తరువాత రాజకుమారులు విష్ణుశర్మతో "అయ్యా! మీ దయవల్ల పంచతంత్రంలో నాలుగు భాగాలు వినగలిగాం. చివరిదైన 'సంధి'ని కూడా వినాలని కుతూహలంగా ఉన్నది. దయచేసి దాన్నికూడా వివరించండి" అన్నారు. అప్పుడు నీతి శాస్త్రాలలోని రహస్యాలన్నీ తెలిసిన విష్ణుశర్మ ఇలా చెప్పాడు- "నెమలికి, హంసకూ జరిగిన యుద్ధం గురించి 'విగ్రహం'లో విన్నారుగా? ఆ విధంగా ఘోర యుద్ధం జరిగి, అనేకమంది సైనికులు ఇరు పక్షాలలోనూ మరణించిన తరువాత, క్షణ కాలంలో నెమలికి - హంసకు సంధి చేయించాయి గ్రద్ద - చక్రవాకాలు. అదెలా జరిగిందో చెప్తాను వినండి" అంటూ ఇట్లా చెప్పసాగాడు:

"అట్లా యుద్ధంలో తన పరివారాన్నంతా కోల్పోయి, దు:ఖ పూరితమైన మనసుతో, చావు తప్పి- కన్ను లొట్టబోయిన హంసరాజు, తన మంత్రి దీర్ఘదర్శిని సమీపించి, జరిగిన వినాశనాన్ని నెమరువేసుకున్నది: "సర్వజ్ఞా! మన కోటకు అంత ఘోరంగా అగ్గిపెట్టిన దుర్మార్గుడెవరు? మన కోటలోనే నివాసం ఉంటూ, మారువేషంతో మనల్ని మోసగించి, చిచ్చు అంటించిపోయిన శత్రుపక్షపు గూఢచారులు ఎవరైనా ఉండి ఉంటారా?" అన్నది.

వినయంతోటీ, దు:ఖంతోటీ తలవంచుకున్న చక్రవాక మంత్రి అప్పుడు తలెత్తి, "ప్రభూ! కారణం అంటూ ఏదీ లేకనే తమరి ఇష్టాన్ని చూరగొన్న నీలవర్ణుడు, అతని అనుచరులు మరెందుకో ఇప్పుడు అస్సలు కనిపించటం లేదు ! చూడగా, 'ఇదంతా ఆ విశ్వాస ఘాతకుడు చేసిన పనే' అని నాకు అనిపిస్తున్నది. ప్రభువులవారి అమాయ-కత్వమే ప్రభువులను ఇంతవరకూ తీసుకొచ్చింది. పుట్టు పూర్వోత్తరాలు తెలీకుండానే, కనుగొనకుండానే ఆగంత-కులకు మన హృదయంలో స్థానమిచ్చి నమ్మటం తప్పు. విశ్వాసపాత్రులుకాని అటువంటి దుర్మార్గులు చేసిన పనుల ఫలితం ఈ రోజున అనుభవించాల్సి వస్తున్నది" అన్నది.

అదివిన్న హంసరాజు కూడా క్షణ కాలం పాటు తనలో తాను ఆలోచించి "ఇది అంతా మా దురదృష్టం. మా అదృష్టం ఇట్లా ఉన్నప్పుడు వేరే ఎవరినో అనాల్సిన పని ఏమున్నది? దైవం ప్రతికూలించటం తప్ప ఈ విషయంలో మంత్రుల తప్పు వెంట్రుకవాసంత కూడా లేదు. పనిని చక్కగా నిర్వహించేందుకు మనుషులు ఎంత ప్రయత్నించినప్పటికీ, దైవం అనుకూలించనప్పుడు అది చెడిపోతుంది. నుదిటి రాతను తుడిచి వేయటం ఎవరికి సాధ్యం?" అని విచారంతో ఊరకుండిపోయింది.

అప్పుడు మంత్రి వినయంగా "లోకంలో తెలివితేటలు అంతగా లేనివారు తమకు కష్టాలు ఎదురైనప్పుడు దైవాన్ని నిందిస్తారు - కానీ తాము చేసిన పనులలోని తప్పులను గుర్తించరు. సరిపోని పదార్థాలను ఇష్టంగా తినే రోగుల మాదిరి, రాజులుకూడా తమ మేలు కోరి చెప్పే మంత్రుల సలహాలను త్రోసి- పుచ్చి, ఆత్మ వంచకులై, క్రొత్త మిత్రుల మోజులో పడి, అటుపైన పనులు చెడినప్పుడు, గర్వం అంతా నశించాక, అప్పుడు 'అదృష్టం' అని మాట్లాడతారు. మంచి మనసు తోటి, మేలుకోరే మంత్రులు ఇచ్చే సూచనలను-సలహాలను స్వీకరించని-వారు, మిత్రుల సలహా వినక చెడిన 'దీర్ఘసూత్రుడు' అనే చేప మాదిరి నశిస్తారు. మీకు ఆ కథ చెబుతాను వినండి" అంటూ మూడు చేపల కథను చెప్పసాగింది:

మూడు చేపల కథ

ఒక చెరువులో చాలా కాలంనుండి దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే చేపలు మూడు కలసి నివసిస్తూ ఉండేవి. ఆ కొలనులో చక్కని నీరు, సమృద్ధిగా ఆహారం ఉండటంతో, అవి అనేక సంవత్సరాలు అక్కడ సుఖంగా బ్రతికాయి.

అయితే ఒకానొక సమయంలో- 'వేసవి సమీపిస్తోంది' అనగా దీర్ఘదర్శి మిగిలిన రెండు చేపల దగ్గరకూ పోయి "మిత్రులారా! మీరు కూడా చూస్తున్నారుకదా! రోజు రోజుకూ వేసవి ఇంకా దగ్గరపడుతున్నది. ఇంకొన్నాళ్లకు నిజంగా నీళ్లు ఇమిరి- పోయేట్లున్నాయి. ఇక ఆ తర్వాత మనం వేరొక చోటుకి పోవాలంటే ఇక సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడే, ఈ చిన్న చెరువును వదిలి, లోతైన నీళ్లతో, అనేక జలచరాలకు ఆధారమై ఉండే మరో పెద్ద చెరువు దేనినైనా చేరదాం, పదండి" అన్నది.

అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు దానితో విభేదిస్తూ "భవిష్యత్తులో రాబోయే ప్రమాదానికి సంకేతాలు ఏవీ గట్టిగా కనబడటం లేదు. తెలివిగలవాళ్ళు ఎప్పటికి ఏది ప్రాప్తిస్తుందో, అప్పటికి-దానికి తగినట్లు- పనులు నెరవేర్చుకుంటూ పోయేందుకు ప్రయత్ని-స్తారు; తప్ప, 'ముందెప్పుడో ఆపదలు వస్తాయేమో' అని ఇప్పుడే మనస్సులో అనవసరపు విచారాన్ని పెట్టుకుని కుమిలిపోరు. చూడు, మనం ఉన్న ఈ మడుగంతా మహాసముద్రం మాదిరి ఇంతలా కళకళలాడుతుంటే, ఇప్పుడే ఇంత దు:ఖం ఎందుకు? అంతగా కష్టాలు తలెత్తితే, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే!" అన్నది.

ఆ రెండింటి మాటలూ విన్న దీర్ఘసూత్రుడికి ఏమి చేయాలో పాలుపోలేదు; ఏం చేయాలో తెలీక, ఊరకనే ఉండాలని నిశ్చయించు-కున్నది అది!

అయితే బాగా ఆలోచించిన దీర్ఘదర్శి - 'ఇంక ఇందులో ఉండటం మంచిదికాదు' అని నిర్ణయించుకుని, ముందుగానే జాగ్రత్తపడి, జల సమృద్ధి గల మరొక చెరువులోకి చేరుకున్నది.

ఆ తర్వాత కొన్నాళ్లు గడిచేసరికి , ఎండలు బాగా పెరిగాయి. పూట పూటకూ చెరువులో నీళ్లు మరింత తక్కువ అవ్వసాగాయి. అది గమనించిన జాలర్లు - వలలు, గాలాలు, ముళ్ల కర్రలు, ఊతాలు, బుట్టలు లాంటి సరంజామాతో వచ్చి దిగబడి, నీళ్లలోకి దిగి, నీటిలోగల చేపలన్నింటినీ పట్టుకుని ఒక్కొక్కదాన్నీ తాళ్ళకు గుచ్చడం మొదలుపెట్టారు.

అది గమనించిన ప్రాప్తకాలజ్ఞుడు అప్పటికప్పుడు ఒక ఉపాయాన్ని ఆలోచించింది - నీళ్లలోకి వేలాడుతున్న ఒక త్రాడును నోటితో కరచుకొని, గ్రుచ్చినచేప మాదిరి, గ్రుక్కుమిక్కు అనకుండా ఉండింది.

ఇక దీర్ఘసూత్రుడు మటుకు ఆ కష్టంనుండి తప్పించుకునే ఉపాయం కానరాక "ఏం చేయాలి! ఏం చేయాలి! ఎటు పోవాలి?" అని బెదురుతూ అటూ - ఇటూ దూకుతూ గంద-రగోళపడటం చూసి జాలరులు ఆ చేపను కర్రలతో అణచి చంపేశారు. తర్వాత ఆ జాలర్లు చేపల వేటను చాలించి, తాము పట్టుకొనిన చేపల ఒంటికి అంటిన మట్టిని కడగటం కోసం చేపల గుత్తులను నీళ్లలో జాడించేటప్పుడు, ఆ చేపల మాటున రెండు దవడలతోనూ తాడును అదిమి పెట్టుకుని చచ్చినట్లు కదలక మెదలక ఉన్న ప్రాప్తకాలజ్ఞుడు మెల్లగా దవడలు వదిలి, త్రాడును విడిచిపెట్టి, లోతట్టు నీళ్ళలో ప్రవేశించి, ప్రాణాలు కాపాడుకొన్నది.

కాబట్టి, స్నేహితులు మేలు కోరి చెప్పే మాటలు విననివాడు దీర్ఘసూత్రుని మాదిరిగా అంతం చెందాల్సి వస్తుంది. ఈ కథలో మరొక విశేషంకూడా ఉంది: 'ఇంకా వాటిల్లని కష్టాలను ముందుగానే గ్రహించి, జాగ్రత్తపడేవాడు దీర్ఘదర్శి మాదిరి ఆపదలకు దూరంగా ఉంటూ- సుఖాన్ని అనుభవిస్తాడు.

అలాకాక, ఎప్పటికప్పుడు తోచిన తీరులో మార్గాన్ని వెతుక్కుంటూ, ధైర్యంగా పనులు నెరవేర్చుకోచూసేవాడు ప్రాప్తకాలజ్ఞుని మాదిరి, అనేక అనుమానాలతోటి, భయాలతోటీ కూడుకొన్న జీవితాన్ని అనుభవిస్తాడు.

ఇక అటు భవిష్యత్తును గురించీ ఆలోచించలేక, ఇటు సమయానికి తగిన ఉపాయం తోచక, ఊరికే ఉండేవాడు- దీర్ఘసూత్రుని మాదిరి, తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆపదల పాలవుతాడు" అని చెబుతూండగానే, 'శత్రు దేశంలో ఏం జరిగిందో కనుక్కొనిరమ్మని' పంపబడిన ధవళాంగుడు వెనక్కువచ్చాడు.

ఆ కొంగ హంసరాజును చూసి నమస్కరించి, "ప్రభూ! 'ప్రతి క్షణమూ కోటకావలి అవసరము' అని ముందుగానే విన్నవించుకున్నాను కదా! ప్రభువులవారు నా మాటలు పట్టించుకొనక ఆ పనిని పక్కన పెట్టారు. దాని ఫలితం ఇప్పుడు తెలిసివస్తున్నది. గ్రద్ద పంపించిన 'మేఘవర్ణుడు' అనే కాకి చేతనే మన కోట మొత్తం దహింపబడిందట. ఆ కాకే, మీ వద్ద 'నీలవర్ణుడు' అనే పేరుతో చనువుగా ఉండేది అని తెలిసింది. ఆ విధంగా..." అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో తలఊపి, నిట్టూరుస్తూ, హంస అతని మాటలకు అడ్డంవచ్చి, "ఔనౌను. మేలు చేశాడనో, ఇష్టం అయినాడనో చెడ్డవాడిని నమ్మితే ఇట్లాగే అవుతుంది. చెట్టు కొమ్మ మీద పడుకొని నిద్రపోయినట్లు, అట్లా నమ్మిన వాడు క్రింద పడి, కాళ్ళు-చేతులు విరగ గొట్టించు-కుంటాడు. సందేహం లేదు. తర్వాత ఏం జరిగిందో చెప్పు" అన్నది. "అట్లా మన కోటను మొత్తాన్నీ కాల్చి తనకు గెలుపు కూర్చిన మేఘ వర్ణుడిని నెమలి రాజు అనేక విధాలుగా మెచ్చుకొని, సన్మానించింది. అటుపైన అది సంతోషంగా మంత్రి వైపుకు తిరిగి, 'పనిని పూర్తి చేసి గెలుపు సాధించిన సేవకుడి పని ఊరికే పోదు. అతనికి అన్ని విధాలా మేలు కూర్చే ప్రతిఫలం ఒకటి తప్పని- సరిగా కలుగు తుంది. ఇప్పుడు మనకు ఈ మేఘవర్ణుడు చేసిన మేలూ అంతే. ఇతనినే ఆ కర్పూర ద్వీప రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాను' అన్నది" అని చెప్పింది ధవళాంగుడు.

కొంగ ఇంతవరకూ చెప్పి ఆపగానే చిన్నబోయి, పరధ్యానంతో తన ఓటమి గురించిన ఆలోచనల్లో పడిపోయింది హంసరాజు .
(-తర్వాతి కథ మళ్ళీ చూద్దాం...)