మైకు!
ఇంగ్లీషు టీచరు: "సౌండ్ స్లీప్" అంటే ఏంటిరా, రామూ?
రాము: మరేనండి, మా నాన్నారి లాగా 'గురక పెడుతూ నిద్రపోవటం' అండి!

మతి మెరుపు!
పేషంటు: ఏమిటో డాక్టరుగారూ, కొన్ని సంగతులు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు నాకు!
డాక్టరు: ఏవి గుర్తుంటాయి, చెప్పండి!
పేషంటు: నేను ఎవరికైనా అప్పులు ఇస్తే అవి గుర్తుంటున్నాయండి.
డాక్టరు: భేష్! మరింకానేం! సరే, మరి గుర్తుండనివేమిటి?
పేషంటు: నేను తీసుకున్న అప్పులు సార్!

జై జై నాయకా!
తల్లి: (పిల్లాడిని చూసుకొని మురిసిపోతూ) వీడు తప్పక రాజకీయనాయకుడు అవుతాడండి! తండ్రి: నీకెలా తెలుసు?
తల్లి: మీరు కథ చెప్తున్నపుడు "ఊ" కొట్టకుండా "జై" కొడుతున్నాడు, విన్నారా?

తెలుగా, ఇంగ్లీషా?
ఉద్యోగి: సార్ మీరు జీతాలిచ్చేప్పుడు ఇంగ్లీషు నెలల్ని కాకుండా తెలుగు నెలల్ని అనుసరిస్తే బాగుంటుందండి!
ఆఫీసరు: అదేమి?
ఉద్యోగి: తెలుగు నెలల్లో అయితే అధికమాసాలూ అవీ వస్తుంటాయి కదండీ! ఉత్సాహంగా ఉంటుంది మాకు!

చాలా అవసరం! పేషంట్: డాక్టరుగారూ, నాకిప్పుడు ఆపరేషన్ అవసరమంటారా..?
డాక్టరమ్మ: అవసరం లేకపోతే మేమెందుకు చేస్తామమ్మా..మాకూతురికి నెక్లెస్ చేయిస్తానని మాటిచ్చాను మరి!

ఫేస్ బుక్ హెడ్మాస్టర్: మీ అబ్బాయి ఇంట్లో సరిగ్గా చదువుకుంటున్నాడా?
పేరెంట్: రోజూ చదువుకుంటాడండీ, చెప్పక్కర్లేదు వాడికి..
హెడ్ మాస్టర్: ఏం చదువుతాడు వాడు?
పేరెంట్: అదేదో, ఫేస్ బుక్ అట కదండీ , ఎప్పుడడిగినా, ఆ బుక్కే చదువుతున్నానంటాడు..

చికెన్ కాదు, కోడి! భార్య: ఏంటండీ, డాక్టరుగారు చికెన్ తినొద్దన్నారుకదా?
భర్త: అయ్యో! నీకు ఇంగ్లీషు అస్సలు దాదేమే? చికెన్ అంటే కోడి పిల్ల. ఇది చికెన్ కాదు - కోడి!

స్లిప్ టెస్ట్ వెంగళప్ప: అదేంట్రా, పరీక్ష టైమింకా అవ్వనేలేదు, అప్పుడే వచ్చేశావు..
వెంగళప్ప కొడుకు: ఏమో నాన్నా! 'స్లిప్ టెస్ట్' అన్నారు కదా అని నాలుగు స్లిప్ లు తీసుకెళ్ళాను; వెనక్కు తిప్పి పంపేశారు!
వెంగళప్ప: పిచ్చోడా! 'స్లిప్ టెస్ట్' అన్నారు గానీ 'స్లిప్స్ టెస్ట్' అనలేదుగా?! ఒక్క స్లిప్ తీసుకెళ్ళి ఉంటే రాయనిచ్చేవాళ్ళు!

పెద్ద బాలశిక్ష
హాస్టల్ వార్డెన్: పిల్లలూ.. మీకు రేపు పెద్దబాల శిక్ష ఉంటుందిరా!
(అది వినగానే వెంగళప్ప కొడుకు హాస్టల్ నుండి ఇంటికి పారిపోయాడు-)
వెంగళప్ప: ఏంట్రా బాబూ, హాస్టల్ నుండి ఎందుకు పారిపోయి వచ్చావు?
కొడుకు: నాన్నా, రేపు హాస్టల్ లోని పెద్ద బాలలందరికీ శిక్షట..'మర్నాడు మా వంతేమో' అని, తెలివిగా తప్పించుకొని వచ్చేశా వెంగళప్ప: మా నాయనే! ఎంత తెలివిరా, నీది!

ముదురు!
టీచర్ (కోపంగా): రామూ! సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదురోజులూ- హోంవర్కు చెయ్యకుండా వచ్చి తిట్లు తిన్నావు. నీ గురించి హెడ్మాస్టరు గారికి ఫిర్యాదు చేస్తాను. నువ్వు ఏం చెప్పుకుంటావో ఆయనకే చెప్పుకో.
రాము: నేనేమంటాను సార్, శనివారం-ఆదివారం బడికి శలవలు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతాను, అంతే!

లాంగ్ జర్నీ
వెంగళప్ప రైళ్లో వెళ్తూ, వచ్చిన ప్రతీ స్టేషనులోనూ, దిగడం, పరుగున వెళ్ళిటికెట్టు కొనుక్కుని, మళ్లీ వచ్చి రైలెక్కడం జరుగుతోంది. అలా చాలా స్టేషన్లు దాటాక పక్క వ్యక్తి అడిగాడు:
ఏంటండీ, ప్రతీ స్టేషనులోనూ దిగి టికెట్టు తీసుకుంటున్నారు?
వెంగళప్ప: ఈ మధ్య నాకు ఆరోగ్యం సరీగాలేక డాక్టరుదగ్గరికెళ్తే, లాంగ్ జర్నీలు వద్దని చెప్పారండి. అప్పటినుండి దూర ప్రయాణాలు చెయ్యట్లేదు. అన్నీ‌చిన్న చిన్న ప్రయాణాలే!

చల్లని బాబు!
సతీష్: నాన్నా! మా క్లాసులో అందరూ చందమామ మీదకు వెళ్తామన్నారు; నేను మాత్రం సూర్యుడి మీదికి వెళ్తానని చెప్పా!
తండ్రి: అదెట్లా వీలవుతుందిరా? అక్కడికి వెళితే కాలిపోతావుగా?
సతీష్ : అయ్యో! నీక్కూడా అర్థం కాలేదా నాన్నా?! నేను వెళ్ళేది రాత్రి పూటే!

మా నాయనే!
సురేష్ సెకండ్ షో సినిమా చూసి అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చాడు.
అమ్మ (కోపంగా) : ఎక్కడికి వెళ్ళావురా?
టింకూ: 'అమ్మప్రేమ' సినిమా చూడడానికి వెళ్ళానమ్మా!

వీరుడు!
రాజు: నేను ఒక సింహం కాలు, ఏనుగు తొండం, గాడిద ముక్కు విరగొట్టాను.
ఆనంద్: వావ్! అప్పుడు ఏమైంది?
రాజు: ఏమవుతుంది? షాపులో బొమ్మలువిరగ్గొట్టినందుకు షాపతను బాగా కొట్టాడు- ఇప్పటివరకు ఆ నొప్పి తగ్గలేదు...!

పిచ్చి కథ!

ఒక సైనికుడు రాత్రిపూట నడుస్తూ, పొరపాటున నీళ్లులేని బావిలో పడిపోయి, బిగ్గరగా కేకలేశాడు.

దగ్గర్లోనే ఉన్న జూనియర్ ఆఫీసర్‌కి ఆ అరుపులు వినబడ్డాయి.

వెంటనే బావి దగ్గరికి వెళ్లి, ఒక తాడు చివరను తను పట్టుకొని, మరో చివరను బావిలోకి విసిరాడు. "దాన్ని పట్టుకో! పైకిఎక్కి రా" అని అరిచాడు.

సైనికుడు తాడు పట్టుకుని మెల్లగా బావి పైకి వచ్చాడు. ఇంకా పైకి ఎక్కకనే జూనియర్ ఆఫీసర్‌ను చూసి, అలవాటు ప్రకారం‌ సెల్యూట్ చేసాడు! మళ్ళీ దఢాలున బావిలో పడిపోయాడు.

"నాకు సెల్యూట్ చెయ్యద్దు" అన్నాడు జూనియర్ ఆఫీసర్, మళ్ళీ త్రాడును లోనికి వదుల్తూ.

ఈసారి సైనికుడు తాడు పట్టుకొని జాగ్రత్తగా పైకి రాసాగాడు.

అంతలోనే సీనియర్ ఆఫీసర్ ఒకాయన ఆత్రుతతో బావి దగ్గరకు వచ్చాడు.

ఆయన్ని చూడగానే ఈసారి జూనియర్ ఆఫీసర్ తాడును వదిలేసి, ఆయనకు సెల్యూట్ చేశాడు-

మళ్ళీ మరో దఢాల్!

హోటల్ వారి అబ్బాయి!
టీచర్: ఒరేయ్ వినయ్, పౌష్ఠికాహారం, సంపూర్ణాహారం అంటే ఏమిటి?
వినయ్: పౌష్ఠికాహారం అంటే ప్లేట్మీల్స్, సంపూర్ణ ఆహారం అంటే పుల్‌మీల్స్ టీచర్.

అనుమానపు పక్షి!
టీచర్: సాయీ! 55 అంకెను పలకమీద రాసి చూపించు.
సాయి: ఎలా రాయాలి టీచర్?
టీచర్: చాలా సులభం కదరా?! 5 పక్కన మరో 5 వేయడమే!
సాయి: ఏవైపు టీచర్! కుడివైపా, ఎడమవైపా?

నిదానమే ప్రధానం!
టీచర్: రేవంత్! ఇవాళ స్కూలికి ఆలస్యంగా వచ్చా వేంటి?
రేవంత్: చాలా నెమ్మదిగా నడుచు కుంటూ వచ్చాను సార్.
టీచర్: నెమ్మదిగా నడవమని నీకెవరు చెప్పారు నాయనా?
రేవంత్: మరి స్కూల్ బయట కొత్తగా పెట్టిన బోర్డులో 'నిదానమే ప్రధానం' అని రాసారు సార్!

ఓ!మై గాడ్!
టీచర్:'మనం చనిపోయాం'బహువచనం, అయితే నేను చనిపోయాను, ఏమవుతుంది?
విద్యార్థి: స్కూలుకు సెలవు వస్తుందండి...!

బలే శక్తి! తండ్రి: ఒరేయ్, మీ స్కూల్లో నీకు జ్ఞాపకశక్తికి బహుమతి ఇచ్చారటగా, ఏదీ చూపించు.
కొడుకు: ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు నాన్నా!