మంచితనానికి మారుపేరు, విజయపురి జమీందారు రాజయ్య చౌదరి గారు. . ఆయన భార్య అంజలి అన్ని విధాలా ఆయనకు తగినది- జమీందారుగారు వ్యవసాయం గురించి చూస్తే, ఆమె గ్రామంలోని ఆడవాళ్లను అన్ని విధాలా ప్రోత్సహించేది; అందరికీ అండగా, తలలో నాలుకలా ఉండేది. గ్రామప్రజలంతా వాళ్ళిద్దరినీ ఎంతగానో గౌరవించేవాళ్లు.
అంత చక్కని జమీందారు దంపతులది ఒక్కటే సమస్య. వారి కూతురు రాగమంజరి ప్రవర్తన వారికి పూర్తిగా భిన్నంగా, అతి దురుసుగా, అధర్మంగా ఉండటమే దానికి కారణం.
'రాగమంజరికి చాలా పొగరు' అని ఊరంతా అనుకునేవారు. నిజంగా కూడా 'జమీందార్లం' అన్న గర్వం ఆమె నరనరాల్లో నిండి ఉండేది; పేదవాళ్లంటే చాలా చులకన భావం ఉండేది; చిన్నా-పెద్దా లేకుండా ఎవరితోటైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించేది- అయినా జమీందారుగారి బిడ్డ కనుక ఎవ్వరూ ఆమెను ఏమీ అనలేకపోయేవారు. ఇప్పుడు, ఏడో తరగతికి వచ్చేసరికి, ఆమె మరీ మొండిగా కూడా తయారయింది.
చిన్నది అన్న ఉద్దేశంతో కాబోలు, చౌదరిగారు మొదట్లో ఆ పాపను బాగా ముద్దుచేశారు. దాంతో బడిలో పిల్లలనేకాదు ఉఫాధ్యా-యులనుకూడా ఎంత మాట పడితే అంత మాట అనేయటం నేర్చుకున్నది రాగమంజరి.
రెండు రోజులకు ఒకసారి ఖరీదైన బట్టలు, వస్తువులు కావాలని మారాం చేసేది తను. అందరిముందూ తన గొప్పతనాన్ని చూపించాలనుకుని, ఇంకా చిన్నబోయేది.
ఆ అమ్మాయి బడికి వెళ్ళాలంటే గుర్రపు బండి ఉండాల్సిందే. స్కూలుముందు బండి ఆగిన వెంతనే బండి నడిపే సీతయ్య తాత ఆమె పుస్తకాల సంచీని తీసుకెళ్ళి తరగతి గదిలో పెట్టేవాడు. అలా పెట్టకపోతే ఆమె ఊరుకునేది కాదు.
అట్లాగే , ఆమె క్లాసులోకి వెళ్లేటప్పుడు ఎవ్వరూ ఆమెకు ఎదురురాకూడదు. తెలియక ఎవరైనా ఎదురొస్తే నానా మాటలూ అనేది వాళ్లను. చివరికి "ఈ స్కూలంతా అసలు మాదే. మా తాతగారు కట్టించారు దీన్ని!"అని తల ఎగరేసేది.
"ఎందుకు రాగమంజరీ! అలా అంటావు, తప్పుకదా?!" అని ఉపాధ్యాయులెవరైనా మందలిస్తే ఆ అమ్మాయి వాళ్లను గుడ్లురిమి చూసేది.
ఎప్పుడైనా తల్లి ఆమెకు ఏదైనా మంచి చెప్పబోతే, ఈ పాప తిరగబడేది: "మీ లాగా అందరితోటీ రాసుకు పూసుకు తిరగడం నాకు ఇష్టం లేదు. నేను గొప్పగా పుట్టాను; గొప్పగానే పెరుగుతాను. మీరు ఎన్ని చెప్పినా అంతే!" అంటూ ఎదిరించి మాట్లాడేది.
"తప్పు తల్లీ! అలా అనకూడదు. డబ్బు శాశ్వతంకాదు. మంచితనంతో ఈ ప్రపంచాన్నే గెలవచ్చు" అని తల్లి, తండ్రి ఎంత చెప్పినా ఆమె వినేది కాదు.
ఒకరోజున రాగమంజరి బడికి బయలు దేరింది. మధ్య దారిలో ఉండగా ఆ పాపకు గుర్తొచ్చింది- 'ఇవాళ్ల తను పెన్ను తెచ్చుకోలేదు'! వెంటనే ఆమె బండి నడిపే సీతయ్యతో "సీతయ్యా! ఇక్కడ బండిని ఆపు. వెనక్కి వెళ్ళి, నాకోసం ఒక పెన్ను కొనుక్కురా" అని ఆజ్ఞాపించింది.
ఆ సమయానికి వాన జోరుగా పడుతోంది. బండిని వదిలి వెళ్తే సీతయ్య తడిసి ముద్దయి పోతాడు. అయినా రాగమంజరి సీతయ్యలాంటి పనివాళ్ల కష్టం-సుఖం పట్టించుకునే పిల్ల కాదు.
ఆ పాప ఆదేశం ప్రకారమే సీతయ్య బండిని బాటకు పక్కగా ఆపి, పెన్ను కొనుక్కురావడానికి పరుగెత్తాడు. ఇంతలోనే ఎక్కడి నుండో పెద్ద డప్పు శబ్దం వినబడ్డది. అది వినగానే గుర్రం బెదిరి, ఇష్టం వచ్చినట్లు పరుగుతీసింది. దాని వెనకే సీతయ్య ఎంత పరుగుతీసినా దాన్ని అందుకోలేక పోయాడు. సమయానికి పక్కన పొలాల్లో పనిచేస్తున్న కూలీలు పరుగున వచ్చారు. నానా తంటాలుపడి చివరికి గుర్రాన్ని ఆపగలిగారు. ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితేనేమి, బండి ఒక్కసారిగా ఆగేసరికి, అందులో ఉన్న రాగమంజరి కింద బురదలో జారి పడబోయింది. తటాలున ఆ పాప పడిపోకుండా పట్టుకున్నారు కొందరు కూలివాళ్లు. ఆ సమయంలో, మరి వాళ్ళ చేతుల మట్టి రాగమంజరి బట్టలకు అంటింది- అంతే! ఆ అమ్మాయి కోపం కట్టలు తెంచుకున్నది! తనను ముట్టుకున్న కూలి వాళ్ల మీద మండిపడ్డది. వాళ్లను నోటికి వచ్చినట్టు తిట్టింది! పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్లు, వాళ్లంతా తప్పు చేసిన వాళ్లలాగా తలలు వంచుకుని, చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది!
సంగతి తెలిసిన జమీందారుగారు తటాలున అక్కడకు చేరుకున్నారు. ఆయన చేరుకునే సమయానికి రాగమంజరి వాళ్లను ఇంకా తిట్టిపోస్తూనే ఉన్నది. ఆ అమ్మాయి మాటలు చూసి జమీందారుగారే అవాక్కయ్యారు.
తమ బిడ్డకు మర్యాదలు తెలియవని ఆయనకు తెలుసు; కానీ మరీ ఇంత నిస్సిగ్గుగా మాట్లాడగలదని ఆయన కలలో కూడా అనుకోలేదు. వెంటనే ఆయన ఆమెను మందలించి, వాళ్ళకు ధన్యవాదాలు చెబుతూ క్షమాపణ కోరాడు.
జమీందారుగారి హృదయాన్ని అర్థం చేసుకొని వాళ్లు కూడా ఆయనకు చేతులెత్తి దండం పెట్టారు. అయితే ఇంటికొచ్చాక, ఇక ఆరోజు రాగమంజరి అలిగి అన్నం తినడం మానేసింది. తల్లి ఎంత బతిమాలినా వినలేదు!
ఇక ఆనాటినుండి బడిలోనూ, బయటా కూడా అందరూ ఆ అమ్మాయిని వెలి వేసినట్లు అయిపోయింది. ఆ పాప కనిపిస్తే చాలు- ఊళ్ళో వాళ్లంతా ఎవరికి వాళ్ళు తప్పుకొని పోసాగారు.
రాగమంజరి దీన్ని గుర్తించిందో లేదో తెలీదు. గుర్తించినా మరి పట్టించుకోలేదేమో; పట్టించుకున్నా అలా పట్టించుకున్నట్లు తెలియనివ్వలేదో, మరి!
రాగమంజరి చదివే తరగతిలోనే సుమతి కూడా చదువుతుంది. సుమతి చాలా పేద పిల్ల. ఆమె తండ్రి పాలేరు. ఆ అమ్మాయికి పాపం సరైన దుస్తులు కూడా ఉండేవి కావు. అయినా ఆ పాప ప్రవర్తనను చూసి అందరూ ఆమెను ఇష్ట పడేవాళ్ళు. ఒక్క రాగమంజరికికి తప్ప, బళ్ళో ఉన్న పిల్లలకు-టీచర్లకు అందరికీ సుమతి అంటే చాలా ఇష్టం ఉండేది. అందరూ ఆమెకు ఏదో ఒక సాయం చేసేవాళ్ళు. కొందరు దుస్తులిచ్చేవాళ్ళు; కొందరు పుస్తకాలు; ఇలా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తుండేవాళ్ళు.
పేదవాళ్ళని భరించలేని రాగమంజరి ఏనాడూ సుమతి వైపు చూడటానికి కూడా ఇష్టపడేది కాదు. తరగతి గదిలో తను ఒక్కతే ముందు బెంచీలో కూర్చొనేది. పేద పిల్లలంతా ఆమెకు దూరంగా, వెనక బెంచీలలో కూర్చునేవాళ్ళు. అయినా తెలివికి పేదరికం, కులం అడ్డు రావుగా? చదువులోనూ, ఆటపాటల్లోనూ సుమతే అందరి కంటే ముందుండేది.
ఇలా ఊళ్ళోవాళ్ళంతా రాగమంజరిని దూరం ఉంచే సమయానికే సరిగ్గా యూనిట్ పరీక్షలు మొదలయ్యాయి. రాగమంజరికి ఒంట్లో నలతగా ఉంది. అయినా మొండిగా పరీక్షలు రాసేందుకు వచ్చింది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉదయం పరీక్షలు రాయగానే అందరూ బయట చదువుల్లోను ఆటల్లోను పడ్డారు. మధ్యాహ్నం తర్వాత మరో పరీక్ష ఉంది.
ఆనాడు తను తెచ్చుకున్న అన్నం తిని, ఉత్సాహంగా లోపలికి వచ్చిన సుమతి ఒక్కసారిగా ఉలిక్కి పడింది: రాగమంజరి తరగతి గదిలో అపస్మారకంగా పడి ఉన్నది! చలి పుడుతున్నట్లుంది, వణుకుతోంది!
సుమతి పెద్దగా అరిచి పిలిచింది అందరినీ. కొందరు పిల్లలు వచ్చి చూశారు; కానీ ఎవరికి వాళ్ళు తలుపు దగ్గరే నిలబడి పోయారు. రాగమంజరి దగ్గరికి వచ్చేందుకు అందరికీ సంకోచం..!
ఇక లాభం లేదని, సుమతి తానే ఆ పాపను లేవనెత్తి బెంచీమీద పడుకోబెట్టింది. పరుగున వెళ్ళి తమ ఇంట్లోంచే ఒక బొంత తీసుకొచ్చింది- రాగమంజరిమీద కప్పింది.
కబురు జమీందారు గారికి అందింది. ఆయన కంగారుగా వచ్చేసరికి సుమతి రాగమంజరి పాదాలను రుద్దుతోంది. మిగిలిన పిల్లలు, టీచర్లు అందరూ దూరం దూరంగా నిలబడి ఉన్నారు- భయం భయంగా చూస్తూ!
జమీందారుగారు బిడ్డను తీసుకొని నేరుగా ఆసుపత్రికి వెళ్ళారు. మూడురోజుల పాటు రాగమంజరి ఈ లోకంలో లేదు: ఏదేదో కలవరించింది.
తనకి జ్వరం రావటం, బడిలో పడిపోవటం, ఎవ్వరూ తన దగ్గరికి రాకపోవటం, సుమతి అందరినీ పిలవటం, తనకు రగ్గు కప్పటం, కాళ్ళు రుద్దటం ఇవన్నీ ఆమెను వద్దన్నా వెంటాడాయి. సుమతి మంచితనం ఆమె మనసును తట్టి లేపింది.
జ్వరం తగ్గే సరికి రాగమంజరి చాలా మారిపోయింది. తనలో ఉన్న గర్వం, అహంభావం అన్నీ తొలగిపోయాయి. సుమతి చేసిన సహాయం ఆమెకు కనువిప్పు కలిగించింది.
తన ఆరోగ్యంకాస్త కుదుటపడగానే బడికెళ్ళి సుమతి చేతులు పట్టుకొని "సుమతీ, నువ్వు చాలా మంచిదానివి; తెలివైనదానివి కూడా. చాలా సార్లు నేను నిన్ను అవమానించాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా ఆపదలో ఉన్న నాకు సాయం చేశావు నువ్వు.
నువ్వెంత మంచిదానివో నాకు అర్థమైంది. నా తప్పు కూడా నాకు తెలిసి వచ్చింది. ఇక మీదట అందరితోటీ మర్యాదగా ప్రవర్తిస్తాను; స్నేహంగా ఉంటాను. నన్ను క్షమించండి" అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న రాగమంజరిని చూసి అక్కడివాళ్లు తమ చెవులను తామే నమ్మలేకపోయారు. అటుపైన నిజంగానే రాగమంజరి అందరికీ ఇష్టం అయ్యింది. "జమీందారుగారి అమ్మాయి, ఎంత మంచిది!” అనిపించుకున్నది.