నలుగురు బద్ధకస్తులు ఒకసారి "విహారంగా కొండపైకి వెళ్ళొద్దాం" అనుకున్నారు. వాళ్ళుండే ఊరికి దగ్గర్లోనే అందమైన ఓ కొండ, చక్కని దట్టమైన అడవి ఉన్నాయి. అటువైపు వెళ్ళేవాళ్ళు ఆ చెట్ల నీడలో విశ్రాంతిగా పడుకోవచ్చు; అడవిలో దొరికే రకరకాల పళ్ళు తినొచ్చు!

అయితే కొండ పైకి ఎక్కటం మాత్రం పెద్ద పనే-కొండ బాగా నిటారుగా ఉంటుంది మరి. అయినా మన బద్ధకస్తులు నలుగురూ వెళ్ళేందుకే నిశ్చయించుకున్నారు. కొండపైకి ఎక్కాక చుట్టూ చూస్తే ఎంత బాగుంటుందో ఊహించుకొనే సరికి వాళ్ళ కాళ్ళు ఆగలేదు. నలుగురూ వన భోజనాలకు కావలసిన సంబారాలు తీసుకొని బయలుదేరుదా-మనుకున్నారు. అయితే 'న్యాయంగా ఉండాలి కదా, ఎవ్వరి మీదా మిగతా వాళ్ళ కంటే ఎక్కువ బరువు పడకూడదు!' అలా పనులు పంచుకుందామనుకున్నారు. ఎవ్వరూ బద్ధకంలో మిగతా వాళ్ళకు తీసిపోలేదు మరి. అందుకని పనుల పంపకం బాగా కష్టమైంది; చాలా సమయం తీసుకున్నది కూడా. ప్రతివాడూ వీలైనంత తక్కువ పని చేద్దామనుకున్నాడు! చాలా గందరగోళం తర్వాత చివరికి సర్దుబాటు జరిగింది:

"నేను పప్పు తీసుకువస్తాను" అన్నాడు మొదటివాడు.

"నేను బియ్యం!" అన్నాడు రెండోవాడు.

"నేను వంటకు కావలసిన కట్టెలు తెస్తాను!" అన్నాడు మూడోవాడు.

"మరైతే నాలుగవ వాడు వంట చేస్తాడు!" అన్నారు ముగ్గురూ.

నాలుగవవాడి కి ఎంత ఆలోచించినా సులభంగా అయ్యే వేరే పని ఏదీ మనసుకు తట్టలేదు. దాంతో వాడు అయిష్టంగానే తల ఊపాడు.

కొండ మీదికి ఎక్కే సరికి మిత్రులు నలుగురూ బాగా అలసిపోయారు. అయినా, ఓసారి ఒప్పుకున్నారు కనుక మొదటి వాళ్ళిద్దరూ బియ్యం, పప్పు తెచ్చి అక్కడ పెట్టారు. మూడోవాడు వెళ్ళి అడవిలో విరిగిన పుల్లా-పుడకా ఏరుకొచ్చారు. నాలుగోవాడు వంట చేశాడు. త్వరలోనే ఖిచిడీ సిధ్దం అయ్యింది. అకస్మాత్తుగా వాళ్ళకి గుర్తొచ్చింది. "ఖిచిడీ లోకి నెయ్యి ఏది?! ఎవ్వరూ తేలేదు!!” "నెయ్యి లేకుండా ఖిచిడీ బాగుండదు" అన్నాడు నాలుగోవాడు-"ఖిచిడీలోకి నెయ్యి ఉండాల్సిందే. నేనొక్కడినే వంటంతా చేశాను. కాబట్టి నేను వెళ్ళి నెయ్యి తేను!"

"నేనూ తెచ్చే అవకాశమే లేదు- నావంతు పని నేను ముందుగానే చేసేశాను!" అన్నారు ఒకటోవాడూ, రెండోవాడు, మూడోవాడూ - ఒకేసారి.

ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకున్నది. మిత్రులు నలుగురూ మౌనంగా కూర్చొని, ఎవరికి వాళ్లు 'తాము తేకుండా అక్కడికి నెయ్యి ఎట్లా వస్తుందో' ఆలోచిస్తూ ఉండిపోయారు.

ప్రతివాడూ- "నేనే ఎక్కువపని ఎందుకు చెయ్యాలి? వాళ్లనే తెమ్మను!" అనుకుంటూ ఉన్నాడు.

చివరికి మూడోవాడు మాట్లాడాడు: వాడు అన్నాడు- "నాకు తెల్సు. ఇక్కడ మనం అందరం నిశ్శబ్దంగా కూర్చోవటమే అన్నింటిలోకీ గొప్పపని. మనలో ఎవరైతే ముందు మాట్లాడతారో, వాళ్లు వెళ్ళి నెయ్యి తేవాలి!" అని.

మిగిలిన ముగ్గురికీ ఆ సలహా నచ్చింది. 'సరే' అన్నట్లు తల ఊపి, అందరూ ఎవరికి వాళ్లు నిశ్శబ్దంగా, కదలక- మెదలక కూర్చుండిపోయారు. ఎవరికి వాళ్లు 'నేను ముందు మాట్లాడను' అనుకుంటూ పెదాలు బిగపట్టుకుని, పులగపు కుండ చుట్టూ విగ్రహాలలాగా కూర్చొని ఉన్నారు.

అరగంట గడిచింది. అయినా నలుగురిలోనూ ఏ ఒక్కడూ నోరువిప్పలేదు. నోరు విప్పితే నెయ్యి తేవాలి గద!! అంతలో వాళ్ల వెనకే వచ్చిన కుక్క ఒకటి, అక్కడే కూర్చొని ఆశగా పులగం కుండవైపు చూస్తూనే ఉన్నది. లేచి మంటచుట్టు తిరిగి ముక్కు ఎగరవేసింది. తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయింది అది. మెల్లగా నాలుగు విగ్రహాలకేసీ మార్చి మార్చి చూస్తూ పోయి, కుండలోఉన్న పులగాన్నంతా నాకి శుభ్రంగా తినేసింది! ఆ తర్వాత మెల్లగా వెనక్కి తగ్గి, కొండదిగి ఊర్లోకి పరుగు పెట్టింది!

కుక్క రావటం, తమ కళ్లముందే పులగాన్నంతా తినెయ్యటం- దీన్నంతా మన బద్ధకస్తులు చూస్తూనే ఉన్నారు.

కానీ వాళ్లలో ఒక్కరు కూడా ధైర్యం చేసి కుక్కను అదిలించే ప్రయత్నం చెయ్యలేదు. ఎవరు అరిస్తే వాళ్లు నెయ్యి తేవాలి గద! అందుకని నలుగురూ విగ్రహాల్లాగా, తపస్సులో ఉన్న ఋషుల్లాగా నిశ్చలంగా, ఖాళీ కుండకేసే రెప్పలు ఆర్పకుండా ఊరికే చూస్తూ ఉండిపోయారు. అట్లా కొన్ని గంటలు గడిచి పోయాయి.

మెల్లగా సాయంత్రం అయ్యింది. చుట్టుతా చీకటి అలుముకోసాగింది. అంతలో, దూరంగా తమవైపే వస్తున్న మనిషి ఒకడు కనబడ్డాడు, వాళ్లకి. ఆ వచ్చింది ఒక పోలీసు. పక్క ఊళ్ళో డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగిపోతున్నాడతను.

అతన్ని చూసికూడా వీళ్లెవ్వరూకదల్లేదు. మంటమీద కుండ, చుట్టూ విగ్రహాల్లాగా వీళ్ళు- వీళ్లని చూడగానే "వీళ్లు దొంగలు" అని నిర్ధారణకు వచ్చేశాడుపోలీసు. 'వీళ్లు ఇక్కడ కూర్చొని ఏదో పథకం రచిస్తున్నారల్లే ఉంది ' అనుకున్నాడతను. అతను ఏమడిగినా, ఎన్ని సార్లు అడిగినా వీళ్లు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు తప్పిస్తే, ఏ ఒక్కడూ నోరు మెదపలేదు.

చివరికి అతను "అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని నలుగుర్నీ అరెస్టు చేస్తున్నాను- పదండి పోలీసు స్టేషనుకు" అన్నాడు. ఆశ్చర్యం! నలుగురూ ఎవరికి వాళ్ళు లేచి నిలబడ్డారు. ఏమాత్రం ప్రతిఘటించలేదు- పోలీసు వెంట స్టేషనుకుచేరుకున్నారు!

దాంతో వీళ్లంత బాగా రాటుదేలిన నేరస్థులు అని పోలీసుకు నిర్ధారణ అయిపోయింది. స్టేషంలో కూడా అతనెంత గట్టిగా అడిగినా మన బద్ధకస్తులు మటుకు నోరు విప్పలేదు. వీళ్ల అహంకారాన్నీ, దర్పాన్నీ చూసి పోలీసుకు ఒళ్లుమండింది: 'వీళ్లు తన ప్రశ్నల్ని అస్సలు పట్టించుకోవట్లేదు! తన అధికారాన్నే ధిక్కరిస్తున్నారు! వీళ్లకు గుణపాఠం చెప్పాల్సిందే!" అని అతను లాఠీతో వాళ్ళను వాయించటం మొదలుపెట్టాడు. "కనీసం దెబ్బలకైనా వీళ్లు తమ నేరాన్ని అంగీకరిస్తారు" అనుకున్నాడతను.

మొదటివాడికి రెండులాఠీ దెబ్బలు పడ్దాయి. అయినావాడు పెదవి విప్పలేదు. రెండోవాడికి పోలీసు నాలుగు దెబ్బలువేశాడు. అయినా వాడు 'కుయ్ కుయ్ 'అనలేదు. పోలీసుకు అర్థంకాలేదు.

అతను మూడోవాడినిపిలిచి ఐదు దెబ్బలు వేశాడు. లాభం లేదు. వాడూ నిశ్శబ్దంగా ఓర్చుకున్నాడు తప్పిస్తే నోరు విప్పలేదు. పోలీసుకు మతి పోయినట్లైంది. పిచ్చికోపం కూడా వచ్చింది. నాలుగోవాడిని పిల్చి, "మర్యాదగా సమాధానం చెప్పు. లేదంటే నీకు నలభై లాఠీ దెబ్బలు పడతాయి, చెప్తున్నాను" అని బెదిరించాడు.

నాలుగోవాడు అసంకల్పితంగానే ఎదురు తిరిగాడు- "ఎందుకట్లా? నాకే ఎందుకు నలభై? వాళ్లకేమో తక్కువ, నాకు ఎక్కువా?! ఎందుకట్లా?” అని అడిగేశాడు.

"పోయావు! మాట్లాడేశావు! ఇప్పుడు నెయ్యి నువ్వే తేవాలి వెళ్లి!” అని ఒకేసారి గందరగోళంగా అరవటం మొదలుపెట్టారు మిగిలిన ముగ్గురూ.

కొంతసేపటికి పోలీసుకు కథంతా అర్థమైంది. వీళ్ల బద్ధకాన్ని చూసి అతనికి పొట్ట-చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. నెయ్యి తెచ్చేందుకు బద్ధకం వేసి వాళ్లు అన్నన్ని దెబ్బలకు కూడా ఓర్చుకున్నారు!- ఈ ఆలోచనే అతనికి ఓ అద్భుతంలాగా తోచింది.

"ఒరే! ఈసారి మీరు వన భోజనాలకి వెళ్ళే ముందుగానే పనులన్నీ రాసి పెట్టుకుని సరిగ్గా పంచుకోండి. లేకపోతే మళ్ళీ ఓ సారి రోజంతా ఉపవాసం ఉండాల్సి వస్తుంది; ఆనక స్టేషలో తన్నులు తినాల్సి వస్తుంది. పోలీసుల్లో అందరూ నా అంత మంచివాళ్లు ఉండరు; నేపాల్ లో ఎవరూ మీ అంత బద్ధకస్తులూ ఉండరు!" అన్నాడు అతను, వాళ్లను విడిచిపెడుతూ!