సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్‌కు నిద్ర పట్టట్లేదు-
తను ఈమధ్యే కొత్తగా దక్షిణ భారతదేశం వెళ్ళొచ్చాడు. అక్కడ వరంగల్లులో కాకతీయుల్ని ఓడించి, వాళ్లదగ్గరున్న సంపదనంతా తీసుకొచ్చాడు ఢిల్లీకి. ఆ మధ్య దారిలో, ఔరంగాబాదు దగ్గర చూశాడో ఊరు- "..ఎంత బాగుందో చెప్పలేం! చక్కని కొండ! కోటకు బలే అనువైన కొండ, చుట్టూ అంతులేని మైదానం! బలే ముచ్చటగా ఉండిందది. 'దేవగిరి' అంటారట, దాన్ని. తనైతే దాన్ని 'దౌలతాబాద్' అంటాడు.."

వెనక్కి వచ్చాక తన వజీర్లని అడిగాడు. వాళ్ళు కూడా అవునన్నారు- "ఎప్పుడైనా దేశ రాజధాని అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. దేశం మధ్యలో ఉంటే అందరికీ అనువు. ఇట్లా ఢిల్లీలాగా ఓ మూలకి విసిరేసినట్లు ఉండకూడదు- రాజధాని.." మహమ్మద్ బిన్ తుగ్లక్ చురుకైనవాడు; పట్టుదల గలవాడు; యువకుడు; అనేక శాస్త్రాలు చదివాడు కూడాను. అందుకని తను సుల్తాను అవ్వగానే దౌలతాబాదు మీద మనసు పెట్టాడు. అక్కడో కోట, కోట చుట్టూ కందకం, రాజ మందిరాలు, కార్యాలయాలు,.. ఇంకా ఏవేవో నిర్మాణాలు చేశాడు; లక్షల దీనారాలు ఖర్చు పెట్టాడు. అదంతా చేశాక, ప్రకటించేశాడు: ఇకమీద భారతదేశపు రాజధాని ఢిల్లీకాదు- దౌలతాబాదు: ఢిల్లీలో ఉన్నవాళ్లంతా పదండి! చలో దౌలతాబాద్!" అన్నాడు.

అయితే జనాలెవ్వరూ ఢిల్లీనుండి కదల్లేదు. ఉద్యోగులూ కదల్లేదు!

"1400 కిలోమీటర్లు- చాలా దూరం!" అన్నారు కొందరు.

"మేం రాం! ఇక్కడే ఉంటాం!‌ మీరు పొండి, కావాలంటే!" అన్నారు కొందరు.

"ముసలివాళ్ళం బాబు.." అన్నారు కొందరు.

"పశువులున్నై, బాబ్బాబు.." అన్నారు కొందరు.

"సన్న పిల్లలం, మమ్మల్ని వదిలెయ్యండి!" అన్నారు ఇంకొందరు.

"అక్కడ నీళ్ళు లేవటనే?!" అనుమానపడ్డారు కొందరు ప్రగతి నిరోధకులు-
ఇట్లా ఎవరికి తోచినట్లు వాళ్ళు అడ్డం దిడ్డంగా జవాబులిస్తున్నారు తప్పిస్తే, ఎవ్వరూ కదలట్లేదు.

దాంతో తుగ్లక్ గారికి చాలా కోపం‌ వచ్చేసింది-

"కదుల్తారా, లేదా?! లేక మమ్మల్నే కదిలించమంటారా?" అని హుంకరించారు. 'నవాబు తల్చుకుంటే నాట్యానికేం కొదవ?'- సైనికులు ముందుకు దూకి జనాలని తైతక్కలాడించేశారు. జనాల్ని ఇళ్ళలోంచి లాగి పడేశారు. సామాన్లు గిరాటు వేశారు. బళ్ళు కట్టించి సామానెత్తారు. అంతటా హాహా కారాలు. వీళ్ళనుండి తప్పించుకొని వేరే ఏవో ఊళ్ళకు పారిపోయారు కొందరు. 'తప్పదులే' అని కట్టుబట్టల్తో దౌలతాబాదుకు పయనమయ్యారు కొందరు. మధ్యలో రోగాలు, కరువులు, వానలు-ఎండలు, లూటీలు... ఇలా గడిచినై, రెండేళ్ళు.

తీరా దౌలతాబాదుకు చేరినవాళ్ళు చూస్తే అక్కడ ఏమున్నాయ్? -ఏమీ లేవు! ఇంతమంది జనాలు ఉండేందుకు చోటూ లేదు; అందరూ తినేందుకు తిండీలేదు; కనీసం అందరికీ సరిపడా నీళ్ళూ లేవు! మరింత గందరగోళం చెలరేగింది. ఈ మధ్య కాలంలో అటు ఢిల్లీ 'భూతాల నగరం' అయిపోయింది- ఇక్కడ దౌలతాబాదులో‌ బ్రతికేట్లు లేదు పరిస్థితి! జనాల పరిస్థితి 'రెంటికీ చెడ్డ రేవడి' అయిపోయింది.

ప్రయోగాలు చేసేవాడికి వాస్తవిక దృష్టి ఉండాలి. తుగ్లక్ గారి దృష్టి అలాంటిదే- రెండేళ్ళు గడిచేసరికి ఆయనకు అర్థం అయ్యింది: దేవగిరి దేశరాజధానిగా పనికిరాదు. 'ఇక్కడ బాలేదు - రాజధానిని మళ్ళీ ఢిల్లీకి మార్చేశాం" అనేశారు. "అందరూ ఢిల్లీ బయలుదేరండి! చలో ఢిల్లీ!‌ పీఛే ముడ్!" అన్నారు!

"అయ్యో!" "అమ్మో!" "మేం రాలేం" "ఇక్కడే ఉంటాం" "బానే ఉందిలే ఇక్కడ!" "అక్కడ ఉందంతా నాశనం అయిపోయింది; ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎలా బ్రతుక్కోవాలి?"- ఇలా అన్నీ‌ మళ్ళీ మొదలయ్యాయి. అయినా తుగ్లక్‌ చాలా గట్టి ప్రభువు. ఆయన ఏదైనా ఒకసారి నిర్ణయించాడంటే, ఇక దాన్ని వెనక్కి తీసుకోనే తీసుకోడు. రాజధాని తిరిగి ఢిల్లీకి మారింది.

"ప్రయోగాలు చేస్తూ పరిపాలించాలి " అని నమ్మి, నిబద్ధతతో ప్రయోగాలు చేసిన ప్రభువుల్లో మొదటివాడు, ముహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన దేశ రాజధానినే కాదు, దేశపు నాణాలనూ మార్చాడు. కొత్తగా రాగి-ఇత్తడి నాణాలను అమలులోకి తెచ్చింది ఈయనే! జనాలెవ్వరూ వాటిని వాడకపోయేసరికి, ఈయన బంగారు-వెండి నాణాలను జప్తు చేయటం మొదలు పెట్టాడు. దాంతో తప్పనిసరై, జనాలు బంగారం-వెండివి దాచేసుకుని, సొంత తెలివితో రాగి నాణాల్ని ఎవరికి వాళ్ళు ముద్రించుకొని చలామణి చేసుకోవటం మొదలు పెట్టారు! దాంతో తుగ్లక్ ప్రభువు నాలుక కరచుకొని, "రాగి-ఇత్తడి నాణాల్ని వెనక్కి ఇచ్చేయండి; వాటికి సరిపడ బంగారు-వెండి నాణాలు తీసుకోండి" అని ఓ కొత్త పథకం పెట్టారు. 'ఇదే సందు' అని జనాలు తాము ముద్రించిన రాగి నాణాలుకూడా ఇచ్చేసి, కావలసినన్ని బంగారు నాణాలు తీసుకున్నారు! వెరసి, తుగ్లక్ ప్రభువులవారి ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది! అయితేనేమి, ప్రయోగాలు చేస్తుంటేనే కద, సంచలనం! ఆయనకి పేరు వచ్చిందీ వాటి వల్లనే, మరి!

మనం కూడా అనేక ప్రయోగాలు చేస్తుంటాం- కొత్త నిర్ణయాలు తీసుకుంటాం; అవి సరిగ్గా లేవనుకున్నప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటాం. అయితే పాలకుల నిర్ణయాలు ఊరికే కాదు- ఎంతోమంది సాధారణ ప్రజల జీవితాలని ప్రభావితం చేస్తాయవి. అందువల్ల పాలకుడన్నవాడు బాగా ఆలోచించాలి - విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలలో స్వార్థమూ, తొందరపాటుతనమూ కాక; వివేకమూ, 'అందరూ సుఖంగా ఉండాలి' అన్న భావనా ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. ఏమంటారు?