మొదటి పద్యం:

చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

ఆంధ్ర మహా భాగవతంలోని పాత్రల చేత పోతన చెప్పించిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటి.

హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు-
“బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.

ఈ పద్యం బాగా చదువుకోవాలని చెప్పటమే కాదు; చదువు ఎలా ఉండాలో చెబుతున్నది కూడాను- చదువు ఏం చెయ్యాలటనో చూశారా? అది మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకునే శక్తినివ్వాలట! అంటే మనం చదువుకొని, మంచేంటో-చెడేంటో తెలుసుకోవాలన్నమాట!

రెండో‌పద్యం

విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

చదువును మెచ్చుకుంటూ ఏనుగు లక్ష్మణ కవి రాసిన ఈ పద్యం 'సుభాషిత రత్నావళి' లోది.

“విద్య రహస్యంగా దాచిపెట్టుకున్న డబ్బులాంటిది. మనుషులకు విద్యే అందం. విద్య వల్లనే కీర్తి-ప్రతిష్ఠలు కలుగుతాయి. అన్ని సుఖాలనూ అందజేసేది విద్యే. విద్య గురువులాగా వివేకాన్నిస్తుంది. విదేశాలలో‌మనకు చుట్టం విద్యే. విద్య అన్నిటికంటే గొప్ప దైవం. విద్యకు సాటివచ్చే సంపద ఈ లోకంలో మరేదీ‌లేదు. రాజాధిరాజుల చేతకూడా పూజింపబడుతుంది విద్య. అంత గొప్పదైన విద్యను నేర్చుకోనివాడు అసలు మనిషేనా? కాదు” అంటున్నది ఈ పద్యం.

భర్తృహరి అనే గొప్ప సంస్కృత కవి మూడు వందల మంచి సూక్తులతో “సుభాషిత త్రిశతి” అనే పుస్తకం రాశాడు. ఏనుగు లక్ష్మణకవి దాన్ని మొత్తాన్నీ భావం ఏమాత్రం చెడకుండా, చక్కని తెలుగు పద్యాలుగా మలచాడు. వీటిలో ఒక్కో పద్యం ఒక్కో‌ఆణి ముత్యం!