ఒక ఊళ్ళో రంగయ్య అనే కుమ్మరి ఉండేవాడు. అతను కుండల్ని, పొయ్యిల్ని తయారు చేసేవాడు. అతని భార్య సీతమ్మ , కొడుకు రాము. సీతమ్మ ఆరవ తరగతి వరకే చదివింది. కానీ ఆమెకు లోకం తీరు తెలుసు. చాలా చురుకుగా ఉండేది. ఎలాంటి చిక్కు సమస్యనైనా సులువుగా పరిష్కరించేది.
ఒక రోజున సీతమ్మ సరుకులు కొనుక్కొని తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక పావురం పిల్లని కాకులన్నీ పొడవటం చూసింది. చిట్టి పావురం అవస్థని చూసే సరికి ఆమెకు జాలి వేసింది. కాకుల్ని అదిరించి, ఆ పావురాన్ని ఆమె ఇంటికి తెచ్చింది. అనుకోకుండా ఆనాడే రాము పుట్టినరోజు. సీతమ్మ ఇంటికి వచ్చేసరికి వాడు తల్లి తనకోసం ఏమి తెస్తుందోఅని ఎదురుచూస్తూ ఉన్నాడు. సీతమ్మ చిట్టి పావురాన్ని వాడికి ఇచ్చేసరికి వాడి ఆనందానికి మేరలేదు. త్వరలోనే వాడు దానికి స్నేహితుడు ఐపోయాడు. రోజూ బడికి వెళ్ళి రాగానే దానితో ఆడుకునేవాడు.
ఆరోజే రాము తన స్నేహితుల గుంపుకు తమ ఇంట్లో పావురం ఉందన్న సంగతిని గొప్పగా చెప్పేశాడు. వాడి స్నేహితుల్లో ఒకడు రమేష్. వాడికి 'ఇంట్లో పావురం' అనే ఆలోచన చాలా నచ్చింది- రోజూ వచ్చి పావురంతో ఆడుకొని పోసాగాడు. రాను రాను రాము కంటే వాడే పావురానికి దగ్గరయ్యాడు. ఎంత దగ్గరయ్యాడంటే, వాడి పుట్టిన రోజునాడు రాము వాడికి తన పావురాన్ని బహుమతిగా ఇచ్చాడు! అలా రాము-రమేష్ ల స్నేహం బాగా గట్టిపడింది. అంతలో అనుకోకుండా రంగయ్యకు పెద్ద జబ్బు చేసింది. ఆసుపత్రిలో చేర్పించీ ప్రయోజనం లేకపోయింది. చూస్తూండగాన్నే రంగయ్య చనిపోవటం, కుటుంబ బాధ్యత మొత్తం సీతమ్మ మీదే పడటం జరిగిపోయింది.
కుండలు తయారు చేయటం చాలా బరువుతో కూడుకున్న పని. సీతమ్మ ఒక్క క్షణం ఆలోచించింది- 'రాము చదువు మాన్పిద్దామా' అని. అయితే ఆమెకు అది ఇష్టం లేకపోయింది. రాముని బడికి పంపిస్తూ తనొక్కతే కుండలు చేయలేదు. అందుకని ఆమె కుండల తయారీని పూర్తిగా ప్రక్కన పెట్టి, ఊళ్ళో ఇళ్లలో పనిమనిషిగా చేరి ఒక్కతే సంసారాన్ని లాక్కురావటం మొదలుపెట్టింది.
ఈ సంగతి తెల్సిన రమేష్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. వాళ్ళకు ఊళ్ళోఒక చిన్న బట్టల దుకాణం ఉంది. ఎలాగైనా సీతమ్మ తన కాళ్లమీద తను నిలబడేట్లు చేయాలని అనుకున్నారు వాళ్ళు. ఒకనాడు రాము వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు "రామూ! మీ అమ్మ ఇప్పుడు ఏం చేస్తోంది?" అని అడిగింది రమేష్ వాళ్ల అమ్మ.
"మా నాన్నగారు పోయాక, ఇప్పుడు మా అమ్మ ఊళ్ళో ఇళ్లల్లో పనిమనిషిగా ఉంటోందండి" అన్నాడు రాము వినయంగా. "మీ అమ్మకు కుండలు చెయ్యటం రాదా?" అడిగాడు రమేష్ వాళ్ళ నాన్న.
"వచ్చండి! కానీ వేరే కూలి మనిషిని పెట్టుకోవాలంటే డబ్బులు లేవు కదండి, అదీ కాక కుండల్ని సంతలో పూర్తిగా అమ్మలేము- ఇల్లిల్లూ తిరిగి అమ్మాలంటే మా నాన్న లేకుండా వీలవ్వదు కదా" అన్నాడు రాము.
"ఒకసారి మీ అమ్మను వచ్చి కలవమను- కుండల తయారీలో సాయపడే మనిషి ఒకడిని కొన్నాళ్లపాటు నేను ఏర్పాటు చేస్తాను. మా దుకాణం ముందు కుండలు అమ్మే వసతీ కల్పిద్దాం..కుండలు మరి నాణ్యంగా ఉంటేనే సుమా?!" అన్నాడు రమేష్ వాళ్ల నాన్న.
రాము ఈ సంగతి చెప్పగానే సీతమ్మకు చక్కని ఆసరా దొరికినట్లయింది. ఆమె వెళ్ళి రమేష్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి, కుండల తయారీ మొదలు పెట్టింది. ఆమెకున్న అనుభవంతో చక్కని కుండలు తయారు చేసింది. రమేష్ వాళ్ల అమ్మ, నాన్న ఆమెకు వ్యాపారంలో సాయపడ్డారు. త్వరలోనే కూలి మనిషి ఖర్చులు స్వయంగా పెట్టుకోగలిగిందామె. ఊళ్ళోఅందరూ ఆమె కుండల నాణ్యతను మెచ్చుకోవటం మొదలుపెట్టారు.
"సీతమ్మా! ఇప్పుడు నీ వ్యాపారం నిలదొక్కుకున్నట్లే. జనాలు మీ ఇంటికే వచ్చి కుండలు కొనుక్కెళ్తారు. కాబట్టి ఇప్పుడు కుండల్ని మీ ఇంటి చావడిలోనే పేర్చి పెట్టు- వ్యాపారం బాగా నడవకపోతే మళ్ళీ మా దుకాణం ముందు పెట్టుకుందువులే" అన్నాడు రమేష్ వాళ్ల నాన్న.
ఆయన సలహా మేరకు సీతమ్మ తన కుండల వ్యాపారాన్ని తన ఇంటికే మార్చింది. ఇప్పుడు సంత సమయంలోనే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కని కుండలు లభిస్తున్నాయి. ఎందుకంటే సీతమ్మ ఇంటి ముందున్నై, అందమైన కుండల వరసలు!
ఊళ్ళో ఎవరికి కుండలు కావాలన్నా, పొయ్యిలు కావాలన్నా మొదట గుర్తు వచ్చేది సీతమ్మే!