శ్రీరాం ఒకరోజున వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి సినిమాకి వెళ్ళాడు. తనకు నచ్చిన ఆ సినిమా ఊరి చివర ఉన్న సినిమా హాల్లో ఆడుతున్నది. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడుగదా, తనే సొంతగా కారు నడిపాడు శ్రీరాం.

హాలు బయట కారు పార్క్ చేసి, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, టికెట్లు కొని , ఆపైన హాలు లోపలికి వెళ్ళారు. కొంచెం సేపటికి సినిమా మొదలైంది.

సినిమా మొదలైన ఐదు నిమిషాలకి శ్రీరాం కి ఎందుకో తాళాలు గుర్తొచ్చి, జేబులు తడుముకున్నాడు. కారు తాళాలు జేబులో లేవు! వాళ్ల అమ్మని, నాన్నని అడిగాడు. 'మా దగ్గర లేవు'అని జవాబిచ్చి, మళ్ళీసినిమాలో మునిగారు వాళ్ళు.

శ్రీ రాం కంగారు పడ్డాడు. లేచి, కుర్చీల కింద, జేబులలో, తను నడిచిన దారి అంతటా వెతికి వచ్చాడు. సినిమా నడుస్తున్నది గాని, తనకు సినిమా మీద మనసు నిలవట్లేదు: "తాళాలు..తాళాలు..తాళాలు.." అని ఒకటే ఏడుస్తున్నది.

"తాళాలు దొరికాయా?" అమ్మానాన్నలు అడిగారు. "లేదు" నిరాశగా బదులిచ్చాడు శ్రీరాం.

"అయ్యో! మనం ఊరి చివర హాలుకి వచ్చాము. ఇక్కడ ట్యాక్సీలు, ఆటోలు ఏవీ దొరకవు. తిరిగి వెళ్ళడం ఎలా?" కంగారుగా అంది అమ్మ .

"కంగారు పడకండి- సినిమా చూడండి. ఇంటర్వెల్ లో వెతుకుదాం" అన్నాడు శ్రీరాం వాళ్ళ నాన్న. ఆయనకు సినిమా నచ్చింది!

"కానీ- ఎవరికైనా కారు తాళాలు దొరికాయనుకో; వాళ్ళు పోయి కారును దొంగిలిస్తే ఎలా?" అని శ్రీరాంకు అనుమానం. మాటి మాటికీ బయటకు పోతూనే ఉన్నాడు; టికెట్ కౌంటర్ దగ్గర, కారు దగ్గర వెతుకుతూనే ఉన్నాడు. ఈలోగా సినిమాకి విశ్రాంతి సమయం వచ్చింది.

ముగ్గురూ కలిసి మళ్ళీ అంతటా వెతికారు. విశ్రాంతి తర్వాత సినిమా మొదలవ్వగానే "మీరు సినిమా చూడండి- నేను బయటే ఉండి వెతుకుతుంటాను!" అంటూ అమ్మానాన్నలని హాలులోకి పంపించాడు శ్రీరాం.

తల్లి దండ్రులు సినిమాలో మునిగిపోయారు. పాపం శ్రీరాం సినిమా చూడకుండా బయటే ఇంకా వెతుకుతూ ఉన్నాడు.

సినిమా అయిపోయింది. శ్రీరాం వాళ్ళ అమ్మ-నాన్న బయటికి వస్తున్నారు. వాళ్ళ వెనకాలే వస్తున్న ఒకతను తన ప్రక్కనున్న నలుగురు స్నేహితులతోటీ‌ ఏదో అంటుంటే వినబడింది లీలగా- "అరె! ఇవి ఎవరి తాళాలు? నా జేబులోకి ఎలా వచ్చాయి?!" అని .

వాళ్ళు గభాలున వెనక్కి తిరిగి ఆ అబ్బాయిని అడిగారు- "మా తాళం కనిపించట్లేదండి- ఓసారి చూపించండి- అదేనేమో" అని. చూస్తే అది వాళ్ళ కారు తాళమే!

టికెట్ కౌంటర్ పైన శ్రీరాం తాళాలు పెట్టి మర్చిపోయాడట. శ్రీరాం వెనకనే టికెట్ కొన్న ఆ అబ్బాయి హడావుడిలో తాళాన్ని పొరపాటుగా జేబులో వేసుకున్నాడు. అదీ జరిగిన సంగతి.

శ్రీరాం వాళ్ళ అమ్మ-నాన్న ఆ అబ్బాయికి ధన్యవాదాలు చెప్పారు. ఆ అబ్బాయి వాళ్ళకి 'సారీ' చెప్పాడు. అమ్మానాన్నలు తాళాలు పట్టుకొని బయటికి వచ్చేసరికి ఇంకా తాళాలు కోసమే వెతుకుతూ ఉన్నాడు శ్రీరాం. వాళ్ల చేతిలో తాళాలు చూడగానే సంతోషంగా ఒక్క గెంతేసి తాళాలు లాక్కున్నాడు- "ఎక్కడ దొరికాయి?" అంటూ .

అమ్మా నాన్నా జరిగింది చెప్పారు.

పాపం శ్రీరాం ఆరోజు సినిమా చూడకుండానే ఇంటికి వెళ్ళాడు. 'సినిమాదేముందిలే, మళ్ళీ చూడచ్చు; కారు తాళాలు దొరికాయి అదే చాలు' అన్నాడు ఇంటికొచ్చాక మేం అడిగితే.