అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ బద్ధకస్తులు. ఆ పల్లెలో పక్క పక్క ఇళ్ళల్లో ఒక ఆవు, కోడిపుంజు చాలా స్నేహంగా ఉండేవి. ఈ పల్లె వాళ్ళకి వాటికి మేత వేయడానికి కూడా బద్ధకం.

అయినా కోడిపుంజు రోజూ పొద్దున్నే సమయానికి కూసి మనుషులను నిద్ర లేపేది. ఆవు చాలా చాలా పాలు ఇచ్చేది. అవి రెండూ ఒకచోట చేరినప్పుడల్లా 'ఎందుకు, ఈ ఊరి వాళ్ళు ఇంత బద్ధకంగా ఉన్నారు?' అని బాధ పడేవి.

ఆ రెండు ఇళ్ళ మధ్య ఉన్న చింతచెట్టు కింద కూర్చుని తాళ్ళు పేనుకునే తాత "మా కాలంలో మేము ఎంత పని చేసే వాళ్ళం?! మీరు గొంతు పోయేట్లు కూసినా ఇప్పటి ఈ జనాలు లేవరు; లేచినా పనులు చేయరు. ఆవులు పాలు ఇస్తున్నాయి కాబట్టి వీళ్ళకి కడుపు నిండుతోంది. ఇంకెందుకు పనిచేస్తారు వీళ్ళు?!" అంటూ ఆవునీ, కోడినీ చూస్తూ ఎప్పుడూ గొణుక్కుంటూ ఉండేవాడు.

"మనం మనుషులకి సహాయం చేస్తున్నాం కాని వాళ్ళు మనకు సహాయం చేయడం లేదు" అంది ఒకరోజు కోడిపుంజు ఆవుతో. "ఔను. వాళ్ళు కనీసం మనకు మేత కూడా వెయ్యడం లేదు. మనమే మన తిండి వెతుక్కుని తింటున్నాం" అంది ఆవు బాధగా.

"వీళ్ళకు బుద్ధి వచ్చేట్లు చేయాలి. నేను మా వాళ్ళందరికీ కూయడం ఆపేయమని చెప్తాను. నువ్వు మీ వాళ్ళందరికీ పాలు ఇవ్వడం ఆపేయమని చెప్పు" అంది కోడిపుంజు.

"సరే" అని ఆవు ఒప్పుకుంది.

ఆ తర్వాతి రోజు నుంచీ ఊళ్ళో ఉన్న కోళ్ళన్నీ కూయడం మానేశాయి. ఆవులన్నీ పాలు ఇవ్వడం మానేశాయి. దానితో అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఏమయిందో తెలుసుకోవాలని అందరూ ఒకచోట చేరారు. "ఏమయింది? ఎందుకని మన ఆవులు పాలు ఇవ్వడం లేదు?" అని ఒకరు అడిగారు.

"అయ్యో! ఆవులేనా, కోళ్ళు కూడా గుడ్లు ఇవ్వడం లేదు. అసలు పొద్దున్నే కూయడానికి కూడా వాటికి చాలా బద్ధకంగా ఉంది!" అన్నారు మరొకరు.

"అంటే వాటికి కూడా మన బద్ధకం రోగం అంటుకుందన్నమాట! ఇప్పటికైనా ముందు మనం మన రోగం వదిలించుకొని, పనులు చేసుకుందాం. వాటికింత దాణా వేసి చూద్దాం- అప్పుడైనా అవి పాలూ, గుడ్లూ ఇస్తాయేమో!" అన్నాడు తాత, మంచంలో నుండి . తాత మాటలకి అందరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఆరోజు నుండీ వాళ్ళు కష్టపడి పనులు చేసుకోసాగారు. ఆవులకీ, కోళ్ళకీ మేత వేయడం మొదలు పెట్టారు. వాళ్లలో మార్పుని చూసిన తాత సంతోషపడ్డాడు. తర్వాతి రోజునుండీ ఎప్పటికంటే ఎక్కువ పాలని ఇస్తున్న ఆవులనీ, ఇంకా పెందరాళే కూస్తున్న పుంజులనీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

"మీకు బుద్ధి రావాలనే ఈ మూగ జంతువులు ఇలా చేసి ఉంటాయి!" అన్న తాత మాటలు విని, ఆ ఊరి జనం బద్ధకాన్ని పూర్తిగా వదిలించుకున్నారు.