బళ్లో ఆటల పోటీలు జరుగుతున్నాయి. పాఠశాలలో చదివే విద్యార్థులు చాలామంది ఆ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చెన్నేకొత్తపల్లి పిల్లలు రాజు-రవి ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు కూడా పోటీలలో పాల్గొందామనుకున్నారు.

ఇద్దరూ వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు- అయితే అందులో రాజు గెలిచాడు; రవి ఓడిపోయాడు!

మామూలుగా మన స్నేహితులు గెలిస్తే మనకయితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ రాజు గెలిచినందుకు ఎందుకనో, రవికి మాత్రం సంతోషం కలగలేదు. తను ఓడిపోవటాన్ని కూడా అతను అస్సలు భరించలేకపోయాడు. ఫలితాలు ప్రకటించాక రాజు సంతోషంగా వెతికాడు రవి కోసం. రవి అక్కడ లేనే లేడు!

ఆ తర్వాత రాజు ఎంత ప్రయత్నించినా రవి వాడితో అస్సలు మాట్లాడలేదు. 'పోటీల పుణ్యమా' అని రాజు-రవిల మధ్య స్నేహం దెబ్బతిన్నది.

ఈ విషయమే చెబితే, రాజు వాళ్లమ్మ అన్నది- "చూడు రాజూ, పోటీల్లో ఈ సమస్య ఉండనే ఉన్నది- ఎవరో ఒకరు గెలుస్తుంటారు; మిగిలినవాళ్ళు చాలామంది ఓడిపోతుంటారు. దాన్ని తేలికగా తీసుకొని పోతుండటం మంచిది- గెలిచినందుకు నువ్వు గర్వపడకూడదు; ఓడినందుకు వాడూ క్రుంగిపోకూడదు. ఇప్పుడు వాడు ఎలా ప్రవర్తించినా సరే, నువ్వు మాత్రం వాడి పట్ల స్నేహంగానే ఉండు. త్వరలోనే వాడు మళ్ళీ నీ స్నేహితుడవుతాడు. సరేనా?" అని.

ఆ తర్వాత రవి కోపంతో రాజు గురించి ఎవరికి ఏం చెప్పినా, రాజు మాత్రం రవిమీద కోపం తెచ్చుకోలేదు. ఎప్పటిలాగే స్నేహంగా ఉంటూ వచ్చాడు.

అంతలో ఎండాకాలం వచ్చింది. ఒకరోజున వాళ్ల తరగతి పిల్లలందరూ బావిలో ఈతకు వెళ్ళారు. రవికి ఈత రాదు- ఆ సంగతి రాజుకు తెలుసు. మిగతా పిల్లలంతా ఈదేందుకు ఉత్సాహపడుతుంటే, రవి మటుకు బావి గట్టుమీద కూర్చుంటానన్నాడు. పిల్లలంతా వాడిని ఆ విషయం మీద ఆటపట్టించటం మొదలు పెట్టారు. చూస్తూండగానే ఎవరో వాడిని బావిలోకి నెట్టేశారు!

మరుక్షణం ఎక్కడో‌ఉన్న రాజు కూడా బావిలోకి దూకాడు. ఈతరాక నీళ్లలో మునకలు వేస్తున్న రవిని పట్టుకొని మెట్ల అంచుకు లాక్కు వచ్చాడు. అందరూ కలిసి రవిని బయటికి లాగారు. రాజు రవికి ప్రథమ చికిత్స చేయటమే కాక, దగ్గరుండి వాడిని వాళ్ల ఇంట్లో వదిలి వచ్చాడు.

రాజు-రవిల మధ్య స్నేహం మళ్ళీ చివురించింది. ఇక అటు తర్వాత ఎన్నడూ వాళ్లమధ్య కోపతాపాలు తలెత్తలేదు!