'పెద్దల దగ్గరికి పోదాం! వెనక్కి తగ్గేది లేదు! ఈ రాత్రి గడవనియ్యి. తెల్లారగానే పోదాం!" అని, మిగిలిన రాత్రిని ఏదో ఒక విధంగా గడిపింది కపింజలం.
తెల్లవారగానే అది కుందేలును నిద్రలేపి, 'పద, పోదాం- మన తగవులను తీర్చే పెద్దల దగ్గరికి! నీకు ఎవరి మాటంటే నమ్మకం?" అని అడిగింది.
"నర్మదా నదీ తీరంలో 'దధికర్ణుడు' అనే పిల్లిరాజు ఒకడున్నాడు. అతను వయసులో పెద్దవాడు, లోకపు తీరు తెన్నులు, వ్యవహార సరళి తెలిసిన వాడు, శాంతమూర్తి, ధార్మికుడున్నూ. మన తగవును తీర్చగల-వాడు అతనే!" అన్నది కుందేలు.
'అవును కాబోలు' అనుకున్న కపింజలం 'సరే'నన్నది. అలా కుందేలు, పిట్ట పోయి పోయి మధ్యాహ్నానికి దధికర్ణం ఉండే చోటును చేరుకున్నాయి. అయ్యో! పోయేకాలం దాపురించినప్పుడు, తలలు తెగిపడాల్సిన చోటు ఎంతదూరం అయినా సరే, కాళ్లు శరీరాన్ని అక్కడికే ఈడ్చుకుపోతాయి గదా!
అట్లా ఆ దీర్ఘకర్ణం, కపింజలం రెండూ నర్మదానది ఒడ్డుకు నడిచిపోయినై. అక్కడ తపస్సు చేసుకుంటున్నట్లు కూర్చున్న ముసలి పిల్లిని చూసి, 'అది వట్టి కపట ధార్మికుడు' అని, 'కేవలం కడుపు నింపుకునేందుకే దాని వేషం అంతా' అని తెలుసుకోలేక-పోయినాయవి.
అయినా, దూరంగానే నిలబడి- "స్వామీ! ఓ పిల్లిరాజా! మాలో మాకు స్థల వివాదం ఒకటి మొదలైంది- ధర్మ స్వరూపులైన తమరి సన్నిధిలో మా సమస్యకు పరిష్కారం లభిస్తుందని చాలా ఆశతో, ఎంతోదూరం నుండీ వచ్చాం. ఊరికే నిలబడనివ్వక, త్వరత్వరగా మా పోట్లాటను తీర్చి, మమ్మల్ని మా నివాసాలకు పంపు" అన్నాయి.
అప్పుడా ముసలి పిల్లి తెలివిగా "అయ్యలారా! మీరేమో దూరంనుండీ చెబుతున్నారు. ముసలితనపు బరువుకు నేను చేసే చాంద్రాయణ వ్రతంకూడా తోడయ్యేసరికి, నా వినికిడి బాగా తగ్గిపోయింది. మీరేం చెబుతున్నారో నాకు సరిగా వినబడమే లేదు! మీరిద్దరూ చెరొక చెవిదగ్గరా చేరి, మీరు మీరు చెప్పదలచుకున్న అంశాలను పెద్ద గొంతుతో, స్పష్టంగా చెప్పండి.
మధ్యాహ్నం అయ్యింది- నాకుపూజా సమయం దగ్గర పడుతున్నది. పూజలు ముగించుకొని దానధర్మాలు చేసుకోవాల్సి ఉన్నది. అయినా తగవు తీర్చేవాళ్ళు ఎందరెందరో ఉన్నా కానీ, మీరు వాళ్ళను ఎవ్వరినీ కాదని, నేనేదో పక్షపాతం లేకుండా తీర్పు చెబుతానని, అంతదూరం నుండి వచ్చారు! అట్లాంటి మిమ్మల్ని ఊరికే వెనక్కి పంపించటం, మాలాంటి తపస్వులకు తగదు.
ఈ లోకంలోనే ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఎవ్వరమూ ఊగులాడం. చచ్చిపోయిన-ప్పుడు ధర్మం ఒక్కటి తప్ప, మరేవీ మన వెంట రావు. కాబట్టి అట్లాంటి ధర్మాన్ని మాత్రం, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, పోగొట్టుకోకూడదు. ఇదే సత్యం. మనం సత్యాన్ని ఎప్పుడూ తప్పకూడదు. అన్ని శుభాలకూ మూలం సత్యమే.
సత్యానికి తోడుగా మనకు భూతదయ కూడా ఉండాలి. అన్ని ధర్మాలకూ అలంకారం భూతదయే. 'తన శరీరంలో ఎక్కడైనా ముల్లు దిగితే తనకు ఎంత నొప్పి పుడుతుంది! ఇతరుల శరీరాలూ అట్లాంటివే కదా?'అని తెలుసుకొని, వివేకవంతులు ఎల్లప్పుడూ హింసకు దూరంగా ఉంటుంటారు.
కానీ దుర్మార్గులకు ఇంత లోతుగా అర్థం ఎక్కడవుతుంది?! అందుకని వాళ్ళు దయా-ధర్మాలను విడచి, కేవలం బ్రతకటంకోసం ఇతర జీవుల హింసకు పాల్పడుతుంటారు.
"తనను ఆశ్రయించిన-వాళ్ళను కాపాడటాన్ని మించిన ధర్మం లేదు' అని మన గ్రంధాలన్నీ ఘోషిస్తున్నాయి కదా.
అంతేకాదు- లోభం అనేది ఉన్నదే, దాన్ని ముందుగానే మొదలంటా మట్టుపెట్టేయాలి. మీరే చెప్పండి, ఎంత సంపాదించినా గానీ, మనం పోయేటప్పుడు లోకంలోంచి దేన్నైనా మూట గట్టుకొని పోతామా? పోము కదా! అయినా చూడు, 'ఓ దురాశా!
పాపభూయిష్టం అయిన ఈ కలికాలంలో నువ్వెంతమందిని వశపరచుకున్నావే! ఎంతమందితో ఎన్నెన్ని చెడ్డపనులు చేయిస్తున్నావే! అబ్బా! నీ మాట ఎత్తితేనే నా గుండెలు పగులుతున్నాయే!' " అంటూ చల్లని మాటలతో ధర్మోపన్యాసం చేయటం మొదలుపెట్టింది.
అది విని పిట్ట, కుందేలు రెండూ చాలా ముచ్చట పడ్డాయి. తమ పోరును దానికి మరింత చక్కగా వినిపించేందుకు అవి రెండూ పిల్లి దగ్గరికి పోయినై. దాని చెవుల్లో తమ తగవును వినిపించేందుకు వంగినై- మరుక్షణం ఆ దొంగ పిల్లి కాళ్ళతో ఆ రెండింటినీ చిక్కబట్టింది; ఒక్కసారిగా వాటి మెడలు కొరికింది; వాటిని చిత్రవధ చేసేసింది. పిట్టపోరు-కుందేలు పోరు అలా పిల్లి తీర్చింది.
చివరిక్షణంలో ఆ కుందేలు, పిట్ట రెండూ "అయ్యో! ఒక్క రాత్రికి ఎవరు పడుకుంటే ఏమిలే' అని ఊరుకోక, లేనిపోని తగవు పడటం ఏమిటి, సుఖంగా అడవిలో పడి ఉండలేక ప్రొద్దునే లేచి ఇక్కడికి పడి రావటమేమిటి, వచ్చి ఈ దుర్మార్గుడిని ఆశ్రయించటం ఏమిటి, వీడి దొంగ మాటలు విని ఇంతవరకూ తెచ్చుకోవటం ఏమిటి?!
'పోరు నష్టం- పొందు లాభం' అని పెద్దలు చెప్పే మాటలు వినలేదే! చావు మూడినప్పుడు, ఎవ్వరిమాటలూ పనికిరావు. 'తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింద'ట! రాసి పెట్టింది జరగక మానదు!" అని విచారపడుతూ ప్రాణాలు విడిచాయి.
పిల్లికి అట్లా వాటి మాంసంతో రెండు రోజులు వేరే దేన్నీ వెతుక్కోకుండా నడిచింది. కాబట్టి, తక్కువవాడిని ఊరికే అందలం ఎక్కించకూడదు" అని చెప్పింది ప్రధానమంత్రి దూరదర్శి.
అప్పుడా నెమలి రాజు చిత్రవర్ణుడు దూరదర్శిని చూసి "అవును నిజమే. మీరన్నట్లు మేఘ-వర్ణుడికి వేరే ఉపకారం ఏదైనా చేద్దాం. కానీ ముందుగా ఒక పని చేద్దాం. మనం గెల్చుకున్న ఆ కర్పూర ద్వీపానికి ఈ మేఘ వర్ణుడిని మళ్ళీ ఓసారి పంపుదాం. ఇతను వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న మంచి మంచి వస్తువులను అన్నింటినీ ఇక్కడికి తెచ్చి పెడతాడు. అట్లా తెచ్చిన అద్భుత వస్తువులలో కొన్నింటిని మన బంధువులకు, మిత్రులకు బహుమానంగా పంపుదాం. కొన్నిటిని మన తోటివారికి పంచుదాం. మిగిలినవాటిని మనం ఇష్టం వచ్చినట్లు అనుభవిద్దాం. ఆ తర్వాత మనమే ఎల్లకాలం ఇక ఎదురులేకుండా ఆ ద్వీపాన్నికూడా పరిపాలించచ్చు..!" అని సంతోషంగా ఇంకేదో చెప్పబోయింది.
అప్పుడా ప్రధాని నవ్వి, వినయంగానే "ప్రభూ! ఇంకా జరగని పనులను దలచుకొని సంతోష పడద్దని ధర్మం తెలిసినవాళ్ళు చెబుతుంటారు. ఆలోచనల పల్లకీనెక్కి ఊహల ఊరేగింపులో మైమరచేవాడు చివరికి పేలపిండి కుండను కూడా పగలగొట్టుకున్న బ్రాహ్మణుడి మాదిరి, బాధ పడతారు. మీకు ఆ కథ చెబుతాను వినండి- దేవశర్మ అనే బ్రాహ్మణుడి కథ
అయోధ్యా నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడొకడు ఉండేవాడు.
సూర్యుడు నెలకొక రాశిలో సంక్రమణం చెందుతుంటాడు కదా; అట్లా సూర్యుడు (మార్చినెలలో) సంక్రమణం చెందుతున్న సమయంలో శ్రాద్ధం పెట్టటం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. దేవశర్మకూ అలా ఓ శ్రాద్ధకర్మ చేయించేందుకు రమ్మని పిలుపు వచ్చింది.
ఆ పని చేయించినందుకుగాను వాళ్ళు అతనికి కడుపునిండా భోజనం పెట్టి, 'పేలపిండి'తో నిండిన కుండనొకదాన్ని దానంగా ఇచ్చారు.
అతనికి పేలపిండి అంటే చాలా ఇష్టం. పేలపిండి దానంతో అతని మనస్సు ఉప్పొంగిపోయింది. అలా అతను ఒక చేత్తో పేలపిండి కుండనెత్తుకొని, మరొక చేత్తో ఎక్కువగా తిన్నప్పుడు కలిగే ఆయాసంతో రొప్పుకుంటూ, పొట్ట నిమురుకుంటూ ఊరికి బయలు దేరాడు.
కొంత దూరం పోయాక అతనికి ఒక కుమ్మరి ఇల్లు కనిపించింది. ఆ ఇంటి అరుగు మీద వరసలు వరసలుగా పేర్చి పెట్టిన కుండలు ఉన్నై. వాటి ముందు కంటికి ఇంపుగా కనిపిస్తోంది, ఒకింత ఖాళీ స్థలం! దాన్ని చూడగానే అతనికి ప్రాణం లేచివచ్చినట్లయింది. గబగబా అక్కడికి వెళ్ళాడు; గచ్చుమీద తన ధోవతిని పరచాడు; తలకు చుట్టుకున్న బట్టను తీసి చుట్ట కుదురుగా చేసి ప్రక్కన పెట్టి, దానిమీద తను తెచ్చిన పేలపిండి కుండను కుదురుగా కూర్చోబెట్టాడు; కుక్కలు వగైరాలు వస్తే బెదిరించేందుకని కుడి చేతిలో ఒక కట్టెను పట్టుకున్నాడు; ఎడమ చేతిని తలక్రింద పెట్టుకున్నాడు; పంచెమీద విశ్రాంతిగా పడుకున్నాడు.
చక్కగా కళ్ళు సగం మూసుకొని, ఆలోచన మొదలు పెట్టగానే అతని ఊహలకు రెక్కలు వచ్చాయి- ఇలా అనుకున్నాడు: "ఇదిగో, ఈ సత్తుపిండిని ఇప్పుడే అమ్మను- మంచి ధర పలికినప్పుడు అమ్ముతాను...
అట్లా అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ మేకను కొంటాను. అది ఏడాదికి రెండు పిల్లల్ని పెడుతుంది. వాటికి పుట్టిన మేకలు కూడా ఒక్క సంవత్సరంలో పెద్దవైపోతాయి...
అట్లా కొన్నేళ్ళు గడిచేసరికి, అవి అనేక వేలు అవుతాయి. అప్పుడు వాటినన్నిటినీ ఒక్కసారిగా అమ్మేస్తాను. అమ్మేసి నూరు పాడి ఆవులను కొంటాను...
ఆ నూరు ఆవులూ కూడా కొన్నేళ్ళు గడిచేసరికి చాలా దూడలను యీనతాయి. అవన్నీ మందలు మందలుగా వర్థిల్లి, చివరికి మా పెరడు అంతా వాటితోటే నిండిపోతుంది...
అప్పుడు వాటితో గొప్ప వ్యవసాయం చేయిస్తాను. నా పొలాలలో పండిన పంటల్లో కొంత భాగాన్ని అమ్మి లక్షల్లో డబ్బు సంపాదిస్తాను. దానితోపాటు మరికొన్ని కోడె దూడలను కూడా అమ్మి డబ్బు కూడబెడతాను. ఆసరికి నేను ఖచ్చితంగా కోటీశ్వరుడిని అయిపోయి ఉంటాను...
తర్వాత మా ఇంట్లో ఏమూల చూసినా కుప్పలు తిప్పలుగా పడి మూలిగే డబ్బును చూసి, అందరూ 'మేం పిల్లనిస్తాం, మేం పిల్లనిస్తాం' అని నా చుట్టూ తిరిగిపోతుంటారు...
అట్లా వచ్చిన పిల్లలో అందం, చందం ఉన్న అమ్మాయిని ఒకదాన్ని నేను పెళ్ళి చేసు-కుంటాను. తర్వాత మాకు మన్మధుడిలాంటి అందమైన కొడుకు ఒకడు పుడతాడు. వాడికి మా 'సోమశర్మ' పేరే పెడతాను. తర్వాత,...
ఇంటి పనులలో సమయం చిక్కక, ఒకరోజున మా ఆవిడ కొడుకును తెచ్చి నా ముందు విడిచిపెట్టి పోతుంది- అమర్యాదగా.
అప్పుడు నేను కోపం పట్టలేక ఆమె వెనుకగా పోయి, నా చేతిలో ఉన్న ఈ కట్టెతో- ఇదిగో- ఇట్లా నాలుగు వాయిస్తాను-"
అనుకునేంతలో అతనికి నిజంగానే కొంచెం గమనం తప్పింది- నిజంగానే భార్య వచ్చి ఎదురుగా నిలబడింది అనుకున్నాడు; నిజంగానే కోపం పట్టలేకపోయాడు; నిజంగానే చేతిలో ఉన్న కట్టెతో ఆ పిండి కుండను ముక్కలు ముక్కలుగా దంచి కొట్టాడు!
అతను అట్లా కట్టెను విసిరి కొట్టేటప్పుడు ఆ దెబ్బలలో కొన్ని అక్కడ పేర్చి పెట్టిన కుండలకు తగిలాయి. అవి కూడా టపాలున పగిలాయి!
ఆ చప్పుడు విని అదిరిపడ్డ కుమ్మరివాడు లోపలినుండి పరుగెత్తుకొని వచ్చి చూసాడు. కోపం ఆపుకోలేక ఆ వెర్రి బ్రాహ్మణుడికి తనూ ఓ నాలుగు దెబ్బలు బహూకరించి;'ఇంకా ఇక్కడుంటే ఏం చేస్తాడో' అని భయపడి అతన్ని త్వరత్వరగా అక్కడినుండి తరిమేశాడు!
కాబట్టి, ఇంకా జరగని పనులను తలచుకొని ఇప్పుడే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు అంతకు ముందు ఉన్నదాన్ని చెడగొట్టు-కోవటమే కాదు; తోటివారిలో కూడా నవ్వుల పాలవుతాడు" అన్నది.
నెమలిరాజు అప్పుడు తన మంత్రిని సాదరంగా చూసి, "దీర్ఘదర్శీ! నువ్వు చెప్పింది అంతా బాగున్నది. నువ్వన్నట్లు, మేఘవర్ణుడు కర్పూర ద్వీప రాజుగా తగడని మేం కూడా అంగీకరిస్తున్నాం. అయితే మరి అక్కడ పాలకుడిగా మనవాళ్లలో ఎవర్ని నియమించచ్చో అది కూడా నువ్వే చెప్పు" అన్నది. (ఎవరు రాజవుతారో మళ్ళీ చూద్దాం...)