పెద్ద పల్లిలో నివసించే సోమన్న చాలా పేదవాడు. అతనూ, అతని భార్య అంజలి ఇద్దరూ శ్రమజీవులు. వాళ్ల కొడుకు రాము తెలివైనవాడు; చక్కగా చదువుకునేవాడు. వాళ్ళకు ఉండే ఆస్తల్లా ఒక ఇల్లే. ఆ ఇల్లు గడవటం కోసం ఏ రోజున కూలి దొరికితే ఆ రోజున భార్యా భర్తలిద్దరూ పనికి పోతుండేవాళ్ళు. వాళ్ల అదృష్టం కొద్దీ రాము కూడా బాధ్యతగా చదువుకునేవాడు; చాలా పొదుపుగా ఉండేవాడు.
వాళ్ళ ఇంటి ప్రక్కనే ఒక డాబా ఇంట్లో నివసించేవారు, వెంకన్న- అతని భార్య శ్రీదేవి. వాళ్ల పిల్లలు పవన్, ప్రసన్న ఇద్దరూ పట్నంలో పెద్ద హాస్టలులో ఉండేవాళ్ళు. వెంకన్న, శ్రీదేవి ఇద్దరూ ఎప్పటికప్పుడు వాళ్ళకు చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు తీసుకెళ్లటం, ఏమడిగితే అవి కొనివ్వటం చేసేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా దుబారాగా ఉండేవాళ్ళు. చీటికీ మాటికీ తల్లిదండ్రులను కారు తీసుకొని రమ్మనేవాళ్ళు. పార్టీలనీ, పిక్నిక్కులనీ జల్సాగా ఉండేవాళ్లు.
"మరీ అంత పిసినారుల్లాగా ఎందుకుంటారు మీరు? పాపం మీ పిల్లవాడికి పుట్టినరోజన్నా సరిగ్గా చేయరే?" అని సోమన్న మీద జాలి కురిపించేవాళ్ళు వెంకన్న-శ్రీదేవి. "మాదగ్గర ఉన్నది ఇంతేనండి- ఉన్నంతలో సర్దుకుపోకపోతే అప్పుల పాలైపోతాం" అనేవాడు సోమన్న. ఎప్పుడైనా రాముకు ఇలాంటి సంగతులు తెలిస్తే "మనకి నచ్చినట్లు మనం ఉంటాం నాన్నా, దండగ ఖర్చులు ఎందుకు చేస్తాం? అయినా వాళ్లకెందుకుట, ఇవన్నీ?!" అనేవాడు.
చూస్తూ చూస్తూండగానే పిల్లలంతా పెద్దవాళ్లయ్యారు. పవన్, ప్రసన్న ఇద్దరూ ఫ్యాషన్లనీ, పోజులనీ ఇంట్లో డబ్బంతా తీసుకెళ్ళి ఖర్చు పెడుతూనే ఉన్నారు. వయసుతోబాటు వాళ్ల ఖర్చులూ పెరిగాయి; వాళ్ల అలవాట్లూ మారాయి. చెడు అలవాట్లు చాలా చోటు చేసుకున్నాయి.
వెంకన్న, శ్రీదేవి ఇప్పుడు వాళ్లని "డబ్బులు ఇలా తగలేస్తారేమిటి, డబ్బులు చెట్లకు కాయవు" అనిఏమన్నా అంటే వాళ్ళు కొట్టినంతపని చేస్తున్నారు. 'రోజూఇంత డబ్బు ఇవ్వాల్సిందే' అని షరతులు విధిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఈనాడు డబ్బుంది; కానీ సంతోషం పూర్తిగా కరవు అయ్యింది.
ఇక రాము చక్కగా చదువుకొని పెద్ద ఇంజనీరు అయ్యాడు. పేరున్న కంపెనీవాళ్ళు అతనికి చాలా జీతంఇచ్చి పనిలో పెట్టుకున్నారు. తనకున్న మంచి అలవాట్లతో ముసలి తల్లిదండ్రులకు సాయంగా నిలిచాడు రాము. ఇప్పుడు కూడా సోమన్న, అంజలి దుబారాగా లేరు- కష్టాలు తీరినందుకు, మంచి రోజులు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు. రోజూ తమకు చేతనైనంత పని చేస్తూ, పదిమందికీ సాయపడుతూ హుందాగా బ్రతుకుతున్నారు.
కష్టానికి ఫలితం వృధా పోదు.