అనగనగా ఒక ఊరిలో రాజీవ్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. రాజీవ్ చాలా మంచి పిల్లవాడు. కాని ఎప్పుడు మొదలయ్యిందోగాని, వాడికి ఒకే ఒక చెడ్డ అలవాటు అంటుకున్నది: అదేమిటంటే, బద్ధకం!

ఏ పనినైనా 'తరువాత చేద్దాంలే' అనుకుంటాడు. వాళ్ల అమ్మావాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా, వాడి తీరు మటుకు మారేది కాదు. మొదట్లో వాడు చాలా చురుకుగానే ఉండేవాడు. బడిలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా చటుక్కున సరైన సమాధానం చెప్పేసేవాడు. అయితే ఈ బద్ధకం మొదలయ్యాక వాడు చదువులో కూడా వెనకబడి పోయాడు.

ఎప్పటి లాగానే రోజూ బడికి వెళ్ళేవాడు; కానీ బడి నుండి వచ్చిన తరువాత ఇక పుస్తకాలు ముట్టేవాడు కాదు. చదువుకునేవాడు కాదు; హోం వర్కు కూడా చేసుకునేవాడు కాదు. 'రేపు చేస్తానులే!' అనేవాడు. మరి ఆ 'రేపు' ఎంతకీ వచ్చేది కాదు!

వాడు ఎనిమిదో తరగతిలో ఉండగా వాళ్ళింటికి వచ్చాడు, సూర్యం మామయ్య. సూర్యం మామయ్య పొరుగూరులో ఉపాధ్యాయుడు. రాజీవ్‌ని చూడగానే వాడి సమస్య ఏంటో గుర్తించాడాయన. "ఒరే , అల్లుడూ! నాకు ఓ వ్యసనం అంటుకున్నదిరా! ఏరోజుకారోజున పేపర్లో వచ్చే 'సుడోకు'; ఆదివారం పదరంగం- ఇవి చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇవాల్టి పేపరూ, పోయిన ఆదివారం ప్రత్యేకమూ- ఇవ్వరాదూ, కొంచెం" అన్నాడు రాజీవ్ తో.

రాజీవ్‌కి అప్పటివరకూ 'సుడోకు' గురించి తెలీదు. సూర్యం మామయ్య ప్రయత్నిస్తుంటే చూసి వాడూ కొంచెం కొంచెంగా నేర్చుకున్నాడు. అటుపైన మామయ్య వాడికోసం అంతకు ముందు సుడోకులూ కొన్ని చేసిపెట్టాడు- వివరణలు ఇస్తూ. ఇద్దరూ కలిసి కూర్చొని ఆదివారం పదరంగాలూ పరిష్కరించారు. ఇంకేముంది, రాజీవ్‌కి కూడా సుడోకుల వ్యసనం, పదరంగాల వ్యసనం అంటుకున్నది. ఏ రోజుకారోజు సుడోకు లూ, ఏ వారానికావారం పదరంగాలు చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది త్వరలోనే.

ఏనాడైనా సుడోకు సాధించలేక పోయినా, పదరంగం పరిష్కరించలేకపోయినా వాడు సూర్యం మామయ్యకు ఫోన్ చేసి ఎలా చెయ్యచ్చో అడగటం కూడా మొదలు పెట్టాడు. సూర్యం మామయ్య కూడా అప్పుడప్పుడూ ఫోన్ చేసి 'ఈరోజు సుడోకు భలే ఉందిరా!" అనో, "నిన్నటి పదరంగంలో నిలువు ఆరు ఉంది చూశావూ..?" అనో అనటం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో రాజీవ్‌కు తెలీకుండానే ఓ మాయ జరిగింది. ఏరోజుకారోజు పనిచేయటం అలవాటైనకొద్దీ, వాడి బద్ధకం ఎటుపోయిందో, పోయింది!

బద్ధకం వదిలించుకున్న రాజీవ్ పదో తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. వాడి ప్రగతిని గమనిస్తున్న సూర్యం మామయ్య నవ్వుకుంటూ అడిగాడు "ఒరే సూర్యం! పదో తరగతిలో మంచి మార్కులు రావాలంటే ఏం చెయ్యాలిరా?" అని.

"ముందు ఎలాగైనా చేసి, బద్ధకాన్ని వదిలించుకోవాలి మామయ్యా! చదువుకి బద్ధశత్రువు, బద్ధకం!" అన్నాడు సూర్యం, తడుముకోకుండా. వాడి బద్ధకం ఎలా పోయిందో వాడికి ఇంకా తెలీదు మరి!