అనగనగా ఒక రైతు. ఆ రైతుకు ఇరవై ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పని చేసేవాడు. పంటలు బాగా పండించేవాడు. గౌరవంగా బ్రతికేవాడు.









ఆ రైతుకు ఐదుగురు కొడుకులు. వాళ్ళు ఏ పనీ చేసేవాళ్ళు కాదు. ఒట్టి బద్ధకస్తులుగా తయారయ్యారు.

కొంతకాలానికి రైతు ముసలివాడయ్యాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలంపని చేయించాలని అనుకున్నాడు.







కొడుకులను ఐదుగురినీ పిలిచి, "నేను చాలారోజులు బ్రతకను. మీ కోసం పొలంలో బంగారం దాచి ఉంచాను. నేను చనిపోయాక తీసుకోండి. గౌరవంగా బ్రతకండి" అన్నాడు.

రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి , పారలతో పొలాన్నంతా తిరగబెట్టారు. అయితే వాళ్లకు బంగారమేమీ దొరకలేదు.






బాగా నిరుత్సాహపడ్డారు వాళ్ళు. అయినా 'ఎలాగూ పొలాన్నంతా తిరగబెట్టాం కదా!' అని విత్తనాల్ని చల్లారు. విత్తనాలు మొలిచాయి. మొక్కలు బాగా పెరిగి, పంట బాగా పండింది.






అకస్మాత్తుగా అర్థమైంది వాళ్లకు: 'తండ్రి చెప్పిన బంగారం ఈ పంటే' అని. అప్పటినుండి వాళ్ళు బద్ధకాన్ని వదిలేసి, బాగా పనిచేస్తూ, గౌరవంగా బ్రతికారు!