అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా కప్పలుండేవి. అవన్నీ ఒకరోజున అనుకున్నాయి- "ఈ చెరువుకు ఒక రాజు ఉంటే ఎంత బాగుంటుంది?!" అని. అట్లా అనుకొని, అవన్నీ దేవుడిని ప్రార్థించాయి: "మాకో రాజుని ఇవ్వు దేవుడా" అని.

"కప్పలన్నీ బాగా ఆడుకునేందుకు బాగుంటుంది కదా" అని, దేవుడు ఒక దుంగని చెరువులోకి విసిరేసి "మీ రాజు ఈయనే" అన్నాడు. కప్పలన్నీ దుంగరాజు మీదికి గెంతి, తైతక్కలాడాయి. దుంగరాజు కదల్లేదు; మెదల్లేదు. కప్పలన్నిటినీ చక్కగా ఆడుకోనిచ్చాడు.
అయితే దుంగరాజు వల్ల కప్పలకి సంతోషం కలగలేదు- " ఈ మహరాజు వట్టి మొద్దులా ఉన్నాడు- ఈయన ఒద్దు మనకు- చురుకుగా ఉండే రాజైతేనే బాగుంటుంది" అని కప్పలన్నీ మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నాయి.

"నిజంగానా?! చురుకైన రాజే కావాలా?" అడిగాడు దేవుడు.

"ఔను స్వామీ!‌ఇలా మొద్దులాగా పడి ఉండే రాజు బాలేదు" అన్నై కప్పలు.

"సరే, అయితే!మీకు కావలసింది ఇదిగో- ఇలాంటి రాజే!" అని దేవుడు ఒక కొంగని చెరువులోకి వదిలాడు. ఈ కొంగరాజు చురుకుగా కప్పలమీద పడి ఒక్కొక్క కప్పనే తినటం మొదలు పెట్టాడు. చూస్తూండగానే చెరువులోని కప్పలన్నీ తరిగిపోయాయి. మిగిలిన కప్పలన్నీ చాలా దు:ఖించాయి- 'చక్కని దుంగరాజుని ఇస్తే ఎంచక్కా సంతోషించక, ఇట్లాంటి రాజుని కొని తెచ్చుకున్నామేమి?' అని .