నిండా పధ్నాలుగేళ్ళు లేవు- తెలంగాణ రాష్ట్రం-నిజామాబాద్ జిల్లా- సిరికొండ మండలం- పాకాల తాండాకు చెందిన పాప మాలావత్ పూర్ణ ఏకంగా ఎవరెస్టు శిఖరాన్నే ఎక్కేసింది! అంత ఎత్తు కెక్కిన అతి చిన్న అమ్మాయిగా ప్రపంచ రికార్డు సృష్టించింది! పట్టుదలతో సాధించలేనిదేదీ లేదని నిరూపించింది! అవకాశం, శిక్షణ లభిస్తే మనం దేన్నైనా అందుకోగలం- అనటానికి పూర్ణ నిలువెత్తు నిదర్శనం.

పూర్ణవాళ్ళ అమ్మానాన్నలు- లక్ష్మి,దేవదాస్- ఇద్దరూ వ్యవసాయ కూలీలు. వాళ్ళ అమ్మాయిని ప్రైవేటు బళ్ళలో లక్షలు కుమ్మరించి చదివించే శక్తీ-స్తోమతూ లేని పేదవాళ్ళు. పూర్ణని కూడా తాండాలో అందరిలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్చారు.

హాస్టలులో పూర్ణ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో చదువుతూ తొమ్మిదో తరగతికి వచ్చింది. ఈ క్రమంలో అధ్యాపకులు ఆ అమ్మాయికి క్రీడలలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించారు; ప్రోత్సహించారు. 'విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకూడదు-వారికి విశాల ప్రపంచాన్ని చూపించాలి' అనే సాంఘిక సంక్షేమ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తోడ్పాటు లభించేసరికి, పూర్ణకు మొదట నల్గొండ జిల్లా భోంగీర్లో ఉన్న చిన్న చిన్న కొండలు ఎక్కే కార్యక్రమంలో ప్రవేశం లభించింది. అక్కడికి వచ్చిన పిల్లల్లోంచి ఇరవై మందిని ఎంపిక చేసి, శిక్షణ నివ్వటం కోసం డార్జిలింగ్ లో ఉన్న 'హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్‌కు' పంపించారు ప్రభుత్వం వాళ్ళు.

అక్కడికి వచ్చిన పిల్లలందరితోబాటు హిమాలయాల్లో రకరకాల చిన్నా-చితకా శిఖరాలను అవలీలగా ఎక్కేసింది పూర్ణ.

కొండలు ఎక్కటంలో పూర్ణ సత్తా ఏంటో చూసిన నిర్వాహకులు ఆ పాపను ఏకంగా ఎవరెస్టు శిఖరాన్నే ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసేశారు! సముద్ర మట్టానికి 29,035 అడుగుల ఎత్తున ఉండే ఎవరెస్టు శిఖరం మీద చలి ఊహించుకుంటేనే వణికిస్తుంది: ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర ఉంటాయి! గాలిలో ఆక్సిజన్ దాదాపు ఉండదు- మనం పీల్చుకునేందుకు అవసరమైన ఆక్సిజన్‌ను మనమే మోసుకుపోవాలి! అక్కడికి ఎక్కేందుకు వేసుకునే ప్రత్యేకమైన దుస్తులే 20కిలోల వరకూ బరువుంటాయి! ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి; పైపెచ్చు అక్కడికి వెళ్ళే మార్గమంతా ప్రమాదాలతో నిండుకున్నది. గతంలో ఎంతో మంది ఆ మంచులో ఇరుక్కొని ప్రాణాలు కూడా కోల్పోయారు!

అయితే అంతులేని స్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న పూర్ణ, తనతోపాటు ఎంపికైన ఆనంద్‌కుమార్‌తో కలిసి 52రోజుల్లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. రెండు నెలల క్రితమే, మే 25న తెలంగాణ జెండాని ఎవరెస్టు శిఖరం మీద రెపరెపలాడించి, 'తలచుకుంటే దేన్నైనా సాధిస్తాం' అని చాటింది.

అనాదరణకు, నిరాసక్తతకూ గురై ఎంతో కాలంగా క్రుంగిపోతున్నై ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ బళ్ళలో పాఠాలు చెప్పే అధ్యాపకులు కూడా తమ పిల్లల్ని ప్రైవేటు బళ్ళలో చదివించే దుస్థితి ఉన్నది. అలాంటి వాతావరణంలో పూర్ణ సాధించిన ఈ విజయం మన వారసత్వ సంపదలో జీవం ఇంకా మిగిలే ఉందని అందరికీ చాటుతున్నది. అవకాశాలు కల్పించి, ప్రోత్సహిస్తే ప్రభుత్వ బడులు నిజంగా అద్భుతాలనే సృష్టించగలవు.

ఎవరెస్టు శిఖరాన్ని అట్లా ఆడుతూ పాడుతూ ఎక్కేసిన అతి చిన్న అమ్మాయి పూర్ణ- మనందరికీ నిజంగా స్ఫూర్తి దాత. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో మనందరం కనీసం నెలకొక్క కొండైనా ఎక్కుదాం, సరేనా? బయలుదేరండి మరి!