను తోలుకొని చక్కా పోయాడు రైతు! దొంగ నోరు వెళ్ళ బెట్టాడు!