పట్నం నుండి వచ్చాడు మామయ్య.

మామయ్య, చిట్టి ఇద్దరూ కొత్తపల్లిలో సాయంత్రం పూట నడచుకొని పోతున్నారు.

వాళ్ళవెనకనుండి వచ్చిన ఓ ట్రాక్టరు వాళ్లని దాటుకొని బరువుగా ముందుకు పోయింది.

ఆ ట్రాక్టరు వెనక ఓ ట్రాలీ ఉంది. దాని నిండుగా వడ్ల బస్తాలు- ఎత్తుగా అమర్చి ఉన్నాయి. వాటిమీద నలుగురైదుగురు కుర్రవాళ్ళు కూర్చొని ఉన్నారు. ఆ వడ్ల యజమాని రైతు కొంచెం పెద్దాయన- ట్రాక్టరులో డ్రైవరుతోబాటు కూర్చొని ఉన్నాడు.

"వడ్లనుండి బియ్యం వస్తుంది పాపా" చెప్పాడు మామయ్య, చిట్టికి. "ఇక్కడేమైనా రైస్‌మిల్‌ ఉందా?" చిట్టి దూరంగా ఉన్న రైస్‌మిల్లును చూపించింది.

"ఊఁ..ఇది వెళ్ళేది అక్కడికే. మిల్లులో యంత్రాలుంటై. అవి వడ్లమీద ఉండే పొట్టును తీసేసి, పాలిష్ పట్టి, తెల్లటి బియ్యాన్ని బయటికి తీసుకొస్తాయి. ఆ బియ్యాన్ని ఉడికించితే మనం తినే మల్లెపువ్వు లాంటి అన్నం తయారవుతుంది" వివరించాడు మామయ్య.

ట్రాక్టరు వీళ్ల ముందుగా ఎడమవైపుకి తిరిగింది. ట్రాలీలో బస్తాలమీద కూర్చున్న వాళ్ళు ఒక్క పెట్టున అరిచారు- "ఓయ్! మెల్లగా! మెల్లగా తిరుగొరే, డ్రైవరూ!" అని. అదే సమయానికి ట్రాక్టరులో కూర్చున్న రైతూ అరిచాడు ఇంకా గట్టిగా- "ఓయ్! జాగ్రత్తగా పట్టుకొని కూర్చోండిరా నాయనా! పైనున్న వాళ్ళంతా అసలే అన్నం తినే నా కొడుకులు!" అని. ట్రాక్టర్లో వాళ్లంతా నవ్వారు. ట్రాక్టరు మలుపు తిరిగి రైసుమిల్లువైపుగా పోయింది.

" 'అన్నం‌ తినే నా కొడుకులు' అంటే ఏంటి మామయ్యా?" అడిగింది చిట్టి.

ఏం చెప్పాలో తెలీక మామయ్య నీళ్ళు నమిలాడు- "అది..అదేదో తిట్టు, పాపా" అన్నాడు తడబడుతూ.

వీళ్ళ పక్కనే నడుస్తూ వస్తున్న తాత ఒకడు అది విని గట్టిగా నవ్వి, చెప్పాడు- "ఏం లేదు పాపా! ఇదివరకటి కాలంలో పల్లెల్లో అందరూ రోజూ రాగి ముద్ద తినేవాళ్ళు. జొన్న అంబలి త్రాగేవాళ్ళు. సంకటి తినీ తినీ రాళ్ళలాగా గట్టిపడి, బలంగా ఉండేవి వాళ్ల శరీరాలు.

మరి ఇప్పటివాళ్ళు- ఇదిగో మీ మామయ్యలాంటి వాళ్లంతా- మల్లెపువ్వులాంటి తెల్లటి, మెత్తటి అన్నం తినేకి అలవాటు పడ్డారు. అప్పటి వాళ్ళ బలాలు లేవు ఇప్పుడు! ఇదిగో, మీ మామయ్యనే చూడు- ఎట్లా ఉన్నాడో చూశావా, నీరసంగా? ఒక్క బస్తా వడ్లు లేవనెత్తాడంటే ఎముకలు టపటపా విరిగి ఊరుకుంటాయి. అదే అంటున్నాడు, ఆ ట్రాక్టరులో పెద్దయ్య- 'వీళ్లంతా అన్నం తినే నా కొడుకులు'"- అనేసి చక్కా పోయాడు తాత.

"రాగి ముద్ద అంత మంచిదా, మామయ్యా?!" అడిగింది చిట్టి.

"అవునట, చిట్టీ. రాగుల్లో చాలా కాల్షియం ఉందట, ఐరన్ ఉందట. ఇదివరకు ఇక్కడ పల్లెల్లో అంతా రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, ఆరికెలు, ఉలవలు- ఇట్లా రకరకాల చిరుధాన్యాలు బాగా తినేవాళ్ళు. నిజంగానే వాటిలో ఉన్నన్ని పోషక తత్వాలు మనం తినే తెల్ల బియ్యంలో లేవు" నిజాయితీగా చెప్పాడు మామయ్య.

"మరైతే మనం‌ కూడా ఇప్పుడు బియ్యం మానేసి వాటినే తినచ్చుగా?" అంది చిట్టి.

"మరేఁ మాతల్లీ! నా ప్రాణం తీస్తావా, ఏం?! అవి ఏమంత రుచిగా ఉండవు తల్లో! మెత్త మెత్తగా, గట్టి గట్టిగా, ఉడికీ‌ ఉడకనట్లు- అమ్మో! తలచుకుంటేనే భయం వేస్తుంది" అన్నాడు మామయ్య తేలికగా నవ్వి.

"ఏమైనా సరే, 'మంచివంటే తినాలి' అని నువ్వే చెబుతావు కద, మామయ్యా?! ఇవన్నీ మంచివి గనక, మనం వీటిని అప్పుడప్పుడూ తింటుందాంలే, కనీసం. బలం వస్తుంది కదా, మనకే!"అంది చిట్టి.

"ఏంటో తల్లీ! ఇవాళ్ల ఈ ట్రాక్టరేదో నా ప్రాణం‌ తినేందుకే వచ్చినట్లుంది" అన్నాడు మామయ్య.

"ఇంట్లో‌ అమ్మకూడా ఒక్కోసారి రాగిముద్ద, జొన్నసంకటి చేస్తుంది మామయ్యా. అయితే అవి చేసినప్పుడల్లా నేనూ నీలాగానే 'కుయ్ కుయ్' అనేదాన్ని. నాకు తెలీదు కదా, వాటిలో‌ బలం గురించి, అందుకని అట్లా చేసేదాన్ని! మరి ఇకమీద నేను వంకలు పెట్టకుండా ఇష్టంగా తింటాను. ఇవాళ్ళ మనిద్దరి కోసం స్పెషల్‌గా రాగిముద్ద చెయ్యమందామా?" అంది చిట్టి, పెద్దదానిలాగా ముఖం‌ పెట్టి. మామయ్యకి సరే అనక తప్పలేదు.

మనం అందరమూ కూడా చిట్టి బాట పడదాం. చిరుధాన్యాల వాడకం పెంచుదాం- కేవలం బియ్యం‌ తింటే చాలదు: గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు, "ఊసురోమని మనుషులుంటే-దేశమేగతి బాగుపడునోయ్? తిండి కలిగితే కండ కలదోయ్-కండ కలవాడేను మనిషోయ్". మనం‌ బలంగా ఉంటేనే కద, దేశం బలంగా ఉండేది?! అందుకని, బాగా తిందాం! రకరకాల పదార్థాలు తిందాం!

మీరు అందరూ బలంగా పెరగాలని కోరుకుంటూ,

కొత్తపల్లి బృందం