అనగనగా ఒక ఊళ్లో రామయ్య, రాజమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఒక్కతే కూతురు గౌతమి. రామయ్య, రాజమ్మ ఇద్దరూ కైకిలికి పోయేవాళ్ళు. ఆ రోజుల్లో కూలి బాగా తక్కువ ఉండేది. ఇద్దరూ సంపాదించినా ఇల్లు అతి కష్టం మీద నడిచేది.
గౌతమి కొంచెం పెద్దదయ్యే సరికి, తోటి పిల్లలంతా బడికి పోవటం చూసి, తనూ పోతాననటం మొదలు పెట్టింది.
'కూతురికి చదువంటే ఇష్టం' అని గమనిం-చాడు రాజయ్య. అయితే డబ్బు సమస్య తీవ్రంగా ఉన్నది. ఒకవేళ ఇప్పుడు డబ్బులు కట్టి చేర్పించినా, తర్వాత తర్వాత చదివించే అవకాశం లేదు తనకు. ఒకవేళ ఎలాగో ఒకలాగా చదివించినా, ఆమెకంటే ఎక్కువ చదివిన వాడిని తెచ్చి పెళ్ళిచేయాలి. అదీ కష్టమే.
అందుకని అతను కూతురు చదువు మాన్పిం-చాడు- ఆమెను కూడా తనతో పాటు పనికి తీసుకెళ్ళాడు. అలా పని చేయగా వచ్చిన డబ్బుల్ని ఆ పాప పేరనే దాస్తూ వచ్చాడు.
అట్లా పనులు చేసుకుంటూ పెరిగింది గౌతమి కానీ ఆమె చదువులంటే ఇష్టాన్ని పోగొట్టుకోలేదు. తను పెద్దయ్యాక, సొంతగా చదివి, పదో తరగతి పరీక్షలు ప్రైవేటుగా కట్టి పాసయ్యింది! రాజయ్య తన కూతురును చూసి గర్వపడ్డాడు గానీ, అంతకు మించి ఏమీ చేయలేదు. గౌతమి తన కష్టాన్ని తనే మనసులో పెట్టుకొని ఉండి పోయింది.
కొన్ని రోజులకి రాజయ్య ఆమెకు పెళ్ళి చేశాడు. గౌతమి భర్త సురేష్ మంచివాడు. డిగ్రీ వరకు చదువుకొని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే సురేష్ గౌతమిని ఇంకా చదువుకునేందుకు ప్రోత్సహించాడు. దాంతో ఉత్సాహం వచ్చిన గౌతమి దూరవిద్యద్వారా డిగ్రీ పూర్తి చేసింది. తను కూడా సురేష్ వాళ్ల కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకున్నది.
గౌతమికి కూతురు పుట్టేసరికి, వాళ్ళు ఆర్థికంగా నిలద్రొక్కుకున్నారు. పాప వైష్ణవిని బాగా చదివించారు. 'ప్రైవేటు బళ్లలో కంటే మెరుగు' అని ఆ పాపను దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ బడిలో చేర్పించారు.
ఒకవైపున ఉద్యోగం చేస్తూనే గౌతమి, సురేష్ ఇద్దరూ ఇంకా చదివారు. త్వరలోనే ఇద్దరూ పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అలా తాము సంపాదించిన డబ్బుతో అనేకమంది పిల్లల చదువులకోసం సహాయం చేస్తున్నారు. వాళ్ల పాప వైష్ణవి కూడా తల్లిదండ్రుల స్ఫూర్తితోబాగా చదువుతున్నది!